Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బట్లర్, జైస్వాల్ ధనాధన్ జోరు
- ట్రెంట్ బౌల్ట్, చాహల్ వికెట్ల వేట
- ఢిల్లీపై రాజస్థాన్ ఘన విజయం
రాజస్థాన్ రాయల్స్ గెలుపు బాట పట్టగా.. ఢిల్లీ క్యాపిటల్స్ ముచ్చటగా మూడో మ్యాచ్‌లో పరాజయం పాలై ఓటముల్లో హ్యాట్రిక్ కొట్టింది. జోశ్ బట్లర్ (79), యశస్వి జైస్వాల్ (60) ధనాధన్ అర్థ సెంచరీల మోతతో తొలుత రాజస్థాన్ రాయల్స్ 199/4 పరుగుల భారీ స్కోరు చేసింది. పేసర్ ట్రెంట్ బౌల్ట్ (3/29), స్పిన్నర్ చాహల్ (3/27) విజృంభణతో ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 142/9 పరుగులకే పరిమితమైంది. 57 పరుగుల తేడాతో ఢిల్లీపై రాజస్థాన్ ఘన విజయం సాధించింది.
నవతెలంగాణ-గువహటి
రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్16లో రెండో విజయం నమోదు చేసింది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా కదం తొక్కటంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేసి 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్‌తో ఉత్కంఠ మ్యాచ్‌లో ఓటమి అనంతరం రాజస్థాన్ పుంజుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ పరాజయాలు మూటగట్టుకుంది. జోశ్ బట్లర్ (79, 51 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్), యశస్వి జైస్వాల్ (60, 31 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీలతో చెలరేగారు. షిమ్రోన్ హెట్మయర్ (39 నాటౌట్) రాణించటంతో రాజస్థాన్ రాయల్స్ తొలుత 199/4 పరుగులు చేసింది. ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ చేతులెత్తేసింది. కెప్టెన్ డెవిడ్ వార్నర్ (65, 55 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీకి తోడు లలిత్ యాదవ్ (38, 24 బంతుల్లో 5 ఫోర్లు) రాణించినా.. ఇతర బ్యాటర్లు ఎవరూ అంచనాలను అందుకోలేదు. స్పిన్నర్ యుజ్వెంద్ర చాహల్ (3/27), పేసర్ ట్రెంట్ బౌల్ట్ (3/29) మూడు వికెట్ల ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తు చేశారు. 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాట్రిక్ ఓటమి చవిచూసింది. రాయల్స్ యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
బౌల్ట్, చాహల్ తిప్పేశారు
200 పరుగుల భారీ ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ చతికిల పడింది. ఆరంభ ఓవర్లోనే రెండు వికెట్లు చేజార్చుకుని లక్ష్యం దిశగా సాగలేకపోయింది. పేసర్ ట్రెంట్ బౌల్ట్ తొలి ఓవర్లో పృథ్వీ షా (0), మనీశ్ పాండే (0)లను డగౌట్‌కు చేర్చాడు. వరుస వికెట్లతో రాయల్స్ బ్రేక్ సాధించింది. రౌలీ రొసో (14)ను అశ్విన్ సాగనంపాడు. 36/3తో కష్టాల్లో ఉన్న క్యాపిటల్స్‌ను కెప్టెన్ డెవిడ్ వార్నర్ (65), లలిత్ యాదవ్ (38) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ జోడీ నాల్గో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. వికెట్ల పతనాన్ని నిలువరించిన ఈ జోడీ రన్‌రేట్‌ను అందుకోవటంలో విఫలమైంది. సాధించాల్సిన రన్‌రేట్ భారీగా పెరగటంతో స్పిన్నర్ చాహల్‌కు మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు దొరికిపోయారు. లలిత్ యాదవ్ వికెట్‌తో ఢిల్లీని బౌల్ట్ మళ్లీ దెబ్బ కొట్టగా.. అక్షర్ పటేల్ (2), అభిషేక్ పోరెల్ (2) సహా డెవిడ్ వార్నర్ (65)లను వెనక్కి పంపించిన చాహల్ రాయల్స్ విజయాన్ని ఖాయం చేశాడు. 20 ఓవర్లలో 9 వికెట్లకు 142 పరుగులే చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌పై ఆశలను ఆరంభంలోనే ఆవిరి చేసుకుంది.
