Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్‌లో ఐర్లాండ్ షట్లర్‌పై గెలుపు
- ఓర్లీన్స్ మాస్టర్స్ సూపర్ 300
ఓర్లీన్స్ (ఫ్రాన్స్) : భారత బ్యాడ్మింటన్ యువ క్రీడాకారుడు ప్రియాంశు రజావత్ చరిత్రకు అడుగు దూరంలో నిలిచాడు!. ఓర్లీన్స్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లోకి ప్రవేశించిన ప్రియాంశు రజావత్ కెరీర్ తొలి మెగా బిడబ్ల్యూఎఫ్ టైటిల్ ముంగిట నిలిచాడు. ఐర్లాండ్ షట్లర్ న్యాట్ నుయన్పై వరుస గేముల్లోనే విజయం సాధించిన ప్రియాంశు రజావత్ టైటిల్ పోరుకు సిద్ధమయ్యాడు. 44 నిమిషాల్లోనే ముగిసిన సెమీఫైనల్లో ప్రియాంశు రజావత్ 21-12, 21-9తో ఏకపక్ష విజయం నమోదు చేశాడు. రెండు గేముల్లోనూ భారత ఆటగాడికి ఐర్లాండ్ షట్లర్ నుంచి పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు.
తొలి గేమ్ ఆరంభంలో రజావత్ వెనుకంజ వేశాడు. 2-5తో న్యాట్ నుయన్కు ఆధిక్యం కోల్పోయాడు. విరామ సమయానికి ముందు పుంజుకున్న రజావత్ 11-9తో కీలక సమయంలో ముందంజ వేశాడు. ద్వితీయార్థంలో న్యాట్ నుయన్ భారత షట్లర్‌ను అందుకోలేకపోయాడు. వరుస పాయింట్లు సాధించిన ప్రియాంశు 15-9, 19-12తో రెచ్చిపోయాడు. 21-12తో తొలి గేమ్‌ను అలవోకగా సొంతం చేసుకున్నాడు. ఇక రెండో గేమ్‌లో ప్రియాంశు రజావత్ విశ్వరూపం చూపించాడు. ఏకంగా వరుసగా 11 పాయింట్లు సాధించిన రజావత్ ఐర్లాండ్ షట్లర్‌ను చిత్తు చేశాడు. 4-0తో రెండో గేమ్‌ను మొదలెట్టిన రజావత్ 7-2 తర్వాత వరుసగా పాయింట్లు కొల్లగొట్టాడు. మ్యాచ్ పాయింట్లు న్యాట్ నుయన్ కొన్ని పాయింట్లు సాధించినా.. రజావత్ దూకుడు నిలువరించేందుకు ఆ పోరాటం ఏమాత్రం సరిపోలేదు. 21-9తో రెండో గేమ్‌తో పాటు టైటిల్ పోరులో బెర్త్‌ను సైతం ప్రియాంశు రజావత్ కైవసం చేసుకున్నాడు. వియత్నాంలో జన్మించిన న్యాట్ నుయన్.. కుటుంబంతో పాటు ఐర్లాండ్‌కు వలస వెళ్లాడు. ఇక నేడు టైటిల్ పోరులో డెన్మార్క్ షట్లర్ మాగస్ జొహాన్నెసెన్తో ప్రియాంశు రజావత్ పోటీపడనున్నాడు.