Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిర్‌పోర్ట్‌లో చాంపియన్‌కు ఘన స్వాగతం
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐబీఏ ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌గా వరుసగా రెండో ఏడాది పసిడి పతకం సాధించిన భారత స్టార్ బాక్సర్, తెలంగాణ ముద్దు బిడ్డ నిఖత్ జరీన్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం పలికింది. ఇటీవల న్యూఢిల్లీ వేదికగా మార్చి 15-26న జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో నిఖత్ జరీన్ మహిళల 50 కేజీల విభాగంలో పసిడి పతకం సాధించింది. 2022 ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో మహిళల 52 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ పసిడి పతకం సాధించిన సంగతి తెలిసిందే. దిగ్గజ బాక్సర్ ఎం.సీ మేరీకోమ్ అనంతరం వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో రెండు పసిడి పతకాలు సాధించిన తొలి భారత బాక్సర్‌గా చరిత్ర సృష్టించిన నిఖత్ జరీన్ చారిత్రక పసిడి పంచ్ అనంతరం శనివారం హైదరాబాద్‌కు చేరుకుంది. ఉదయం 9 గంటలకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న నిఖత్ జరీన్‌కు తెలంగాణ సంప్రదాయ కళా రూపాల ప్రదర్శనతో ఘన స్వాగతం పలికారు. రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, శాట్స్ చైర్మెన్ ఆంజనేయ గౌడ్, తెలంగాణ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు వేణుగోపాలచారి, రాష్ట్ర బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షులు చాముండేశ్వరినాథ్, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియ సహా శాట్స్ ఉన్నతాధికారులు, క్రీడాకారులు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.