యశస్వి, బట్లర్ ధనాధన్
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని అందించారు. యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ (60) తొలి ఓవర్లోనే ఐదు బౌండరీలతో హడలెత్తించాడు. హ్యాట్రిక్ ఫోర్లతో ఇన్నింగ్స్‌ను మొదలెట్టిన జైస్వాల్.. చివరి రెండు బంతులనూ బౌండరీ లైన్ దాటించాడు. జోశ్ బట్లర్ సైతం బౌండరీల మోతలో జత కలవటంతో పవర్‌ప్లేలో రాయల్స్ మరోసారి పవర్ఫుల్ ప్రదర్శన చేసింది. యశస్వి జైస్వాల్ 25 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదటంతో రాయల్స్ స్కోరు పరుగులు పెట్టింది. తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించిన అనంతరం యశస్వి వికెట్ కోల్పోయాడు. ఆ తర్వాత జోశ్ బట్లర్ క్రీజులో నిలిచినా.. రాయల్స్ పరుగుల వేగం నెమ్మదించింది. సంజు శాంసన్ (0), రియాన్ పరాగ్ (7) నిరాశపరిచారు. షిమ్రోన్ హెట్మయర్ (39 నాటౌట్, 21 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) మెరవటంతో రాయల్స్ 199 పరుగులు చేసింది. యశస్వి క్రీజులో ఉండగా 250 పైచిలుకు స్కోరుపై కన్నేసిన రాజస్థాన్.. అతడి నిష్క్రమణతో 199 పరుగులతోనే సరిపెట్టుకుంది. క్యాపిటల్స్ బౌలర్లలో ముకేశ్ కుమార్ (2/36) రెండు వికెట్లు తీసుకున్నాడు.
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : యశస్వి జైస్వాల్ (సి,బి) ముకేశ్ కుమార్ 60, జోశ్ బట్లర్ (సి,బి) ముకేశ్ కుమార్ 79, సంజు శాంసన్ (సి) నోకియా (బి) కుల్దీప్ యాదవ్ 0, రియాన్ పరాగ్ (బి) రోవ్‌మన్ పాలెవ్ 7, షిమ్రోన్ హెట్మయర్ నాటౌట్ 39, ధ్రువ్ పోరెల్ నాటౌట్ 8, ఎక్స్‌ట్రాలు :6, మొత్తం : (20 ఓవర్లలో 4 వికెట్లకు) 199.
వికెట్ల పతనం : 1-98, 2-103, 3-126, 4-175.
బౌలింగ్ : ఖలీల్ అహ్మద్ 2-0-31-0, ఎన్రిచ్ నోకియా 4-0-44-0, ముకేశ్ కుమార్ 4-0-36-2, అక్షర్ పటేల్ 4-0-38-0, కుల్దీప్ యాదవ్ 4-0-31-1, రోవ్‌మన్ పావెల్ 2-0-18-1.
ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ : పృథ్వీ షా (సి) శాంసన్ (బి) బౌల్ట్ 0, డెవిడ్ వార్నర్ (ఎల్బీ) చాహల్ 65, మనీశ్ పాండే (ఎల్బీ) బౌల్ట్ 0, రౌలీ రొసో (సి) జైస్వాల్ (బి) అశ్విన్ 14, లలిత్ యాదవ్ (బి) బౌల్ట్ 38, అక్షర్ పటేల్ (స్టంప్డ్) శాంసన్ (బి) చాహల్ 2, రోవ్‌మన్ పావెల్ (సి) హెట్మయర్ (బి) అశ్విన్ 2, అభిషేక్ పోరెల్ (సి) హెట్మయర్ (బి) చాహల్ 7, కుల్దీప్ యాదవ్ నాటౌట్ 3, ఎన్రిచ్ నోకియా (బి) సందీప్ శర్మ 0, ముకేశ్ కుమార్ నాటౌట్ 1, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (20 ఓవర్లలో 9 వికెట్లకు) 142.
వికెట్ల పతనం : 1-0, 2-0, 3-36, 4-100, 5-111, 6-118, 7-138, 8-139, 9-140.
బౌలింగ్ : ట్రెంట్ బౌల్ట్ 4-1-29-3, సందీప్ శర్మ 4-0-20-1, రవిచంద్రన్ అశ్విన్ 4-0-25-2, జేసన్ హౌల్డర్ 3-0-28-0, యుజ్వెంద్ర చాహల్ 4-0-27-3, మురుగన్ అశ్విన్ 1-0-11-0.