Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్నోపై సూపర్‌కింగ్స్ గెలుపు
- రుతురాజ్, కాన్వే ధనాధన్
మూడేండ్ల అనంతరం సొంతగడ్డపై తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ ఆ ఉత్సాహం, ఓ జోష్ పరుగుల రూపంలో స్పష్టంగా చూపించింది. రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అంబటి రాయుడు, ఎం.ఎస్ ధోని ధనాధన్ దంచుడు షోతో తొలుత 217 పరుగుల భారీ స్కోరు చేసింది. భారీ ఛేదనో లక్నో సూపర్‌జెయింట్స్ 205 పరుగులు చేయగా సూపర్‌కింగ్స్ 12 పరుగుల తేడాతో గెలుపొందింది.
నవతెలంగాణ-చెన్నై
రుతురాజ్ గైక్వాడ్ (57, 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మరో అర్థ సెంచరీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. డెవాన్ కాన్వే (47, 29 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), అంబటి రాయుడు (27 నాటౌట్, 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించటంతో చెన్నై సూపర్‌కింగ్స్ ఐపీఎల్16 సీజన్లో తొలి విజయం సాధించింది. లక్నో సూపర్‌జెయింట్స్ 218 పరుగుల భారీ ఛేదనలో 205 పరుగులే చేసింది. ఓపెనర్ కైల్ మేయర్స్ (53, 22 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో లక్నోను రేసులో నిలిపినా.. ఇతర బ్యాటర్లు అంచనాల మేరకు రాణించలేదు. కెప్టెన్ కెఎల్ రాహుల్(20), మార్కస్ స్టోయినిస్ (21), నికోలస్ పూరన్ (32), ఆయుశ్ బదానీ (23), కృష్ణప్ప గౌతమ్ (17 నాటౌట్), మార్క్‌వుడ్ (10 నాటౌట్) ఓటమి అంతరాన్ని కుదించారు. సూపర్‌కింగ్స్ స్పిన్నర్ మోయిన్ అలీ (4/26) మ్యాజిక్‌తో లక్నో బ్యాటర్లను కట్టడి చేశాడు.
ధనాధన్
టాస్ నెగ్గిన లక్నో సూపర్‌జెయింట్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. సొంత మైదానంలో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన చెన్నై సూపర్‌కింగ్స్ చెపాక్ స్టేడియాన్ని హోరెత్తించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (57), డెవాన్ కాన్వే (47) తొలి వికెట్‌కు అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. కెరీర్ భీకర ఫామ్‌లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్ ఆరంభం నుంచీ లక్నో బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. వికెట్‌కు రెండు ఎండ్లా రుతురాజ్, కాన్వేలు దంచికొట్టడంతో తొలి పది ఓవర్లలో పరుగుల వరద పారించింది. రుతురాజ్ గైక్వాడ్ రెండు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 25 బంతుల్లోనే సీజన్లో రెండో అర్థ సెంచరీ బాదాడు. పవర్‌ప్లే (6 ఓవర్లు) ముగిసేసరికి సూపర్‌కింగ్స్ 79/0తో నిలిచింది. డెవాన్ కాన్వే సైతం ఊపందుకోవటంతో చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు స్కోరు 49 బంతుల్లోనే 100 పరుగుల మార్క్ తాకింది. దీంతో చెన్నై సూపర్‌కింగ్స్ భారీ స్కోరుకు గట్టి పునాది పడింది. వరుస ఓవర్లలో రుతురాజ్, డెవాన్ కాన్వేలు నిష్క్రమించటంతో ద్వితీయార్థం ఆరంభంలో స్కోరు వేగం నెమ్మదించింది. శివం దూబె (27, 16 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు), అంబటి రాయుడు (27, 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) సూపర్‌కింగ్స్ జోరు కొనసాగించారు. రవి బిష్ణోరుపై వరుస సిక్సర్లు కొట్టిన శివం దూబె అతడికే వికెట్ కోల్పోయాడు. తెలుగు తేజం అంబటి రాయుడు రెండేసి ఫోర్లు, సిక్సర్లతో అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లో క్రీజులోకి వచ్చిన ఎం.ఎస్ ధోని ఎదుర్కొన్న తొలి రెండు బంతులను స్టాండ్స్‌లోకి పంపించి చెపాక్ స్టేడియాన్ని ఉత్సాహ సంద్రంలో ముంచేశాడు!. చివరి పది ఓవర్లలో బ్యాటర్ల జోరు కాస్త తగ్గినా.. సూపర్‌కింగ్స్ 217 పరుగులు పిండుకుంది. లక్నో సూపర్‌జెయింట్స్ స్పిన్నర్ రవి బిష్ణోరు (3/28) గొప్ప ప్రదర్శన చేశాడు. మార్క్‌వుడ్ (3/49) సైతం మూడు వికెట్లు పడగొట్టాడు
స్కోరు వివరాలు :
చెన్నై సూపర్‌కింగ్స్ : 217/7 (రుతురాజ్ గైక్వాడ్ 57, డెవాన్ కాన్వే 47, రాయుడు 27, రవి బిష్ణోరు 3/28)
లక్నో సూపర్‌జెయింట్స్ : 206/7 ( కైల్ మేయర్స్ 53, నికోలస్ పూరన్ 32, మోయిన్ అలీ 4/26, తుషార్ 2/45)