Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేటుగా ముగుస్తున్న ఐపీఎల్ మ్యాచులు
- అభిమానుల్లో తగ్గుతున్న ఆసక్తి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 తొలి వారం మ్యాచుల్లో ఆలస్యంగా మ్యాచులు పరిపాటిగా మారిపోయాయి. ఐపీఎల్16లో గురువారం నాటికి 9 మ్యాచులు పూర్తి కాగా.. ఏ ఒక్క మ్యాచ్ నిర్ణీత సమయ పరిధిలో ముగియలేదు. ప్రతి మ్యాచ్‌లో అదనపు సమయంలోకి వెళ్లింది. ఆలస్యంగా మ్యాచులు అభిమానులు, ప్రసారదారులు అంతిమంగా ఐపీఎల్‌కు ఇబ్బందికరం!.
నవతెలంగాణ క్రీడావిభాగం
ఐపీఎల్ మ్యాచ్ టైమ్ ఇప్పుడు ఆందోళనకు దారితీస్తోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ముగిసిన ఏ ఒక్క మ్యాచ్ సైతం నిర్ణీత సమయంలో ముగియలేదు. ఆరంభ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్, గుజరాత్ టైటాన్స్ పోరుతో మొదలైన ఈ ట్రెండ్ ప్రతి మ్యాచ్‌లోనూ కొనసాగుతోంది. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోశ్ బట్లర్ ఏకంగా ట్విట్టర్ వేదికగా ఈ అంశంపై స్పందించాడు. 'ఆట వేగాన్ని కాస్త పెంచుదాం' అని ట్వీట్ చేశాడు. బట్లర్ ట్వీట్ చేసిన చెన్నై సూపర్‌కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ ఒక గంట 48 నిమిషాల్లో ముగియగా.. రెండో ఇన్నింగ్స్ ఒక గంట 52 నిమిషాల పాటు సాగింది. మూడేండ్ల విరామం అనంతరం సొంతగడ్డపై జరుగుతున్న ఐపీఎల్ నుంచి అభిమానులు ఇది ఏమాత్రం ఆశించటం లేదు.
జరిమానా పట్టదు! : ఆలస్యంగా ముగస్తున్న మ్యాచ్‌లకు పరిష్కారంగా ఐపీఎల్ మ్యాచ్‌లను అర గంట ముందుకు షెడ్యూల్ చేశారు. 8 నుంచి 7.30 గంటలకే మ్యాచ్ ఆరంభం అవుతుంది. ఇది రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే జట్టుకు ఉపయుక్తంగా ఉందని కొందరు అంటున్నారు. 7.30 గంటలకు మంచు ప్రభావం ఫీల్డింగ్ జట్టుపై పడదనే వాదన ఉంది. నిబంధనల ప్రకారం 20 ఓవర్ల ఇన్నింగ్స్ 90 నిమిషాల్లో ముగియాలి. అందులోనే 5 నిమిషాల విరామం సైతం ఉంటుంది. 90వ నిమిషం లోపు 20వ ఓవర్ ఆరంభం కాకుంటే సర్కిల్ బయట ఓ ఫీల్డర్‌ను తప్పిస్తున్నారు. అయినా, ఈ సీజన్లో ఒక్క ఇన్నింగ్స్‌లోనే ఈ జరిమానా విధించారు. వైడ్లు, నో బాల్స్‌కు సైతం డిఆర్ఎస్ ఉండటంతో మ్యాచ్ నిడివి మరింత పెరుగుతోంది. బౌలర్లు క్రమశిక్షణ లేకుండా వైడ్లు, నో బాల్స్ ఎక్కువగా వేయటం సైతం ఆలస్యానికి కారణం అవుతుంది.
ఎక్స్ట్రా టైమ్ పరంపర : ఐపీఎల్16 తొలి మ్యాచ్‌లో సూపర్‌కింగ్స్, టైటాన్స్ పోటీపడ్డాయి. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్ 120 నిమిషాల్లో ముగియగా, రెండో ఇన్నింగ్స్ 103 నిమిషాల్లో ముగిసింది. పంజాబ్, కోల్‌కత వర్షం ప్రభావిత మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌కు 103 పట్టగా.. పూర్తికాని రెండో ఇన్నింగ్స్‌కు 86 నిమిషాల సమయం పట్టింది. లక్నో, డిల్లీ మ్యాచ్‌లో వరుసగా 107, 112 నిమిషాల్లో ఇన్నింగ్స్‌లు ముగిశాయి. సన్‌రైజర్స్, రాయల్స్ మ్యాచ్‌లో 107, 112 నిమిషాలు పట్టింది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ఏకంగా ముంబయి ఇండియన్స్‌కు 20 ఓవర్ల కోటా పూర్తి చేసేందుకు అత్యధికంగా 122 నిమిషాలు తీసుకుంది. ముంబయి ఇండియన్స్ 112 నిమిషాల్లో ముగించింది. సూపర్‌కింగ్స్, లక్నో మ్యాచ్‌లో 108, 112 నిమిషాల సమయం.. ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో 111, 107 నిమిషాల సమయం పట్టింది.
' ఐపీఎల్ టెలివిజన్ రేటింగ్స్ 10.45 అనంతరం తగ్గుముఖం పడుతుంది. రాత్రి 11 గంటలకు రేటింగ్ పూర్తిగా పడిపోతుంది. మ్యాచ్ ఆలస్యంగా సాగుతుంటే అభిమానులు అదేపనిగా చూడరని ఈ గణాంకాలు చెబుతున్నాయని' 2018లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టార్‌స్పోర్ట్స్ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. మ్యాచులు ఆలస్యంగా సాగటంపై ఆటగాళ్లు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్థరాత్రి వరకు సాగుతున్న మ్యాచ్‌లపై బీసీసీఐ తక్షణమే దృష్టి సారించి పరిష్కారం చూపించాలి.