Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీకి వరుసగా రెండో ఓటమి ఛేదనలో సాయిసుదర్శన్ జోరు
నవతెలంగాణ-న్యూఢిల్లీ
డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ సీజన్లో వరుసగా రెండో విజయాన్ని సాధించింది. 163 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఊదేసి 6 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఛేదనలో సాయి సుదర్శన్ (62 నాటౌట్, 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), డెవిడ్ మిల్లర్ (31 నాటౌట్, 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), విజరు శంకర్ (29, 23 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. 54/3తో కష్టాల్లో ఉన్న టైటాన్స్‌ను సాయిసుదర్శన్, విజరు శంకర్ కీలక భాగస్వామ్యంలో నిలబెట్టారు. మిల్లర్ మెరుపులతో టైటాన్స్ లాంఛనం ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 162/8 పరుగులే చేసింది. డెవిడ్ వార్నర్ (37, 32 బంతుల్లో 7 ఫోర్లు), అక్షర్ పటేల్ (36, 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), సర్ఫరాజన్ ఖాన్ (30, 34 బంతుల్లో 2 ఫోర్లు) ఢిల్లీ క్యాపిటల్స్‌కు పోరాడగలిగే స్కోరు అందించారు.
క్యాపిటల్స్ విఫలం
సొంతగడ్డ కోట్లా మైదానంలో తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన ఢిల్లీ క్యాపిటల్స్ నిరాశపరిచింది. యువ ఓపెనర్ పృథ్వీ షా (7) నిరాశపరిచాడు. మిచెల్ మార్ష్ (4) సైతం షా బాటలోనే నడిచాడు. కొత్త బంతితో పృథ్వీ షా, మిచెల్ మార్ష్ల వికెట్‌తో మహ్మద్ షమి టైటాన్స్‌ను బ్రేక్ సాధించాడు. సర్ఫరాజ్ ఖాన్ (30)తో కలిసి డెవిడ్ వార్నర్ (37) ఇన్నింగ్స్‌ను నడిపించాడు. సర్ఫరాజ్, వార్నర్ ఇద్దరూ నెమ్మదిగా ఆడటంతో రన్‌రేట్ పడిపోయింది. అల్జారీ జొసెఫ్ వరుస బంతుల్లో వార్నర్, రిలీ రొసొ (0)ను అవుట్ చేసి క్యాపిటల్స్ శిబిరంలో గుబులు రేపాడు. 67/4తో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ను లోయర్ ఆర్డర్ బ్యాటర్లు ఆదుకున్నారు. అభిషేక్ పోరెల్ (20, 11 బంతుల్లో 2 సిక్స్‌లు) టైటాన్స్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. ఓ ఎండ్‌లో కుదురుకున్న సర్ఫరాజ్ బౌండరీలపై దృష్టి పెట్టలేదు!. అక్షర్ పటేల్ (36) తనదైన శైలిలో రెచ్చిపోయాడు. మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు బాదిన అక్షర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు 162 పరుగుల స్కోరు అందించాడు.