Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓర్లీన్స్ టైటిల్ రజావత్ వశం
- ఫైనల్లో మాగస్పై మెరుపు విజయం
భారత యువ షట్లర్ ప్రియాంశురజావత్ కెరీర్ అత్యుత్తమ విజయం నమోదు చేశాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ సీనియర్ లెవల్లో రెండో రౌండ్ ప్రదర్శనే రజావత్‌కు గతంలో అత్యుత్తమం. ఓర్లీన్స్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నీలో సూపర్‌గా రాణించిన ప్రియాంశురజావత్ కెరీర్ తొలి టైటిల్ విజయం అందుకున్నాడు. టైటిల్ పోరులో డెన్మార్క్ షట్లర్‌పై 2-1తో మెరుపు విజయం సాధించి ఔరా అనిపించాడు.
ఓర్లీన్స్ (ఫ్రాన్స్)
ప్రియాంశురజావత్.. భారత బ్యాడ్మింటన్‌లో మరో యువ తార. సీనియర్ షట్లర్లు క్రమంగా పూర్వ వైభవం కోల్పోతున్న తరుణంలో పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రియాంశురజావత్ మెరుపు ప్రదర్శన చేశాడు. ఓర్లీన్స్ మాస్టర్స్ సూపర్ 300 టోర్నీ పురుషుల సింగిల్స్ విజేతగా అవతరించాడు. ఆదివారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో డెన్మార్క్ షట్లర్ మాగస్ జొహనెసెన్పై 21-15, 19-21, 21-16తో ప్రియాంశురజావత్ అదరగొట్టాడు. 68 నిమిషాల్లో ముగిసిన టైటిల్ పోరులో భారత షట్లర్ మూడు గేముల్లో విజయం సాధించాడు. 21 ఏండ్ల ప్రియాంశురజావత్కు సీనియర్ లెవల్లో ఇదే తొలి టైటిల్ విజయం కావటం గమనార్హం.
ఎటువంటి అంచనాలు లేకుండా ఓర్లీన్స్ ఓపెన్ బరిలో నిలిచిన ప్రియాంశురజావత్.. ప్రీ క్వార్టర్స్‌లో టాప్ సీడ్, జపాన్ షట్లర్ కెంట నిషిమోటపై విజయంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. కెంట నిషిమోటపై విజయం గాలివాటం కాదని క్వార్టర్ఫైనల్లో, సెమీఫైనల్లో ఏకపక్ష విజయాలతో నిరూపించిన ప్రియాంశురజావత్.. టైటిల్ పోరులోనూ వెనక్కి తగ్గలేదు. మూడు గేముల తుది సమరంలో తొలి గేమ్‌లో 21-15తో నెగ్గాడు. ఫస్ట్ హాఫ్‌లో ఉత్కంఠగా సాగిన గేమ్‌ను విరామం అనంతరం ప్రియాంశు ఏకపక్షం చేశాడు. 11-9తో బ్రేక్ టైమ్‌కు ముందంజలో నిలిచిన రజావత్.. ఆ తర్వాత దూసుకెళ్లాడు. 18-11తో తొలి గేమ్‌ను లాంఛనం చేసుకున్నాడు. కీలక రెండో గేమ్‌లో డెన్మార్క్ ఆటగాడు మాగస్ పుంజుకున్నాడు. 8-11తో విరామ సమయానికి ప్రియాంశువెనుకంజ వేశాడు. కానీ ద్వితీయార్థంలో 14-14తో స్కోరు సమం చేసి..16-14, 17-15తో ఆధిక్యం సాధించాడు. చావోరేవో తేల్చుకోవాల్సిన గేమ్‌లో మాగస్ మెప్పించాడు. 17-17 వద్ద ప్రియాంశును నిలువరించి.. 21-19తో రెండో గేమ్‌ను గెల్చుకున్నాడు. మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో గేమ్‌కు తీసుకెళ్లాడు. టైటిల్ విజేతను తేల్చే మూడో గేమ్ ఏకపక్షంగా సాగింది. ప్రియాంశురజావత్ ఆరంభం నుంచీ రెచ్చిపోయాడు. 11-9తో విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచిన ప్రియాంశు సెకండ్‌హాఫ్‌లో ఎక్కడా ఆగలేదు. వరుస పాయింట్లతో చెలరేగాడు. 21-16తో మూడో గేమ్‌తో పాటు కెరీర్ తొలి డబ్ల్యూబిఎఫ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.