Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్‌కతా కోచ్
న్యూఢిల్లీ : గుజరాత్ టైటన్స్‌పై ఆఖరి ఐదు బంతుల్లో ఐదు సిక్స్‌లు కొట్టిన రింకూ సింగ్‌పై ప్రశంసలు కురుస్తోంది. ఇదే క్రమంలో ఆ జట్టు కోచ్ చంద్రకాంత్ పండిత్ మాట్లాడుతూ.. తన 43 ఏళ్ల కెరీర్లో ఇలాంటి అద్భుతం ఏనాడూ చూడలేదని అన్నాడు. దాదాపు ఓటమి ఖాయం అనుకున్న దశలో ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ ఒంటి చేత్తో కోల్‌కతాను గెలిపించాడని పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం చంద్రకాంత్ పండిత్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'ఇదొక అద్భుతం. అందులో సందేహం లేదు. రింకూ అలా చెలరేగడం ఒక మిరాకిల్. అయితే.. మేము ఆటగాళ్ల నమ్మకాన్ని, రింకూ ఆత్మవిశ్వాసాన్ని ఎన్నడూ తక్కువ అంచనా వేయలేదు. నేను ఎల్లప్పుడూ రింకూతో నువ్వు నా బెస్ట్ ప్లేయర్ అని అంటుంటాను. ఇప్పుడు కూడా అదే మాట చెప్తాను. నిజం చెప్తున్నా.. ఏడు వికెట్లు కోల్పోయిన దశలో తమ జట్టు గెలుస్తుందని ఏ కోచ్ కూడా చెప్పడు. కానీ, టీ20లో ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చని మాకు తెలుసు. అందుకని నమ్మకం కోల్పోలేదు. ముఖ్యంగా రింకూ లాంటి ప్లేయర్ క్రీజులో ఉన్నప్పుడు ఓడిపోతామని ఎలా అనుకుంటాం. మూడో సిక్సర్. కవర్స్ దిశగా రింకూ కొట్టిన ఆ సిక్స్ చాలా నచ్చింది. ఫుల్ టాస్ బంతిని రింకూ అద్భుతంగా స్టాండ్స్‌లోకి పంపాడు. మ్యాచ్ సమయంలో మా సీఈఓ వెంకీ మైసూర్ స్టేడియంలోనే ఉన్నాడు. అతను చాలా సంతోషించాడు. ఫ్రాంచైజీ యజమా నులు జై మెహతా, జూహీ చావ్లా కిందికి వచ్చి టీమ్ మొత్తాన్ని అభినందించారు. వాళ్ల కళ్లలో ఎంతో సంతోషం కనిపించింది.అని చంద్రకాంత్ తెలిపాడు.
యశ్ దయాల్‌కు నిద్రలేని రాత్రి
గుజరాత్ టైటాన్స్ బౌలర్ యశ్ దయాల్‌కు అరణ్య రోదనే మిగిలింది. కేకేఆర్ బ్యాటర్ రింకూ సింగ్ నిప్పులు చెరిగే బ్యాటింగ్ చేస్తూ వరుసగా సిక్సర్లు కొడుతుంటే.. యశ్‌కు ఏమి చేయాలో పాలు పోలేదు. యశ్ వేసిన చివరి ఓవర్లో కేకేఆర్ బ్యాటర్ రింకూ వరుసగా అయిదు సిక్సర్లు కొట్టి సంచలన విజయాన్ని నమోదు చేశాడు. గుడ్లెన్త్ బౌల్స్ వేసిన యశ్ దయాల్‌ను నిర్దాక్షిణ్యంగా బాదేశాడు రింకూ. కేకేఆర్ బ్యాటర్ జోరుకు.. దయాల్‌కు అవమానమే మిగిలింది.