Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డక్‌వర్త్ పద్దతిలో కోల్‌కతపై గెలుపు
- నిప్పులు చెరిగిన అర్షదీప్ సింగ్
- ఛేదనలో నైట్‌రైడర్స్ చతికిల!
తొలి ఐపీఎల్ కాంక్షతో రగిలిపోతున్న పంజాబ్ కింగ్స్ సీజన్16 తొలి మ్యాచ్‌లోనే గెలుపు బోణీ కొట్టేసింది. వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌పై డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత పంజాబ్ కింగ్స్ 191/5 పరుగులు చేయగా.. ఛేదనలో కోల్‌కత 16 ఓవర్లలో 146/7 పరుగులు చేసింది. వర్షం అంతరాయంతో కోల్‌కత ఛేదనలో చివరి నాలుగు ఓవర్ల ఆట సాధ్యపడలేదు. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో విజేతను తేల్చారు.
నవతెలంగాణ-మొహాలి :ఐపీఎల్ 16ను పంజాబ్ కింగ్స్ విజయంతో మొదలెట్టింది. మొహాలిలో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్‌పై పంజాబ్ కింగ్స్ డక్‌వర్త్‌లూయిస్ పద్దతిలో 7 పరుగుల తేడాతో గెలుపొందింది. యార్కర్ల హీరో అర్షదీప్ సింగ్ (3/19) నిప్పులు చెరిగే ప్రదర్శనతో చెలరేగటంతో కోల్‌కత నైట్‌రైడర్స్ ఓ దశలో 80 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది. 192 పరుగుల భారీ ఛేదనలో కోల్‌కత 16 ఓవర్లలో 146/7 పరుగులే చేసింది. ఆ తర్వాత ఎడతెగని వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితాన్ని నిర్ణయించగా.. పంజాబ్ కింగ్స్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగుల భారీ స్కోరు చేసింది. భానుక రాజపక్స (50, 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), శిఖర్ ధావన్ (40, 29 బంతుల్లో 6 ఫోర్లు) రాణించారు. మూడు వికెట్లతో మెరిసిన అర్షదీప్ సింగ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
అర్షదీప్ అదుర్స్ : యార్కర్ల హీరో అర్షదీప్ సింగ్ (3/19) మూడు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. కొత్త బంతితో ఇన్నింగ్స్ రెండో ఓవర్లో మన్దీప్ సింగ్ (2), అనుకూల్ రారు (4) వికెట్లను పడగొట్టి కోల్‌కత నడ్డి విరిచాడు. నాథన్ ఎలిస్, సికందర్ రజా, శామ్ కరణ్‌లు సైతం అర్షదీప్‌కు సహకరించటంతో కోల్‌కత వికెట్లు టపటపా పడ్డాయి. ఆ జట్టు 80 పరుగులకే 5 వికెట్లు చేజార్చుకుంది. ఈ పరిస్థితుల్లో వెంకటేశ్ అయ్యర్ (34), అండ్రీ రసెల్ (35) కోల్‌కతను ఆదుకున్నారు. కీలక భాగస్వామ్యంతో నైట్‌రైడర్స్‌ను రేసులో నిలిపారు. డెత్ ఓవర్లకు ముందే ఈ ఇద్దరూ డగౌట్‌కు చేరటంతో కోల్‌కతపై ఒత్తిడి పెరిగింది. చివరి 24 బంతుల్లో 46 పరుగులు చేయాల్సిన దశలో వరుణుడు మ్యాచ్‌కు అడ్డు తగిలాడు. ఆట సాగే అవకాశం లేకపోవటంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఫలితాన్ని తేల్చారు. బౌలర్ల మెరుపులతో ఆది నుంచి మ్యాచ్‌పై పట్టు బిగించిన పంజాబ్ కింగ్స్ 7 పరుగుల తేడాతో గెలుపొందింది.
సమిష్టి మెరుపులు : తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ భారీ స్కోరు నమోదు చేసింది. జట్టులో ఎవరూ భారీ స్కోరు చేయకపోయినా.. పంజాబ్ బ్యాటర్లు సమిష్టిగా మెరవటంతో 191 పరుగులు సాధ్యమయ్యాయి!. కెప్టెన్ శిఖర్ ధావన్ (40), భానుక రాజపక్స (50) రెండో వికెట్‌కు విలువైన భాగస్వామ్యం నిర్మించారు.భానుక రాజపక్స ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 30 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదాడు. అర్థ సెంచరీకి చేరువైన ధావన్ వికెట్ కోల్పోయినా.. ఆ జట్టు దూకుడు తగ్గలేదు. జితేశ్ శర్మ (21), సికిందర్ రజా (16) సహా శామ్ కరణ్ (26 నాటౌట్, 17 బంతుల్లో 2 సిక్స్‌లు), షారుఖ్ ఖాన్ (11 నాటౌట్, 7 బంతుల్లో 2 ఫోర్లు) ధనాధన్ షో చూపించారు. కోల్‌కత నైట్‌రైడర్స్ బౌలర్లలో టిమ్ సౌథీ (2/54) 54 పరుగులు ఇచ్చినా రెండు వికెట్లు పడగొట్టాడు. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, ఉమేశ్ యాదవ్ తలా ఓ వికెట్ ఖాతాలో వేసుకున్నారు.
స్కోరు వివరాలు :
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : ప్రభుసిమ్రన్ (సి) గుర్బాజ్ (బి) సౌథీ 23, ధావన్ (బి) చక్రవర్తి 40, భానుక (సి) రింకూ (బి) ఉమేశ్ 50, జితేశ్ (సి) ఉమేశ్ (బి) సౌథీ 21, రజా (సి) రాణా (బి) నరైన్ 16, శామ్ కరణ్ నాటౌట్ 26, షారుఖ్ నాటౌట్ 11, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191.
వికెట్ల పతనం : 1-23, 2-109, 3-135, 4-143, 5-168.
బౌలింగ్ : ఉమేశ్ 4-0-27-1, సౌథీ 4-0-54-2, నరైన్ 4-0-40-1, చక్రవర్తి 4-0-26-1, ఠాకూర్ 4-0-43-0.
కోల్‌కత నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : మన్దీప్ (సి) కరణ్ (బి) అర్షదీప్ 2, గుర్బాజ్ (బి) ఎలిస్ 22, అనుకూల్ (సి) రజా (బి) అర్షదీప్ 4, వెంకటేశ్ అయ్యర్ (సి) రాహుల్ (బి) అర్షదీప్ 34, నితీశ్ రాణా (సి) రాహుల్ (బి) రజా 24, రింకూ సింగ్ (సి) రజా (బి) రాహుల్ 4, రసెల్ (సి) రజా (బి) కరణ్ 8, శార్దుల్ నాటౌట్ 8, నరైన్ నాటౌట్ 7, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (16 ఓవర్లలో 7 వికెట్లకు) 146.
వికెట్ల పతనం : 1-13, 2-17, 3-29, 4-74, 5-80, 6-130, 7-138.
బౌలింగ్ : శామ్ కరణ్ 3-0-38-1, అర్షదీప్ సింగ్ 3-0-19-3, నాథన్ ఎలిస్ 3-0-27-1, సికిందర్ రజా 3-0-25-1, రిషి ధావన్ 1-0-15-0, రాహుల్ చాహర్ 2-0-12-1, హర్‌ప్రీత్ బరార్ 1-0-7-0.