Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నైపై గుజరాత్ గెలుపు
- రుతురాజ్ మెరుపులు వృథా
- ఛేదనలో శుభ్‌మన్ గిల్ జోరు
నవతెలంగాణ-అహ్మదాబాద్
డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ బోణీ కొట్టింది. ఐపీఎల్16 ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై టైటాన్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 179 పరుగుల ఛేదనలో శుభ్‌మన్ గిల్ (63, 36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) కదం తొక్కాడు. వృద్దిమాన్ సాహా (25), సాయి సుదర్శన్ (22), విజరు శంకర్ (27) రాణించారు. చివర్లో రాహుల్ తెవాటియ (15 నాటౌట్క్ష్మి), రషీద్ ఖాన్ (10 నాటౌట్, 3 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) అదిరే ముగింపు ఇచ్చారు. 19.2 ఓవర్లలోనే లాంఛనం ముగించిన టైటాన్స్ సీజన్లో తొలి విజయం నమోదు చేసింది. అంతకముందు, రుతురాజ్ గైక్వాడ్ (92, 50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగటంతో చెన్నై సూపర్‌కింగ్స్ 178 పరుగులు చేసింది.
రుతురాజ్ షో : టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. డెవాన్ కాన్వే (1), రుతురాజ్ గైక్వాడ్ (92) తొలి వికెట్‌కు శుభారంభం అందించలేదు. కొత్త బంతితో మహ్మద్ షమి టైటాన్స్‌కు బ్రేక్ సాధించాడు. డెవాన్ కాన్వేను షమి సాగనంపాడు. మోయిన్ అలీ (23), రుతురాజ్ గైక్వాడ్ సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్ జోరు పెంచారు. ఇద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదారు. అల్జారీ జొసెఫ్ వేసిన తొలి ఓవర్లో రుతురాజ్ గైక్వాడ్ ఏకంగా 18 పరుగులు పిండుకున్నాడు. అలవోకగా సిక్సర్లు సంధించిన రుతురాజ్‌కు బంతులు వేసేందుకు టైటాన్స్ బౌలర్లు తడబడ్డారు. మూడు ఫోర్లు, ఐదు సిక్సర్లతో 23 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన రుతురాజ్ గైక్వాడ్‌కు మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. 11 ఓవర్లలోనే 100 పరుగుల మార్క్ చేరుకున్న సూపర్‌కింగ్స్.. చివరి 9 ఓవర్లలో 78 పరుగులే చేయగల్గింది. డెత్ ఓవర్లలో వరుస వికెట్లు పడగొట్టిన గుజరాత్ టైటాన్స్ చెన్నైని నిలువరించింది. బెన్ స్టోక్స్ (7), అంబటి రాయుడు (12), రవీంద్ర జడేజా (1) అంచనాలు అందుకోలేదు. చివర్లో కెప్టెన్ ఎం.ఎస్ ధోని (14 నాటౌట్, 7 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) కండ్లుచెదిరే సిక్సర్‌తో అభిమానులను అలరించాడు.
స్కోరు వివరాలు :
చెన్నై సూపర్‌కింగ్స్ : 178/7 (రుతురాజ్ 92, మోయిన్ అలీ 23, షమి 2/29, రషీద్ 2/26)
గుజరాత్ టైటాన్స్ : 182/5 (శుభ్‌మన్ 63, విజరు శంకర్ 27, రాజ్యవర్థన్ 3/36, జడేజా 1/28)