Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీ20 లీగ్‌పై సౌదీ అరేబియా ఆసక్తి
- అత్యంత ధనిక క్రికెట్ లీగ్‌కు కసరత్తు
- బీసీసీఐ, ఐపీఎల్ ప్రాంఛైజీలతో చర్చలు!
ఫార్ములా 1, ఫార్ములా ఈ, ఎల్ఐవి గోల్ఫ్, ఫుట్‌బాల్.. ఈ జాబితాలోకి క్రికెట్‌నూ జతచేసేందుకు సౌదీ అరేబియా సిద్ధమవుతుంది!. గల్ఫ్ దేశాల్లో సౌదీ అరేబియాను స్పోర్ట్స్ టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అడుగులు పడుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ నిర్వహణపై సౌదీ అరేబియా ఆసక్తి చూపుతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ ప్రాంఛైజీలతో సౌదీ అరేబియా ప్రభుత్వ ఉన్నతాధికారులు ఇప్పటికే చర్చలు జరిపినట్టు సమాచారం!.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ప్రపంచంలోనే ధనిక టీ20 లీగ్
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ. వరల్డ్‌లోనే అత్యంత విజయవంతమైన, కమర్షియల్ టీ20 లీగ్ ఐపీఎల్. ఇటీవల ఎస్ఏ20, ఐఎల్టీ20 లీగ్‌లు విజయవం తమైనా.. ఐపీఎల్ స్థాయిని అవేవీ అందుకోలేదు. ఆసియా దేశాల్లో క్రికెట్‌కు బాగా ఆదరణ ఉండటం, ప్రపంచ క్రీడాభిమానులకు చేరువయ్యేందుకు క్రికెట్ సులువైన మార్గంగా భావించటం.. క్రికెట్ గ్లోబల్ టీ20 లీగ్ ఏర్పాటు దిశగా సౌదీ అరేబియా ఆలోచించేందుకు దోహదం చేస్తున్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో క్రికెటర్లకు అత్యధిక పారితోషికాలు అందుతున్నాయి. ఐపీఎల్ వేతనాలకు చేరువలో మరో టీ20 లీగ్ లేదు. ఐపీఎల్‌కు మించిన పారితోషికాలు అందిస్తే టీ20 లీగ్ విజయవంతం సులువే అని సౌదీ అరేబియా భావిస్తోంది. అందుకోసం ప్రణాళికలు తయారు చేస్తోంది.
బీసీసీఐతో చర్చలు
ప్రపంచ క్రికెట్లో టీ20 లీగ్ సక్సెస్ ఫార్ములా బీసీసీఐ వద్ద ఉందనే విషయం సౌదీ అరేబియా చాలా త్వరగా గ్రహించింది. గతంలో ఎన్నో లీగ్‌లు జరిగినా కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ సాధించలేదు. కానీ ఐపీఎల్ ప్రాంఛైజీలు జట్లను కొనుగోలు చేసిన ఎస్ఏ20, ఐఎల్టీ20 లీగ్‌లు ఆదరణ పొందాయి. దీంతో ఐపీఎల్ ప్రాంఛైజీలకు సౌదీ అరేబియా టీ20 లీగ్ జట్లను అప్పగించేందుకు ఆ దేశం సుముఖంగా ఉంది. ఇక భారత క్రికెటర్లు సైతం అందులో భాగస్వామ్యం అయ్యేందుకు బీసీసీఐతో ఇదివరకే సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. భారత క్రికెటర్లు విదేశీ టీ20 లీగ్‌లలో ఆడేందుకు బోర్డు అనుమతి ఇవ్వటం లేదు. భారీ వేతనాలు లభించే సౌదీ అరేబియా టీ20 లీగ్‌కు భారత క్రికెటర్లకు అనుమతి లభిస్తే.. అదే సక్సెస్ అని భావిస్తున్నారు. ఇటీవల పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్ సైతం సౌదీ అరేబియా ప్రిన్స్‌తో భేటీ అయ్యారు. సౌదీలో సరికొత్త టీ20 లీగ్ ఆవిష్కరణ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు అక్రమ్ వ్యాఖ్యానించటం గమనార్హం.
హైబ్రిడ్ మోడల్!
