Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో హైదరాబాద్ చతికిల
- రాజస్థాన్ రాయల్స్ రాయల్ విక్టరీ
సీజన్ మారినా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ రాత మారలేదు!. సొంతగడ్డపై కిక్కిరిసిన అభిమానుల నడుమ తొలి మ్యాచ్‌లోనే సన్‌రైజర్స్ హైదరాబాద్ తేలిపోయింది. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్లు రెచ్చిపోయిన చోట సన్‌రైజర్స్ బ్యాటర్లు చతికిల పడగా.. రాయల్స్ బౌలర్లు మెరిసిన పిచ్‌పై సన్‌రైజర్స్ బౌలర్లు నిరుత్సాహాపరిచారు. తొలుత బంతితో, తర్వాత బ్యాట్‌తో పరిపూర్ణ వైఫల్యం చెందిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 72 పరుగుల తేడాతో దారుణ పరాజయం చెందింది. రాజస్థాన్ రాయల్స్ 203/5 పరుగులు చేయగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ 131/8 పరుగులకు పరిమితమైంది.
నవతెలంగాణ-హైదరాబాద్
సన్‌రైజర్స్ చేతులెత్తేసింది. 20 ఓవర్ల ఆటలో కనీసం ఐదు ఓవర్ల పాటైనా ప్రత్యర్థి జట్టుకు పోటీ ఇవ్వలేదు!.ఐపీఎల్ 16ను ఓటమితో ఆరంభించిన సన్‌రైజర్స్ హైదాబాద్.. రాజస్థాన్ రాయల్స్ చేతిలో 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 204 పరుగుల భారీ ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 131/8తో చతికిల పడింది. రాజస్థాన్ పేసర్లు, స్పిన్నర్లు సమిష్టిగా రాణించారు. యుజ్వెంద్ర చాహల్ (4/17), ట్రెంట్ బౌల్ట్ (2/8) సన్‌రైజర్స్ పతనాన్ని శాసించారు.
సన్‌రైజర్స్ తరఫున అబ్దుల్ సమద్ (32 నాటౌట్, 32 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్), మయాంక్ అగర్వాల్ (27, 23 బంతుల్లో 3 ఫోర్లు), ఉమ్రాన్ మాలిక్ (19 నాటౌట్, 8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఓటమి అంతరాన్ని కుదించే ప్రయత్నం చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగుల భారీ స్కోరు చేసింది. రాయల్స్ టాప్-3 బ్యాటర్లు జోశ్ బట్లర్ (54, 22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్ (54, 37 బంతుల్లో 9 ఫోర్లు), సంజు శాంసన్ (55, 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్థ సెంచరీల మోత మోగించారు.
సన్‌రైజర్స్ ఢమాల్
204 పరుగుల భారీ ఛేదనలో సన్‌రైజర్స్‌కు ఆరంభ ఓవర్లోనే డబుల్ షాక్ తగిలింది. ట్రెంట్‌బౌల్ట్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే రెండు వికెట్లు పడగొట్టి హైదరాబాద్ శిబిరంలో ఒత్తిడి పెంచాడు. ఓపెనర్ అభిషేక్ శర్మ (0), రాహుల్ త్రిపాఠి (0) సున్నా పరుగులకే డగౌట్‌కు చేరుకున్నారు. ఆరంభంలో వికెట్లు చేజార్చుకున్న సన్‌రైజర్స్ మళ్లీ పుంజుకునే ప్రయత్నం చేయలేదు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (27) క్రీజులో నిలిచినా.. మ్యాచ్ పరిస్థితికి అనుగుణంగా ఆడలేకపోయాడు. భారీ అంచనాల నడుమ హ్యారీ బ్రూక్ (13, 21 బంతుల్లో 1 ఫోర్) నిరాశపరిచాడు. వాషింగ్టన్ సుందర్ (1), గ్లెన్ ఫిలిప్స్ (8) చేతులెత్తేశారు. 