Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంతి మార్పుపై అశ్విన్ విమర్శలు
- 25 శాతం జరిమానా విధించిన రిఫరీ
చెన్నై : రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మ్యాచ్‌లో అంపైర్ల నిర్ణయాలపై రాయల్స్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శలు గుప్పించారు. చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్ మధ్యలో మంచు కారణంగా బంతి తడిగా ఉందనే కారణంతో అంపైర్లు మరో బంతిని తీసుకున్నారు. దీనిపై అశ్విన్ తీవ్ర అభ్యంతరం తెలిపాడు. ఫీల్డింగ్ జట్టు ఫిర్యాదు చేయకుండా అంపైర్లు బంతి మార్చటం గందరగోళంలో పడేసిందని విమర్శించాడు. ' అంపైర్లు తమంతట తామే బంతిని మార్చటం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇది గతంలో ఎన్నడూ జరుగలేదు. ఆ నిర్ణయం నన్ను గందరగోళంలో పడేసింది. అది మంచికైనా, చెడుకైనా కొంచెంత సమతుల్యత అవసరం. బౌలింగ్ జట్టు నుంచి బంతిపై ఏ ఫిర్యాదు లేదు. అంపైర్లు తమకు తాముగా బంతిని మార్చారు. బంతిని ఎందుకు మార్చారని అడుగగా.. మేము (అంపైర్లు) మార్చవచ్చని బదులిచ్చారు. అయితే, ప్రతి మ్యాచ్‌లో మంచు కురిసిన ప్రతిసారి బంతిని మార్చాలి. ఐపీఎల్లో ప్రతి మ్యాచ్‌కు ఇది వర్తించాలి. అంపైర్లు ఏదైనా చేయవచ్చు కానీ అది ప్రామాణికంగా ఉండాలని' అశ్విన్ అన్నాడు. కాగా, ఐపీఎల్, ఐసీసీ నిబంధనల ప్రకారం అంపైర్లకు బంతిని మార్పు చేసే అధికారం ఉంటుంది.
ఇక మ్యాచ్‌లో జరిగిన సంఘటనలపై అధికారులను, ఆటగాళ్లను, ఇతరులపై బహిరంగ విమర్శలు చేసినందుకు రవిచంద్రన్ అశ్విన్‌కు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు. మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించారు. రిఫరీ జరిమానాను అశ్విన్ అంగీకరించాడు. దీంతో ఈ విషయంలో ఎటువంటి అప్పీల్‌కు అవకాశం ఉండదు.