Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరుస వైఫల్యాల నుంచి గొప్పగా పుంజుకున్న తెలుగు తేజం, రెండు సార్లు ఒలింపిక్ మెడలిస్ట్ పి.వి సింధు ఈ సీజన్లో తొలిసారి ఓ టోర్నీ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీఫైనల్లో సింగపూర్ షట్లర్‌ను చిత్తు చేసిన సింధు వరుస గేముల్లో గెలుపొంది స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నీ టైటిల్ పోరుకు సిద్ధమైంది.
- ఫైనల్లో అడుగుపెట్టిన తెలుగు తేజం
- సెమీస్‌లో సింగపూర్ షట్లర్ చిత్తు
- స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నీ
మాడ్రిడ్ (స్పెయిన్) : భారత అగ్రశ్రేణి షట్లర్ పి.వి సింధు సీజన్లో తొలి డబ్ల్యూబిఎఫ్ టైటిల్‌పై కన్నేసింది. వరుసగా ఇండియా ఓపెన్, మలేషియా ఓపెన్, ఆల్ ఇంగ్లాండ్, స్విస్ ఓపెన్‌లో నిరాశపరిచిన రెండు సార్లు ఒలింపిక్ మెడలిస్ట్.. ప్రపంచ ర్యాంకింగ్స్‌లోనూ టాప్-10 ఆవలకు పడిపోయింది. ఒత్తిడిలో గొప్పగా ఆడే అలవాటున్న సింధు.. స్పెయిన్ మాస్టర్స్‌లో అదే పునరావృతం చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో దుమ్మురేపే ప్రదర్శనతో స్పెయిన్ మాస్టర్స్ మహిళల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. సింగపూర్ షట్లర్ యో జియ మిన్పై వరుస గేముల్లో 24-22, 22-20తో ఘన విజయం సాధించింది.
వరుస గేముల్లో..
సింగపూర్ షట్లర్ యో జియా మిన్పై సింధుకు మంచి రికార్డుంది. గతంలో ఆడిన మూడు మ్యాచుల్లోనూ మూడో గేమ్‌కు వెళ్లకుండానే విజయాలు నమోదు చేసింది. ఇటీవల సింగపూర్ అమ్మాయి పుంజుకోవటం.. సింధు ఫామ్‌లో లేకపోవటంతో సెమీస్ సమరంపై ఆసక్తి పెరిగింది. రెండు గేముల్లో సింధు గెలుపొందినా.. రెండు గేములను ప్రత్యర్థి షట్లర్ టైబ్రేకర్ వరకు తీసుకెళ్లింది. తొలి గేమ్‌లో సింధు వెనుకంజ వేసింది. 9-11తో విరామ సమయానికి ఆధిక్యం కోల్పోయింది. 15-20తో గేమ్ పాయింట్ ప్రమాదంలో పడిన సింధు.. అద్భుత ప్రదర్శన చేసింది. వరుసగా ఐదు గేమ్ పాయింట్లను కాచుకుంది. 20-20తో స్కోరు సమం చేసింది. 22-22తో మరోసారి స్కోరు సమమైనా.. వరుసగా రెండు పాయింట్లతో 24-22తో తొలి గేమ్‌ను గెల్చుకుంది. ఇక రెండో గేమ్ నువ్వా నేనా అన్నట్టు సాగింది. విరామ సమయానికి 11-6తో సింధు ఐదు పాయింట్ల ముందంజలో నిలిచింది. కానీ ద్వితీయార్థంలో సింగపూర్ షట్లర్ పుంజుకుంది. 14-14 వద్ద స్కోరు సమం చేసింది. 17-14తో సింధు మరోసారి ముందంజ వేసినా.. జియా మిన్ 17-17తో మరోసారి సమవుజ్జీగా నిలిచింది. 18-18, 20-20తో ఉత్కంఠగా సాగిన రెండో గేమ్ టైబ్రేకర్లోకి అడుగుపెట్టింది. ఒత్తిడిలో వరుసగా రెండు పాయింట్లు గెల్చుకున్న సింధు రెండో గేమ్‌తో పాటు ఫైనల్స్ బెర్త్‌ను కైవసం చేసుకుంది. 48 నిమిషాల పాటు సాగిన మ్యాచ్‌లో సింగపూర్ షట్లర్‌ను చిత్తు చేసిన పి.వి సింధు సీజన్లో తొలి టైటిల్ పోరుకు సిద్ధమైంది.