52 పరుగులకే 6 వికెట్లు చేజార్చుకున్న హైదరాబాద్ ఓటమి కోరల్లో చిక్కుకుంది. ఇంపాక్ట్ ప్లేయర్ అబ్దుల్ సమద్ (32 నాటౌట్, 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), ఆదిల్ రషీద్ (18, 13 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), ఉమ్రాన్ మాలిక్ (19 నాటౌట్, 8 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) సన్‌రైజర్స్ ఓటమి అంతరాన్ని తగ్గించారు. స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ (4/17) నాలుగు వికెట్ల ప్రదర్శన చేయగా.. ట్రెంట్ బౌల్ట్ (2/21) రాణించాడు. 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 72 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
రాయల్స్ రైడ్
టాస్ నెగ్గిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్లాట్ పిచ్‌పై తొలుత బౌలింగ్ ఎంచుకుంది. గత సీజన్ రన్నరప్ రాజస్థాన్ రాయల్స్ ఉప్పల్ మైదానంలో ఎదురుదాడి మంత్రతో బరిలోకి దిగింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (54), జోశ్ బట్లర్ (54) రాయల్స్‌కు బ్యాంగ్ బ్యాంగ్ ఆరంభాన్ని అందించారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఫరూకీపై విరుచుకుపడిన జైస్వాల్.. రెండు ఫోర్లతో 14 పరుగులు పిండుకున్నాడు. స్వింగ్‌స్టర్ భువనేశ్వర్‌పై భారీ సిక్సర్‌తో ధనాధన్ మొదలెట్టిన జోశ్ బట్లర్.. సన్‌రైజర్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. వాషింగ్టన్ సుందర్‌ను వరుస బంతుల్లో వరుస సిక్సర్లు కొట్టిన బట్లర్.. 20 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. ఓ వైప్ బట్లర్, మరోవైపు జైస్వాల్ జోరుతో పవర్‌ప్లేలో (36 బంతులు) రాజస్థాన్ 85 పరుగులు పిండుకుంది. పవర్‌ప్లే చివరి ఓవర్లో బట్లర్‌కు మూడు బౌండరీలు కోల్పోయిన ఫరూకీ.. మెరుపు బంతితో అతడి ఇన్నింగ్స్ ముగించాడు. బట్లర్ వికెట్ పడినా.. సన్‌రైజర్స్ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదు. కెప్టెన్ సంజు శాంసన్ (55) తోడుగా జైస్వాల్ ఇన్నింగ్స్‌ను దూకుడుగా నడిపించాడు. పది ఓవర్ల అనంతరం రాజస్థాన్ రాయల్స్ 122/1తో నిలిచింది. కెప్టెన్ సంజు శాంసన్ సైతం రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 28 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించాడు. టాప్-3 బ్యాటర్లు ధనాధన్ అర్థ సెంచరీలు నమోదు చేయటంతో రాయల్స్ 200 పైచిలుకు పరుగులు సునాయాసంగా చేసేలా కనిపించింది. కానీ చివరి ఓవర్లలో సన్‌రైజర్స్ కాస్త మెరుగ్గా బౌలింగ్ చేసింది.
ఆదిల్ రషీద్, టి. నటరాజన్ డెత్ ఓవర్లలో ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరు కట్టుదిట్టంగా బంతులేయటంతో 200 పరుగుల మార్క్ చేరుకునేందుకు రాయల్స్ కష్టపడక తప్పలేదు. చివరి పది ఓవర్లలో రాయల్స్ 81 పరుగులే చేయగల్గింది. దేవదత్ పడిక్కల్ (2), రియాన్ పరాగ్ (7)లు నిరాశపరిచారు. షిమ్రోన్ హెట్మయర్ (22 నాటౌట్, 16 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) మెరుపులతో రాయల్స్ 200 ప్లస్ పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఫరూకీ, నటరాజన్‌లు రెండేసి వికెట్లు పడగొట్టారు. భువనేశ్వర్ కుమార్ 3 ఓవర్లలోనే 36 పరుగులు సమర్పించుకోగా.. ఫరూకీ 4 ఓవర్లలో 41 పరుగులు ఇచ్చాడు.
