Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంజాబ్‌పై గుజరాత్ గెలుపు
- ఛేదనలో రాణించిన శుభ్‌మన్
నవతెలంగాణ-మొహాలి
ఛేదనలో తనకు తిరుగులేదని గుజరాత్ టైటాన్స్ మరోసారి నిరూపించింది. లక్ష్యాలను ఛేదిస్తూ ఈ సీజన్లో వరుసగా మూడో విజయం నమోదు చేసింది. గురువారం మొహాలిలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. 154 పరుగుల ఛేదనలో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (67, 49 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో రాణించాడు. సాయి సుదర్శన్ (19), హార్దిక్ పాండ్య (8) వికెట్లతో గుజరాత్ టైటాన్స్‌పై పంజాబ్ కింగ్స్ ఒత్తిడి పెంచినా.. డెవిడ్ మిల్లర్ (17 నాటౌట్, 18 బంతుల్లో 1 ఫోర్), గిల్ టైటాన్స్‌ను విజయానికి చేరువ చేశారు. ఆఖరు ఓవర్లో శామ్ కరణ్ సూపర్ బంతితో గిల్‌ను బోల్తా కొట్టించి ఉత్కంఠకు తెరతీశాడు. రాహుల్ తెవాటియ (5 నాటౌట్) ఫైన్ లెగ్ దిశగా బౌండరీతో ఉత్కంఠకు తెరదించాడు. మరో బంతి ఉండగానే టైటాన్స్‌ను విజేతగా నిలిపాడు.అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ తడబాటుకు గురైంది.. టైటాన్స్ బౌలర్లు సమిష్టిగా మెరవటంతో పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 153 పరుగులే చేసింది. మాథ్యూ షార్ట్ (36, 24 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఇన్నింగ్స్‌తో కదం తొక్కగా.. భానుక రాజపక్స (20, 26 బంతుల్లో 1 ఫోర్), జితేశ్ శర్మ (25, 23 బంతుల్లో 5 ఫోర్లు) మిడిల్ ఓవర్లలో వేగంగా ఆడలేదు. షారుక్ ఖాన్ (22, 9 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్) చివర్లో మెరుపు సిక్సర్లతో పంజాబ్ కింగ్స్‌కు 153 పరుగుల స్కోరు అందించాడు. 2020 అనంతరం తొలిసారి ఐపీఎల్లో ఆడుతున్న మోహిత్ శర్మ టైటాన్స్ తరఫున (2/18) గొప్పగా బౌలింగ్ చేశాడు.
టైటాన్స్ బౌలర్ల జోరు : టాస్ నెగ్గిన గుజరాత్ టైటాన్స్ ఛేదనకు మొగ్గుచూపింది. సొంతగడ్డపై తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన పంజాబ్ కింగ్స్‌కు తొలి ఓవర్లోనే మహ్మద్ షమి షాక్ ఇచ్చాడు. ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్ (0)ను డకౌట్ చేశాడు. కెప్టెన్ శిఖర్ ధావన్ (8)ను లిటిల్ వెనక్కి పంపటంతో పవర్‌ప్లేలో పంజాబ్ ఓపెనర్లను కోల్పోయింది. మాథ్యూ షార్ట్ (36) ఎదురుదాడితో పంజాబ్‌ను మళ్లీ రేసులోకి తెచ్చాడు. ఆరు ఫోర్లు, ఓ సిక్సర్ బాదిన మాథ్యూ.. రన్‌రేట్‌ను ముందుకు నడిపించాడు. కానీ షార్ట్ నిష్క్రమణతో పంజాబ్ కథ మొదటికొచ్చింది. నం.4 బ్యాటర్ భానుక రాజపక్స (20) పంజాబ్‌ను వెనక్కి నెట్టాడు. బౌండరీలు కొట్టలేకపోయిన రాజపక్స.. స్ట్రయిక్ సైతం రొటేట్ చేయలేదు. దీనికి తోడు మిడిల్ ఆర్డర్లో మోహిత్ శర్మ గొప్ప లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు సంధించాడు. జితేశ్ శర్మ (25), శామ్ కరణ్ (22) పోరాడినా.. దూకుడుగా పరుగులు సాధించలేకపోయారు. చివర్లో షారుక్ ఖాన్ మెరుపులతో పంజాబ్ గౌరవప్రద స్కోరు సాధించింది. రషీద్ ఖాన్ (1/26), జోశ్ లిటిల్ (1/31) రాణించారు.
స్కోరు వివరాలు :
పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ : 153/8 (మాథ్యూ షార్ట్ 36, జితేశ్ శర్మ 25, షారుక్ ఖాన్ 22, మోహిత్ శర్మ 2/18)
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ : 154/4 (శుభ్‌మన్ గిల్ 67, సాహా 30, హర్‌ప్రీత్ బరార్ 1/20, శామ్ కరణ్ 1/25)