Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సౌకర్యాల కల్పనకు రూ.500 కోట్లు
- ఉప్పల్ సహా ఐదు స్టేడియాల ఆధునీకరణ
- మాస్టర్‌ప్లాన్ రూపొందించిన బీసీసీఐ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కుల వేలంతో బీసీసీఐ దక్కించుకున్న సొమ్ము రూ.48390 కోట్లు. టీమ్ ఇండియా స్వదేశంలో ఆడే ప్రతి మ్యాచ్‌కు మీడియా హక్కుల రూపంలో రూ.100 కోట్లకు పైగానే భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆర్జిస్తోంది. గత పదేండ్లలో బీసీసీఐ ఆదాయం జెట్ స్పీడ్‌తో పెరిగింది. అయినా, క్రికెట్‌కు చూసేందుకు స్టేడియాలకు వచ్చే ప్రేక్షకులకు కల్పించే సదుపాయాలు మాత్రం అత్యంత దారుణంగా ఉన్నాయి. 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ ముంగిట స్టేడియాల్లో మౌళిక సౌకర్యాల కల్పనపై బీసీసీఐ దృష్టి సారించనుంది!.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్ జట్టు భారత పర్యటనకు వచ్చింది. హైదరాబాద్‌లో భారత్, న్యూజిలాండ్ వైట్‌బాల్ పోరు. ఆ మ్యాచ్‌కు బీసీసీఐ ఓ ప్రత్యేక బృందాన్ని ఉప్పల్ స్టేడియానికి పంపించింది. స్టేడియానికి వచ్చిన ప్రేక్షకులతో సర్వే నిర్వహించిన ఆ బృందం.. ఉప్పల్ మైదానంలో సదుపాయాలు ఎలా ఉన్నాయి? సాధారణ స్టాండ్స్‌లో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచుతున్నారా? సీటింగ్ సౌకర్యం ఎలా ఉంది? అంటూ ప్రశ్నలు సంధించింది. ప్రేక్షకుల అభిప్రాయాలను సేకరించటంతో పాటు స్టేడియంలో నలువైపులా తిరిగిన ఆ బృందం ఫోటోలను తీసుకుంది. ఇదే తరహాలో న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలోనూ కనిపించింది. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా కోట్ల మైదానంలో ఏకంగా అభిమానులు టాయిలెట్ల నిర్వహణపై బోర్డుకు సోషల్ మీడియా వేదికగా ఫిర్యాదు చేశారు. క్రికెట్ మ్యాచుల నిర్వహణ, మీడియా హక్కులు, విలువైన స్పాన్సర్‌షిప్‌లతో రూ. వేల కోట్లు ఆర్జిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. దేశవ్యాప్తంగా పలు స్టేడియాల్లో సౌకర్యాల కల్పనకు నడుం బిగించనుంది. 2023 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ను దృష్టిలో ఉంచుకుని, మెగా ఈవెంట్లో అభిమానులకు మెరుగైన సౌకర్యాలు, సదుపాయాలు కల్పించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం బీసీసీఐ ఇప్పటికే మాస్టర్‌ప్లాన్ సిద్ధం చేసింది.
ఉప్పల్‌కు రూ.117.17 కోట్లు : దేశవ్యాప్తంగా ఐదు స్టేడియాలను ఆధునీకరించేందుకు బీసీసీఐ ప్రణాళికలు తయారు చేసింది. అందులో హైదరాబాద్ సహా న్యూఢిల్లీ, కోల్‌కత, మొహాలి, ముంబయి స్టేడియాలు ఉన్నాయి. ఈ ఐదు స్టేడియాల్లో మౌళిక వసతుల కల్పనకు బీసీసీఐ ఏకంగా రూ.500 కోట్లు వెచ్చించనుంది. ఢిల్లీ కోట్ల మైదానం డిజైన్ పరంగా సమస్యలు ఎదుర్కొంటుంది. ఈ స్టేడియాన్ని పూర్తిగా మార్చివేసేందుకు భారీగా నిధులు అవసరం. ప్రస్తుతానికి ఆ స్టేడియంలో అవసరమైన మార్పుల కోసం రూ.100 కోట్లు కేటాయించనున్నారు. ఇక హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం ఆధునీకరణ పనులకు రూ.117.17 కోట్లు ఖర్చు చేయనున్నారు. కోల్‌కతలోని ఈడెన్‌గార్డెన్స్ స్టేడియం కోసం రూ.127.47 కోట్లు, మొహాలిలోని పిసిఎ స్టేడియానికి రూ.79.46 కోట్లు, ముంబయిలోని వాంఖడె మైదానానికి రూ.78.82 కోట్లతో ఆధునీకరణ పనులు చేయనున్నారు. రూ.500 కోట్ల నిధులతో చేసే సౌకర్యాల కల్పన పనులను స్వయంగా బీసీసీఐ పర్యవేక్షించే అవకాశం ఉంది. రాష్ట్ర సంఘాల నుంచి కాంట్రాక్టులు ఇవ్వకుండా నేరుగా ఒప్పందాలు చేసుకునేందుకు బోర్డు ఆలోచిస్తోంది. ఇందులో కొన్ని స్టేడియాల్లో పైకప్పు పనులు సైతం పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా రూపొందించిన అంచనాల్లో పైకప్పు నిర్మాణ వ్యయం పరిగణనలోకి తీసుకోలేదు. ఒకవేళ పైకప్పు పనులనూ కలుపుకుంటే.. స్టేడియాల ఆధునీకరణకు మరిన్ని నిధులు అవసరం అవుతాయి.
12 వేదికల్లో ప్రపంచకప్! : 2023 ఐసీసీ వరల్డ్‌కప్‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. చివరగా 2011 ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌కు ఆతిథ్యం ఇచ్చిన భారత్.. మళ్లీ ఇప్పుడే మెగా ఈవెంట్‌కు సిద్ధమవుతోంది. ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో జరుగనున్న ప్రతిష్టాత్మక టోర్నీలో 48 మ్యాచులకు ఆతిథ్యం ఇచ్చేందుకు బీసీసీఐ 12 స్టేడియాలను ఎంపిక చేసింది. వన్డే వరల్డ్‌కప్ 46 రోజుల పాటు సాగనుంది. బెంగళూర్, చెన్నై, ఢిల్లీ, ధర్మశాల, గువహటి, హైదరాబాద్, కోల్‌కత, లక్నో, ఇండోర్, రాజ్‌కోట్, ముంబయి, అహ్మదాబాద్ ఆ జాబితాలో ఉన్నాయి. ప్రపంచకప్ ఫైనల్‌కు అహ్మదాబాద్‌లోని అతిపెద్ద స్టేడియం వేదికగా నిలువనుంది!. ఎంపిక చేసిన ప్రతి స్టేడియంలో 3-4 ప్రపంచకప్ మ్యాచులు జరిగే అవకాశం ఉంది. ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు వచ్చిన అభిమానుల అనుభూతిని మరింత మెరుగు పర్చేందుకు బీసీసీఐ స్టేడియాలకు సరికొత్త రూపు తీసుకురానుంది.