Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 55 బంతుల్లో 100 బాదిన హ్యారీ బ్రూక్
- ఛేదనలో రానా, రింకూ పోరాటం వృథా
- కోల్‌కతపై సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు
నవతెలంగాణ-కోల్‌కత
హ్యారీ బ్రూక్ మెరువగా.. హైదరాబాద్ మురిసింది. హ్యారీ బ్రూక్ (100 నాటౌట్, 55 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఐపీఎల్లో నాల్గో ఇన్నింగ్స్‌లోనే మెరుపు వేగంతో సెంచరీ సాధించాడు. ఈడెన్‌గార్డెన్స్‌లో కోల్‌కత నైట్‌రైడర్స్ పేసర్లను దంచికొట్టిన హ్యారీ బ్రూక్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు సీజన్లో రెండో విజయాన్ని అందించాడు. కెప్టెన్ ఎడెన్ మార్క్రామ్ (50, 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), అభిషేక్ శర్మ (32), క్లాసెన్ (16 నాటౌట్) సైతం మెరవటంతో తొలుత సన్‌రైజర్స్ హైదరాబాద్ 228/4 పరుగుల భారీ స్కోరు సాధించింది. 229 పరుగుల ఛేదనలో కోల్‌కత నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 205 పరుగులే చేసింది. నితీశ్ రానా (75, 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), రింకూ సింగ్ (58 నాటౌట్, 31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) పోరాడినా ఫలితం లేకపోయింది. 23 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపొందింది.
హ్యారీ అదిరింది
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆది నుంచీ దూకుడు చూపించింది. హ్యారీ బ్రూక్ (100 నాటౌట్) పవర్‌ప్లేలో పేసర్లపై విరుచుకుపడ్డాడు. మయాంక్ అగర్వాల్ (9), రాహుల్ త్రిపాఠి (9) నిరాశపరిచినా.. బ్రూక్ ధనాధన్ జోరుతో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్ 65/2తో దండిగా పరుగులు పిండుకుంది. పేసర్లపై బ్రూక్ దండెత్తగా.. స్పిన్నర్లపై మార్క్రామ్ విరుచుకుపడ్డాడు. పేసర్లను ఊచకోత కోసిన బ్రూక్.. పవర్‌ప్లేలోనే స్పిన్నర్ల చేతికి బంతి అందేలా చేశాడు. స్పిన్నర్ల రాకతో 7-14 ఓవర్ల మధ్య బ్రూక్ ఒక్క బౌండరీ కొట్టలేదు. కానీ మార్క్రామ్ బౌండరీలు సాధించాడు. స్పిన్నర్లపై 22 బంతుల్లోనే 42 పరుగులు పిండుకున్నాడు. బ్రూక్ ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 32 బంతుల్లో అర్థ సెంచరీ బాదగా.. మార్క్రామ్ ఐదు సిక్సర్లు, రెండు ఫోర్లతో 25 బంతుల్లోనే 50 మార్క్ చేరుకున్నాడు. పేసర్ల చేతికి బంతి వరకు ఎదురుచూసిన బ్రూక్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగాడు. లాకీ ఫెర్గుసన్ ఓవర్లో ఏకంగా 23 పరుగులతో విధ్వంసక ఇన్నింగ్స్‌కు తెరతీశాడు. బ్రూక్ బాదుడుకు సన్‌రైజర్స్ చివరి ఆరు ఓవర్లలో వరుసగా 23, 15, 14, 14, 15, 13 పరుగులు పిండుకుంది. వ్యక్తిగత స్కోరు 45 వద్ద సుయాశ్ క్యాచ్ వదిలేయటంతో జీవనదానం పొందిన బ్రూక్.. కోల్‌కత భారీ మూల్యం చెల్లించే ఇన్నింగ్స్ నమోదు చేశాడు. డెత్ ఓవర్లలో బ్రూక్‌కు అభిషేక్ శర్మ (32), హెన్రిచ్ క్లాసెన్ (16 నాటౌట్) చక్కగా సహకరించారు. యాంకర్ పాత్ర పోషించకుండా.. బౌండరీలపై విరుచుకుపడ్డారు. కీలక బ్యాటర్లు మెరవటంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 228 పరుగుల భారీ స్కోరు సాధించింది.
స్కోరు వివరాలు :
సన్‌రైజర్స్ హైదరాబాద్ : 228/4 (హ్యారీ బ్రూక్ 100, ఎడెన్ మార్క్రామ్ 50, అభిషేక్ 32, రసెల్ 3/22)
కోల్‌కత నైట్‌రైడర్స్ : 205/7 (నితీశ్ రానా 75, రింకూ సింగ్ 58, మార్కండె 2/27, మార్కో జాన్సెన్ 2/37)