Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్‌కత, హైదరాబాద్ పోరు నేడు
- ఆరెంజ్ ఆర్మీకి మరో కఠిన సవాల్
నవతెలంగాణ-కోల్‌కత
రెండు మ్యాచులు.. రెండు 200 ప్లస్ స్కోర్లు. ఓ మ్యాచ్‌లో ఆ స్కోరు కాపాడుకుంటే.. మరో మ్యాచ్‌లో ఛేదించారు. సీజన్ తొలి మ్యాచ్ వైఫల్యం అనంతరం కోల్‌కత నైట్‌రైడర్స్ శిబిరంలో నైరాశ్యం ఆవహించగా.. నెగ్గిన రెండు మ్యాచుల్లోనూ అనూహ్య ప్రదర్శనలు నమోదయ్యాయి. శార్దుల్ ఠాకూర్ మెరుపులే అద్బుతం అనుకుంటే.. రింకూ సింగ్ అద్భుతానికి మించిన ప్రదర్శన చేశాడు. అతడి సంచలన ముగింపు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించింది. మరోవైపు, తొలి రెండు మ్యాచుల్లో పేలవ ప్రదర్శనతో పరాజయాలు చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. మూడో మ్యాచ్‌లో మెరిసింది. బౌలర్లు అదరగొట్టడంతో తొలి విజయం ఖాతాలో వేసుకుంది. అటు కోల్‌కత, ఇటు హైదరాబాద్ విజయోత్సాహంలో కనిపిస్తున్నాయి. అసమాన ప్రదర్శనలతో కోల్‌కత జోరుమీదుంది. సఫారీ క్రికెటర్ల చేరితో సన్‌రైజర్స్ శిబిరం సైతం ఉత్సాహంగా కనిపిస్తుంది. దీంతో నేడు రైడర్స్, రైజర్స్ పోరులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.
ఆ ఇద్దరు కీలకం! : పంజాబ్ కింగ్స్‌తో స్వల్ప లక్ష్యాన్ని సన్‌రైజర్స్ ఛేదించింది. కానీ టాప్ ఆర్డర్ నుంచి ఆశించిన దూకుడు కనిపించలేదు. మూడు మ్యాచుల్లో మూడు ఓపెనింగ్ కాంబినేష్లను ప్రయోగించిన సన్‌రైజర్స్ నేడు ఏం చేస్తుందో ఆసక్తికరం. ఇంగ్లాండ్ యువ కెరటం హ్యారీ బ్రూక్, కెప్టెన్ ఎడెన్ మార్క్రామ్లు హైదరాబాద్‌కు అత్యంత కీలకం. ధనాధన్ క్రికెట్ ఆడటంలో బ్రూక్ దిట్ట. కానీ భారత పిచ్‌లపై అతడు లయ అందుకోలేకపోతున్నాడు. బ్రూక్ ఫామ్‌లోకి వస్తే సన్‌రైజర్స్ బ్యాటింగ్ కష్టాలు తీరినట్టే. కెప్టెన్ ఎడెన్ మార్క్రామ్ పంజాబ్‌తో మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. రాహుల్ త్రిపాఠికి చక్కటి సహకారం అందించాడు. చివర్లో చూడచక్కని బౌండరీలతో అలరించాడు. మయాంక్ అగర్వాల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్‌లు అంచనాలను అందుకోవటం లేదు. స్పిన్నర్ మయాంక్ మార్కండె పంజాబ్‌పై నాలుగు వికెట్లు పడగొట్టాడు. నేడు నైట్‌రైడర్స్‌తో మ్యాచ్‌లోనూ మార్కండె మాయజాలంపై ఆరెంజ్ ఆర్మీ భారీ ఆశలు పెట్టుకుంది. మార్కో జాన్సెన్, నటరాజన్ కొత్త బంతితో కీలకం కానున్నారు. హెన్రిచ్ క్లాసెన్‌ను తుది జట్టులోకి తీసుకోవటంతో బ్యాటింగ్ లైనప్ మరింత బలోపేతం కానుంది.
ఎదురుందా? : రెండు వరుస సంచలన విజయాల ఊపులో ఉన్న కోల్‌కత నైట్‌రైడర్స్‌ను నిలువరించటం హైదరాబాద్ సన్‌రైజర్స్‌కు కఠిన సవాల్. కీలక ఆటగాళ్లు తేలిపోతున్నా.. జట్టులోని ఇతర ఆటగాళ్లు అసాధారణ ప్రదర్శనలతో రెచ్చిపోవటంతో నైట్‌రైడర్స్‌కు ఎదురులేకుండా పోయింది!. ఆ ప్రదర్శనల స్ఫూర్తి ఇతర ఆటగాళ్లలోనూ స్పష్టంగా కనిపిస్తుంది. సొంతగడ్డపై ఆడుతున్న అదనపు అనుకూలత కోల్‌కతకు ఉంది. వెంకటేశ్ అయ్యర్, రెహ్మనుల్లా గుర్బాజ్, నితీశ్ రానా ఫామ్‌లో ఉన్నారు. అండ్రీ రసెల్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాల్సి ఉంది. శార్దుల్ ఠాకూర్, రింకూ సింగ్‌లు ప్రత్యర్థుల ప్రణాళికల్లో ఇక నుంచి కీలకం కానున్నారు. సునీల్ నరైన్, ఫెర్గుసన్, వరుణ్ చక్రవర్తికి తోడు మిస్టరీ స్పిన్నర్ సుయాశ్ శర్మ బౌలింగ్ విభాగాన్ని నడిపించనున్నారు.