2030 ఏడాదిలోగా భారతీయుల పర్యాటక గమ్యస్థానం సౌదీ అరేబియా కావాలని ఆ దేశ టూరిజం అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఐపీఎల్లో సౌదీ అరేబియా టూరిజం సంస్థ స్పాన్సర్షిప్ ఒప్పందం చేసుకుంది. లీగ్ తీరుతెన్నులను సౌదీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభ లేదా ముగింపు మ్యాచ్‌ను సౌదీ అరేబియా వేదికగా నిర్వహించటం.. లేదంటే ఐపీఎల్లో ఓ రౌండ్ మ్యాచ్‌లకు సౌదీ అరేబియా ఆతిథ్యం వహించేలా హైబ్రిడ్ మోడల్‌ను తెరపైకి తీసుకొస్తున్నారు.
ఐసీసీ సుముఖత
గ్లోబల్ క్రికెట్ లీగ్‌లకు అంతర్జాతీయ క్రికెట్ కమిటీ (ఐసీసీ) అనుమతి తప్పనిసరి. ఐసీసీ ఆమోదం దక్కిన గ్లోబల్ టీ20లకు మాత్రమే ఐసీసీ సభ్య దేశాలు ఎనోసీలు (నిరభ్యంతర పత్రాలు) ఇస్తున్నారు. సౌదీ అరేబియా ఐసీసీ అసోసియేట్ సభ్య దేశంగా కొనసాగుతుంది. క్రికెట్ లీగ్‌లు ఆ ప్రాంతంలో ఆట అభివృద్దికి దోహదం చేస్తుందని భావిస్తే ఐసీసీ ఆ లీగ్‌కు అనుమతి ఇస్తుంది. ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ప్రధాన లీగ్ లేదు. ఆ లోటును సౌదీ అరేబియా భర్తీ చేయగలదనే నమ్మకం ఐసీసీకి ఉంది. ఇప్పటికే పలు క్రీడల్లో పెట్టుబడులు పెట్టిన సౌదీ అరేబియా.. క్రికెట్లోనూ ఆసక్తి చూపిస్తే అది ఆటకు మేలు చేకూర్చుతుందని ఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి.
ఇతర జట్లకు కష్టాలే!
ఐపీఎల్లో అందుతున్న భారీ కాంట్రాక్టులను వదులుకునే పరిస్థితి లేదు. వార్షిక వేతనాలు స్వల్పంగా లభిస్తున్న క్రికెట్ దేశాల నుంచి ఆటగాళ్లు త్వరగా రిటైర్మెంట్ తీసుకోవటం, లేదా వార్షిక కాంట్రాక్టు వదులుకోవటం వంటివి చేస్తున్నారు. న్యూజిలాండ్ క్రికెటర్లు ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీషమ్ అందుకు నిదర్శనం. సౌదీ అరేబియా టీ20 లీగ్‌లో ఐపీఎల్‌కు మించిన భారీ ప్యాకేజీ లభిస్తే..చాలా మంది క్రికెటర్లు జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించటంపై ఆసక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులకు మాత్రమే క్రికెటర్లను నిలుపుకునే ఆర్థిక శక్తి ఉంది. ఇతర క్రికెట్ బోర్డులు నాణ్యమైన, ప్రతిభావంతమైన క్రికెటర్లను గ్లోబల్ టీ20 లీగ్‌లకు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు.
క్యాలెండర్లో ఖాళీ ఎక్కడీ
సౌదీ అరేబియా క్రికెట్ టీ20 ప్రణాళికలు ఆకర్షిణీయంగా ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఐసీసీ క్యాలెండర్ ఏడాదిలో ఎక్కడా మరో టీ20 లీగ్ నిర్వహణకు సమయం లేదు. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా క్రికెటర్లు భాగమయ్యే షెడ్యూల్ రూపొందించటం కత్తి మీద సామే. ఐపీఎల్ కోసం రెండు నెలల సమయం ఇప్పటికే ఐసీసీ క్యాలెండర్లో అనధికారిక చోటు సాధించింది. సౌదీ అరేబియా టీ20 లీగ్ కోసం మరో 30-45 రోజుల షెడ్యూల్ సర్దుబాటు చేయటం అసాధ్యమే. అయితే, భారత క్రికెటర్లు సౌదీ లీగ్‌లో ఆడేందుకు బీసీసీఐ అనుమతి ఇస్తుందా? లేదా? అనే అంశంపై ఈ లీగ్ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది!.