Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ ఈలేసింది. 89/5తో పీకల్లోతు కష్టాల్లో కూరుకున్న ఆతిథ్య జట్టును తొలుత పేస్ ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ (68) విధ్వంసక అర్థ సెంచరీ ఇన్నింగ్స్‌తో ఆదుకోగా.. కోల్‌కత 204/7 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. భారీ ఛేదనలో రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ చేతులెత్తేసింది. మిస్టరీ స్పిన్ త్రయం సునీల్ నరైన్ (2/16), వరుణ్ చక్రవర్తి (4/15), సుయాశ్ శర్మ (3/30) డుప్లెసిస్‌ను మాయ చేశారు. 81 పరుగుల తేడాతో బెంగళూర్‌పై కోల్‌కత ఘన విజయం సాధించింది.
- 29 బంతుల్లో 68 బాదిన ఠాకూర్
- బెంగళూర్‌పై కోల్‌కత ఘన విజయం
నవతెలంగాణ-కోల్‌కత
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్‌పై కోల్‌కత నైట్‌రైడర్స్ 81 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. 205 పరుగుల భారీ ఛేదనలో విరాట్ కోహ్లి (21), డుప్లెసిస్ (23) తొలి వికెట్‌కు శుభారంభం అందించినా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు నిలువలేకపోయారు. మైకల్ బ్రాస్‌వెల్ (19), గ్లెన్ మాక్స్వెల్ (5), హర్షల్ పటేల్ (0), షాబాజ్ అహ్మద్ (1), దినేశ్ కార్తీక్ (9), అనుజ్ రావత్ (1), కర్ణ్ శర్మ (1) దారుణంగా విఫలమయ్యారు. 61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బెంగళూర్ ఓటమి లాంఛనం చేసుకుంది.17.4 ఓవర్లలో 123 పరుగులకే బెంగళూర్ కుప్పకూలింది.కోల్‌కత నైట్‌రైడర్స్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు వికెట్లు పడగొట్టగా.. ఇంపాక్ట్ ప్లేయర్ సుయాశ్ శర్మ మూడు వికెట్లు, సునీల్ నరైన్ రెండు వికెట్లతో సత్తా చాటారు. అంతకముందు, శార్దుల్ ఠాకూర్ (68, 29 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) విధ్వంసక అర్థ సెంచరీ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. రింకూ సింగ్ (46, 33 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) జతగా రెచ్చిపోయిన శార్దుల్ ఠాకూర్.. కోల్‌కత నైట్‌రైడర్స్‌కు 204/7 పరుగుల భారీ స్కోరు అందించాడు.
ఠాకూర్ విధ్వంసం : ఈడెన్‌గార్డెన్స్‌లో సొంత అభిమానుల నడుమ తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఆరంభం ఏమాత్రం కలిసి రాలేదు. ఓపెనర్ రెహ్మనుల్లా గుర్బాజ్ (57, 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఓ ఎండ్‌లో ఆకట్టుకున్నాడు. క్రమం తప్పకుండా బౌండరీలు, సిక్సర్లు బాది నైట్‌రైడర్స్‌ను రేసులో నిలిపాడు. కానీ మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడటం ఆతిథ్య జట్టును దెబ్బతీసింది. వెంకటేశ్ అయ్యర్ (3), మన్దీప్ సింగ్ (0), కెప్టెన్ నితీశ్ రానా (1), సహా బిగ్ హిట్టర్ అండ్రీ రసెల్ (0) దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్ గుర్బాజ్ అర్థ సెంచరీ సాధించినా.. 89 పరుగులకే ఐదు వికెట్లు చేజార్చుకున్న నైట్‌రైడర్స్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. ఈ సమయంలో కోల్‌కత స్వల్ప స్కోరుకే పరిమితం అయ్యేలా కనిపించింది. కానీ రింకూ సింగ్ (46) తోడుగా టెయిలెండర్ శార్దుల్ ఠాకూర్ (68) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బెంగళూర్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. వరుస ఓవర్లలో ఫోర్లు, సిక్సర్లు సంధించాడు. రింకూ సింగ్ తోడుగా ఆరో వికెట్‌కు ఏకంగా 103 పరుగులు జోడించాడు. ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో 20 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన శార్దుల్ ఠాకూర్.. బెంగళూర్ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాడు. మరో ఎండ్‌లో రింకూ సింగ్ సైతం సమయోచిత ఇన్నింగ్స్‌తో శార్దుల్ ఠాకూర్‌కు అండగా నిలిచాడు. శార్దుల్, రింకూ మెరుపులతో కోల్‌కత నైట్‌రైడర్స్ 204/7 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
స్కోరు వివరాలు
కోల్‌కత నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : 204/7 (శార్దుల్ ఠాకూర్ 68, రెహ్మనుల్లా గుర్బాజ్ 57, రింకూ సింగ్ 46, డెవిడ్ విల్లే 2/16)
రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఇన్నింగ్స్ : 123/10 (డుప్లెసిస్ 23, విరాట్ కోహ్లి 21, వరుణ్ చక్రవర్తి 4/15, సుయాశ్ శర్మ 3/30)