Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఛేదనలో సంచలన ఇన్నింగ్స్
- రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వృథా
- టైటాన్స్‌పై నైట్‌రైడర్స్ గెలుపు
కోల్‌కత విజయానికి 24 బంతుల్లో 50 పరుగులు అవసరం. క్రీజులో రసెల్, రింకూ సింగ్. కోల్‌కత వైపు స్పష్టమైన మొగ్గు. స్పిన్ మాస్టర్ రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వికెట్లతో టైటాన్స్‌ను రేసులో నిలిపాడు.బిగ్ హిట్టర్లు రసెల్ (1), నరైన్ (0), శార్దుల్ (0) రషీద్ మాయలో పడ్డారు. ఇక గుజరాత్ గెలుపు లాంఛనమే అనిపించింది. చివరి ఓవర్లో 29 పరుగులు అవసరం కావటంతో కోల్‌కత విజయంపై ఎవరికీ ఆలోచన లేదు. ఈ సమయంలోనే రింకూ సింగ్ (48 నాటౌట్) అద్భుతం ఆవిష్కరించాడు. వరుసగా చివరి ఐదు బంతులకు సిక్సర్లు కొట్టాడు. రింకూ విధ్వంసంతో నైట్‌రైడర్స్ రెండో విజయం సాధించగా.. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ తొలి పరాజయం చవిచూసింది. ఐపీఎల్ చరిత్రలోనే మునుపెన్నడూ చూడని అద్బుతం రింకూ సింగ్ నమ్మశక్యం కాని విధ్వంసక ఇన్నింగ్స్‌తో సాధ్యపడింది.
నవతెలంగాణ-అహ్మదాబాద్
రింకూ సింగ్ (48 నాటౌట్, 21 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్స్‌లు) అద్వితీయ ఇన్నింగ్స్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. గుజరాత్ టైటాన్స్‌పై కోల్‌కత నైట్‌రైడర్స్‌ను 3 వికెట్ల తేడాతో గెలిపించాడు. ఆశల్లేని మ్యాచ్‌లో గ్రౌండ్‌కు నలువైపులా వరుసగా ఐదు సిక్సర్లు సంధించి కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఊహించని విజయాన్ని కట్టబెట్టాడు. 205 పరుగుల భారీ ఛేదనలో వెంకటేశ్ అయ్యర్ (83, 40 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), నితీశ్ రానా (45, 29 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. 16 ఓవర్ల వరకు మ్యాచ్ కోల్‌కత చేతుల్లో ఉండగా.. రషీద్ ఖాన్ (3/37) హ్యాట్రిక్ వికెట్లతో టైటాన్స్ పట్టు బిగించింది. చివరి ఓవర్లో యశ్ దయాల్‌పై రింకూ సింగ్ విశ్వరూపంతో ఐపీఎల్ చరిత్రలోనే మునుపెన్నడూ ఎరుగని ముగింపు అభిమానులను ఆస్వాదించారు. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్‌కు ఇది తొలి ఓటమి కాగా.. కోల్‌కత నైట్‌రైడర్స్‌కు ఇది రెండో విజయం. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ సాయి సుదర్శన్ (53, 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), విజరు శంకర్ (63 నాటౌట్, 24 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) రాణించటంతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 204 పరుగుల భారీ స్కోరు చేసింది. టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య గైర్హాజరీలో రషీద్ ఖాన్ సారథ్యం వహించాడు. రింకూ సింగ్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు.