స్కోరు వివరాలు
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ (సి) మయాంక్ (బి) ఫరూకీ 54, జోశ్ బట్లర్ (బి) ఫరూకీ 54, సంజు శాంసన్ (సి) అభిషేక్ (బి) నటరాజన్ 55, పడిక్కల్ (బి) ఉమ్రాన్ 2, రియాన్ (సి) ఫరూకీ (బి) నటరాజన్ 7, హెట్మయర్ నాటౌట్ 22, అశ్విన్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 08, మొత్తం : (20 ఓవర్లలో 5 వికెట్లకు) 203.
వికెట్ల పతనం : 1-85, 2-139, 3-151, 4-170, 5-187.
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 3-0-36-0, ఫరూకీ 4-0-41-2, వాషింగ్టన్ సుందర్ 3-0-32-0, నటరాజన్ 3-0-23-2, ఆదిల్ రషీద్ 4-0-33-0, ఉమ్రాన్ మాలిక్ 3-0-32-1.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : అభిషేక్ శర్మ (బి) ట్రెంట్ బౌల్ట్ 0, మయాంక్ అగర్వాల్ (సి) బట్లర్ (బి) చాహల్ 27, రాహుల్ త్రిపాఠి (సి) జేసన్ (బి) ట్రెంట్ బౌల్ట్ 0, హ్యారీ బ్రూక్ (బి) చాహల్ 13, వాషింగ్టన్ సుందర్ (సి) హెట్మయర్ (బి) జేసన్ 1, గ్లెన్ ఫిలిప్స్ (సి) అసిఫ్ (బి) అశ్విన్ 8, సమద్ నాటౌట్ 32, రషీద్ (స్టంప్డ్) సంజు (బి) చాహల్ 18, భువనేశ్వర్ (బి) చాహల్ 6, ఉమ్రాన్ మాలిక్ నాటౌట్ 19, ఎక్స్‌ట్రాలు :7, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 131.
వికెట్ల పతనం : 1-0, 2-0, 3-34, 4-39, 5-48, 6-52, 7-81, 8-95.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 4-1-21-2, అసిఫ్ 3-0-15-0, జేసన్ హౌల్డర్ 3-0-16-1, అశ్విన్ 4-0-27-1, చాహల్ 4-0-17-4, నవదీప్ సైని 4-0-34-0.
స్టేడియం ఫుల్, వినోదం నిల్!
ఆరెంజ్ ఆర్మీ అభిమానులను సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి మ్యాచ్‌లో దారుణంగా నిరాశపరిచింది. రాయల్స్‌తో మ్యాచ్‌కు ఉప్పల్ స్టేడియానికి 37,713 మంది అభిమానులు తరలి వచ్చారు. ఆరెంజ్ ఓషియన్‌ను తలపించిన ఉప్పల్ స్టేడియంలో ఆతిథ్య జట్టు ఘోరంగా విఫలమైంది. బంతితో బౌలర్లు తేలిపోగా, బ్యాట్‌తో బ్యాటర్లు పీడకల ఇన్నింగ్స్ ఆడారు!. పవర్‌ప్లేలోనే పస లేని ఆటతో మ్యాచ్‌పై ఆశలు కోల్పోయిన సన్‌రైజర్స్ ఓటమితో సీజన్‌ను ఆరంభించింది. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో 10 ఓవర్ల ఆట ముగియకు ముందే స్టేడియం సగానికి పైగా ఖాళీ అయిపోయింది. ఫలితంతో సంబంధం లేకుండా సన్‌రైజర్స్ గట్టి పోటీ ఇచ్చి ఉంటే.. అభిమానులకు ఫుల్ కిక్ ఉండేది. ఆదివారం ఆరెంజ్ ఆర్మీకి గ్రౌండ్లో, స్టాండ్స్‌లో ఏమాత్రం కలిసిరాలేదు!.