Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్‌పై హైదరాబాద్ గెలుపు
- రాణించిన త్రిపాఠి, మార్కరం
నవతెలంగాణ-హైదరాబాద్ :
సన్‌రైజర్స్ హైదరాబాద్ బోణీ కొట్టింది. ఐపీఎల్16లో తొలి విజయం నమోదు చేసింది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 143 పరుగుల స్వల్ప ఛేదనలో రాహుల్ త్రిపాఠి (74 నాటౌట్, 48 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), కెప్టెన్ ఎడెన్ మార్కరం (37 నాటౌట్, 21 బంతుల్లో 6 ఫోర్లు) మెరవటంతో సన్‌రైజర్స్ సులువుగా గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 143 పరుగులు చేసింది. స్పిన్నర్ మయాంక్ మార్కండె (4/15) మాయజాలానికి తోడు మార్కో జాన్సెన్ (2/16), ఉమ్రాన్ మాలిక్ (2/32) నిప్పులు చెరగటంతో పంజాబ్ కింగ్స్ ఓ దశలో 88/9తో స్పల్ప స్కోరుకే కుప్పకూలే ప్రమాదంలో పడింది. ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధావన్ (99 నాటౌట్, 66 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఒంటరి పోరాటంతో పంజాబ్ కింగ్స్‌కు మెరుగైన స్కోరు అందించాడు. మూడు మ్యాచుల్లో హైదరాబాద్‌కు ఇది తొలి విజయం కాగా, పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచుల్లో ఇది తొలి ఓటమి.
రాణించిన రాహుల్ : 144 పరుగుల స్వల్ప ఛేదనలో హైదరాబాద్‌కు మంచి ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు హ్యారీ బ్రూక్ (13), మయాంక్ అగర్వాల్ (21) నిరాశపరిచారు. 45/2తో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆత్మరక్షణలో పడింది. ఈ సమయంలో జతకట్టిన రాహుల్ త్రిపాఠి (74 నాటౌట్), ఎడెన్ మార్కరం (37 నాటౌట్) మూడో వికెట్‌కు అజేయంగా 100 పరుగులు జోడించారు. క్రీజులో కుదురుకునేందుకు సమయం తీసుకున్న రాహుల్ త్రిపాఠి.. ఆ తర్వాత బౌండరీలతో చెలరేగాడు. ఏడు ఫోర్లు, రెండు సిక్సర్లతో సీజన్లో హైదరాబాద్ తరఫున తొలి అర్థ సెంచరీ సాధించాడు. మార్కరం సైతం ఆరు బౌండరీలతో మెరవటంతో మరో 17 బంతులు మిగిలి ఉండగానే సన్‌రైజర్స్ లాంఛనం పూర్తి చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్, రాహుల్ చాహర్ చెరో వికెట్ తీసుకున్నారు.
ధావన్ ఒక్కడే : టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్‌కు సన్‌రైజర్స్ బౌలర్లు చుక్కలు చూపించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే వికెట్ల వేటకు తెరలేపిన హైదరాబాద్.. క్రమం తప్పకుండా వికెట్లు కూలగొట్టింది. భువి, జాన్సెన్ విజృంభణతో పవర్‌ప్లే అనంతరం 41/3తో నిలిచిన పంజాబ్ కింగ్స్‌ను మిడిల్ ఓవర్లలో స్పిన్నర్ మయాంక్ మార్కండె (4/15) మాయ చేశాడు. శామ్ కరణ్ (22), షారుక్ ఖాన్ (4), రాహుల్ (0), ఎలిస్ (0) వికెట్లతో మాయజాలం ప్రదర్శించాడు. ఉమ్రాన్ మాలిక్ సైతం మెరవటంతో 88 పరుగులకే పంజాబ్ 9 వికెట్లు కోల్పోయింది. కానీ కెప్టెన్ శిఖర్ ధావన్ (99 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. పదో వికెట్‌కు అజేయంగా 55 పరుగులు జోడించిన ధావన్.. 66 బంతుల్లో 12 ఫోర్లు,5 సిక్సర్లతో పంజాబ్‌కు పోరాడగలిగే స్కోరు అందించాడు.
స్కోరు వివరాలు : పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 143/9 (ధావన్ 99, కరణ్ 22, మార్కండె 4/15, జాన్సెన్ 2/16) సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ : 145/2 (త్రిపాఠి 74, మార్కరం 37, అర్షదీప్ సింగ్ 1/20)