రింకూ అద్బుతం : భారీ ఛేదనలో కోల్‌కతకు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు గుర్బాజ్ (15), జగదీశన్ (6) ఆరంభంలోనే విఫలమయ్యారు. ఈ సమయంలో వెంకటేశ్ అయ్యర్ (83), కెప్టెన్ నితీశ్ రానా (45) మూడో వికెట్‌కు 100 పరుగులు జోడించారు. ఈ ఇద్దరు మెరవటంతో ఛేదనలో నైట్‌రైడర్స్ లక్ష్యం దిశగా సాగింది. అర్థ సెంచరీ ముంగిట రానా అవుటైనా.. రింకూ సింగ్ తోడుగా అయ్యర్ అదరగొట్టాడు. ఐదు సిక్సర్లు, ఎనిమిది ఫోర్లతో అయ్యర్ చెలరేగాడు. అతడు క్రీజులో ఉండగా టైటాన్స్ బౌలర్లు చేష్టలుడిగారు. భారీ షాట్‌కు వెళ్లి అయ్యర్ అవుట్ కాగా.. రషీద్ ఖాన్ హ్యాట్రిక్ వికెట్ల వేటతో కోల్‌కత ఆశలు ఆవిరయ్యాయి. రసెల్ (1), నరైన్ (0), శార్దుల్ (0) నిష్క్రమణతో టైటాన్స్ గెలపు లాంఛనం చేసుకుంది. చివరి ఆరు బంతుల్లో 29 పరుగులు అవసరం కాగా.. ఎవరూ కోల్‌కత నుంచి పోరాటం ఊహించలేదు. తొలి బంతికి ఉమేశ్ యాదవ్ సింగిల్‌తో రింకూ సింగ్‌కు స్ట్రయిక్ ఇవ్వగా.. చివరి ఐదు బంతులను స్టాండ్స్‌లోకి పంపించిన రింకూ అద్భుతమే చేశాడు. 20 ఓవర్లలో 7 వికెట్లకు 207 పరుగులు చేసిన కోల్‌కత 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
రాణించిన సాయి, శంకర్ : తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (39), సాహా (17) శుభారంభం అందించారు. సాయి సుదర్శన్ (53), విజరు శంకర్ (63 నాటౌట్) అర్థ సెంచరీలతో కదం తొక్కారు. సాయి, శంకర్ మెరుపులతో టైటాన్స్ 204 పరుగులు చేసింది. పవర్‌ప్లేలో గిల్.. మిడిల్ ఓవర్లలో సాయి సుదర్శన్, డెత్ ఓవర్లలో విజరు శంకర్ టైటాన్స్ పరుగుల వేటకు సారథ్యం వహించారు. డెవిడ్ మిల్లర్ (2 నాటౌట్) అజేయంగా నిలిచాడు. కోల్‌కత స్పిన్నర్ సునీల్ నరైన్ (3/33) మూడు వికెట్లు తీసుకున్నాడు.
స్కోరు వివరాలు :
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ : సాహా (సి) జగదీశన్ (బి) నరైన్ 17, గిల్ (సి) ఉమేశ్ (బి) నరైన్ 39, సాయి సుదర్శన్ (సి) రారు (బి) నరైన్ 53, అభినవ్ (బి) సుయాశ్ 14, విజరు శంకర్ నాటౌట్ 63, డెవిడ్ మిల్లర్ నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 16, మొత్తం : (20 ఓవర్లలో 4 వికెట్లకు) 204.
వికెట్ల పతనం : 1-33, 2-100, 3-118, 4-153.
బౌలింగ్ : ఉమేశ్ 3-0-24-0, శార్దుల్ 3-0-40-0, ఫెర్గుసన్ 4-0-40-0, నరైన్ 4-0-33-3, చక్రవర్తి 2-0-27-0, సుయాశ్ 4-0-35-1.
కోల్‌కత నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : గుర్బాజ్ (సి) యశ్ (బి) షమి 15, జగదీశన్ (సి) అభినవ్ (బి) లిటిల్ 6, అయ్యర్ (సి) గిల్ (బి) జోసెఫ్ 83, రానా (సి) షమి (బి) జొసెఫ్ 45, రింకూ సింగ్ నాటౌట్ 48, రసెల్ (సి) భరత్ (బి) రషీద్ ఖాన్ 1, సునీల్ నరైన్ (సి) జయంత్ (బి) రషీద్ ఖాన్ 0, శార్దుల్ (ఎల్బీ) రషీద్ ఖాన్ 0, ఉమేశ్ నాటౌట్ 5, ఎక్స్‌ట్రాలు : 4, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 207.
వికెట్ల పతనం : 1-20, 2-28, 3-128, 4-154, 5-155, 6-155, 7-155.
బౌలింగ్ : షమి 4-0-28-1, లిటిల్ 4-0-45-1, జోసెఫ్ 4-0-27-2, యశ్ 4-0-69-0, రషీద్ ఖాన్ 4-0-37-3.