Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-కాంస్య పోరుకు మరో ముగ్గురు
- ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్
అస్టానా : యువ రెజ్లర్ అంటిమ్ పంగాల్ కౌంటర్ ఎటాకింగ్ ఆటతీరుతో అదరగొట్టింది. ప్రత్యర్థిని ఓ పట్టు పట్టిన పంగాల్ ఆసియా రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్ మహిళల 53 కేజీల విభాగంలో ఫైనల్లోకి ప్రవేశించింది. 18 ఏండ్ల పంగాల్ నిరుడు అండర్-20 ప్రపంచ చాంపియన్‌గా నిలిచి ఆ ఘనత సాధించిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించింది. తాజాగా ఆసియా చాంపియన్‌షిప్స్‌లో ప్రత్యర్థులను చిత్తు చేస్తూ పసిడి పోరుకు చేరుకుంది. ఉబ్బెకిస్థాన్ రెజ్లర్‌పై 8-1తో గెలుపొందిన పంగాల్.. హెచ్చరిక రూపంలో మాత్రమే ఓ పాయింట్‌ను ప్రత్యర్థికి కోల్పోవాల్సి వచ్చింది. లెఫ్ట్ లెగ్ ఎటాక్‌తో టేక్‌డౌన్‌తో దాడి చేసిన పంగాల్..మ్యాట్‌పై పూర్తి ఆధిపత్యం చూపించింది. జపాన్ రెజ్లర్, 2021 వరల్డ్ చాంపియన్ అకారి ఫుజినమితో పంగాల్ పసిడి పోరులో పోటీపడనుంది. మనీశ (65 కేజీల విభాగం), రితిక (72 కేజీల విభాగం), సోనమ్ మాలిక్ (62 కేజీల విభాగం)లు నేడు కాంస్య పతక పోరులో తలపడనున్నారు. జపాన్ రెజ్లర్‌తో బౌట్లో గాయపడిన అన్షు మాలిక్ 1-5తో తడబడి.. కాంస్య పోరుకు పరిమితమైంది. ఫిట్నెస్ సహకరిస్తే కాంస్య పతక మ్యాచ్‌కు అన్షు మ్యాట్‌పై అడుగుపెట్టనుంది. నిశ దహియ (68 కేజీల విభాగం), ప్రియ (76 కేజీల విభాగం) రజత, కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.