Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏఎల్సీ గాయానికి గురైన విలియమ్సన్
- త్వరలోనే కివీస్ కెప్టెన్‌కు శస్త్రచికిత్స
క్రైస్ట్‌చర్చ్ : ఐసీసీ 2023 వన్డే వరల్డ్‌కప్ ముంగిట న్యూజిలాండ్‌కు గట్టి ఎదురుదెబ్బ!. కివీస్ కెప్టెన్, స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ గాయంతో రానున్న మెగా ఈవెంట్‌కు దూరం కానున్నాడు. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వర్గాలు తెలిపాయి. ఐపీఎల్లో తొలిసారి గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కేన్ విలియమ్సన్.. సీజన్ ఆరంభ మ్యాచ్‌లోనే గాయపడ్డాడు. అహ్మదాబాద్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ సిక్సర్‌ను నిలువరించే క్రమంలో కేన్ విలియమ్సన్ అదుపు తప్పాడు. జట్టుకు రెండు పరుగులు ఆదా చేసిన కేన్..ఈ క్రమంలో కుడి కాలు మోకాలి గాయానికి గురయ్యాడు. బాధతో విలవిల్లాడిన కేన్ స్వయంగా లేచి నడవలేకపోయాడు. అతడిని సహాయక సిబ్బంది భుజాలపై తీసుకెళ్లారు. గాయం తీవ్రత దృష్ట్యా టైటాన్స్ రెండో మ్యాచ్‌కు విలియమ్సన్ దూరంగా ఉన్నాడు. తాజాగా కేన్ విలియమ్సన్ మోకాలు ఏఎల్సీ గాయానికి గురయ్యాడని వైద్య నివేదికల్లో తేలింది.
మోకాలి లిగమెంట్ గాయానికి కేన్ విలియమ్సన్కు శస్త్రచికత్స చేసుకోవాల్సి ఉంది. ప్రస్తుతం మోకాలు వాపు ఉండటంతో రానున్న మూడు వారాల్లో కివీస్ కెప్టెన్‌కు సర్జరీ చేయనున్నారు. సర్జరీ అనంతరం విశ్రాంతి, అనంతరం పూర్తి ఫిట్నెస్ సాధించటం విలియమ్సన్కు కీలకం. ఏఎల్సీ శస్త్రచికిత్స దృష్ట్యా విలియమ్సన్ 2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడే పరిస్థితులు కనిపించటం లేదు. విలియమ్సన్ గైర్హాజరీలో న్యూజిలాండ్‌కు వికెట్ కీపర్ టామ్ లేథమ్ సారథ్యం వహిస్తున్నాడు. రానున్న పాకిస్థాన్‌తో వన్డే సిరీస్‌కు సహా వరల్డ్‌కప్‌కు సైతం టామ్ లేథమ్‌కు సారథ్య పగ్గాలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. 161 వన్డేలు ఆడిన కేన్ విలియమ్సన్ 13 శతకాలు బాదటంతో పాటు 47.83 సగటుతో పరుగులు సాధించాడు. అత్యంత నిలకడగా రాణించే విలియమ్సన్ సేవలను కోల్పోవటం న్యూజిలాండ్‌కు సారథ్య పరంగా, బ్యాటింగ్ విభాగం పరంగా పూడ్చలేని లోటుగా మారనుంది.