Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫైనల్లో తెలుగు తేజం ఓటమి
- రన్నరప్ టైటిల్‌కు పరిమితం
- స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300
మాడ్రిడ్ (స్పెయిన్) : రెండు సార్లు ఒలింపిక్ మెడలిస్ట్, మహిళల సింగిల్స్ మాజీ వరల్డ్ నం.2 పి.వి సింధు కెరీర్లో ఊహించని ఓటమి చవిచూసింది!. ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అగ్రశ్రేణి షట్లర్‌గా ఎంతో మంది ప్రత్యర్థులకు, టాప్ క్రీడాకారుణులకు దారుణ పరాభవాలు రుచి చూపించిన సింధు.. స్పెయిన్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నీలో ఆ చేదు అనుభవం చవిచూసింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో పి.వి సింధు చిత్తుగా ఓడింది. ఇండోనేషియా అమ్మాయి 21-8, 21-8తో 29 నిమిషాల్లోనే టైటిల్‌ను సొంతం చేసుకుంది. చాంపియన్‌షిప్ టైటిల్ కోసం అర గంట కూడా పోరాడలేకపోయిన రెండో సీడ్ రన్నరప్ టైటిల్‌తో సరిపెట్టుకున్నది.
పోటీ ఏదీ!
ఓఇండోనేషియా షట్లర్, ఐదో సీడ్ గ్రెగోరియ మారిస్క టన్జంగ్పై సింధుకు 7-0తో ఎదురులేని రికార్డుంది. దీంతో ఫైనల్లో తెలుగు షట్లరే టైటిల్ ఫేవరేట్‌గా బరిలో నిలిచింది. కానీ సెమీఫైనల్లో రియో ఒలింపిక్స్ చాంపియన్, లోకల్ స్టార్ కరొలినా మారిన్ (స్పెయిన్)పై విజయం నమోదు చేసిన టన్‌జంగ్ ఆ జోరు ఫైనల్లోనూ చూపించింది. తొలి గేమ్ ఆరంభంలోనే 5-1తో ఆధిక్యం సొంతం చేసుకున్న టన్‌జంగ్.. సింధును ఇబ్బంది పెట్టింది. 5-7తో సింధు తేరుకున్నా.. ఆ తర్వాతే ఇండోనేషియా అమ్మాయి విశ్వరూపం మొదలైంది. 11-6తో విరామ సమయానికి ముందంజ వేసిన టన్‌జంగ్.. ద్వితీయార్థంలో సింధును చిత్తు చేసింది. లైన్ స్మాష్‌లతో సింధుపై వరుస పాయింట్లు సంపాదించింది. విరామం అనంతరం రెండు పాయింట్లే సాధించిన సింధు.. 11 నిమిషాల్లోనే తొలి గేమ్‌ను కోల్పోయింది. ఇక రెండో గేమ్ ఏమాత్రం భిన్నంగా సాగలేదు. 11-3తో విరామ సమయానికి తిరుగులేని ఆధిక్యం సాధించిన టన్‌జంగ్.. ఆ తర్వాత క్రాస్ కోర్టు స్మాష్‌లు, నెట్ దగ్గర డ్రాప్ షాట్లతో సింధుపై ఆధిపత్యం చెలాయించింది. భారత షట్లర్ కోలుకునేందుకు చేసిన ఏ ప్రయత్నం ఫలించలేదు. 21-8తో రెండో గేమ్‌ను గెల్చుకున్న టన్‌జంగ్ 29 నిమిషాల్లోనే ఫైనల్స్‌ను ముగించి స్పెయిన్ మాస్టర్స్ చాంపియన్‌గా అవతరించింది.
మహిళల సింగిల్స్ వరల్డ్ నం.11 పి.వి సింధు ప్రస్తుతం విధి చౌదరి వద్ద శిక్షణ పొందుతుంది. గతంలో కొరియా కోచ్ పార్క్ సంగ్ వద్ద శిక్షణ పొందిన పి.వి సింధు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం, కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకం సాధించింది. గాయంతో సుమారు ఆరు నెలలు బ్యాడ్మింటన్‌కు దూరమైన సింధు ఈ ఏడాది ఇండియా ఓపెన్‌తో పునరాగమనం చేసింది. ఇండియా ఓపెన్, మలేషియా ఓపెన్, ఆల్ ఇంగ్లాండ్‌లో తొలి రౌండ్లోనే ఓడిన సింధు.. స్విస్ ఓపెన్‌లో రెండో రౌండ్లో నిష్క్రమించింది. తాజాగా స్పెయిన్ మాస్టర్స్‌లో రన్నరప్‌గా నిలిచి సీజన్లో తొలిసారి మెప్పించే ప్రదర్శన చేసింది.