Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత ఆటగాళ్లకు అనుమతిపై బోర్డు స్పష్టత
న్యూఢిల్లీ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రపంచ క్రికెట్లో అత్యంత విజయవంతమైన కమర్షియల్ గ్లోబల్ టీ20 లీగ్. ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఈ లీగ్‌ను నిర్వహిస్తుంది. ఆసియా దేశాల్లో క్రికెట్‌కు ఉన్న ఆదరణను సొమ్ముచేసుకుని, ఆసియా దేశాల్లో.. ముఖ్యంగా భారతీయులకు పర్యాటక గమ్యస్థానంగా నిలిచేందుకు సౌదీ అరేబియా ఓ టీ20 లీగ్ రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా, సౌదీ అరేబియా టీ20 లీగ్‌లో భారత క్రికెటర్లకు అనుమతి ఇవ్వాలనే ప్రతిపాదనను సౌదీ ప్రభుత్వ వర్గాలు బీసీసీఐ ముందుంచాయి. భారత క్రికెటర్లు ఆడుతున్న ఏకైక లీగ్ ఐపీఎల్ మాత్రమే. సౌదీ అరేబియా లీగ్‌లో సైతం భారత క్రికెటర్లు భాగమైతే.. ఐపీఎల్ ప్రాముఖ్యత తగ్గుతుందని బీసీసీఐ భావన. దీంతో సౌదీ అరేబియా లీగ్ సహా ఏ లీగ్‌లోనూ భారత క్రికెటర్ల భాగస్వామ్యానికి అనుమతి ఇవ్వబోమని బీసీసీఐ ఉన్నతాధికారులు సౌదీ ప్రభుత్వ ప్రతినిధులతో స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఐపీఎల్ ప్రాంఛైజీలను ఆహ్వానించి వారితోనే జట్లను కొనుగోలు చేయించేందుకు సౌదీ అరేబియా రోడ్‌మ్యాప్ వేసింది. కనీసం ఓ జట్టుకు ఒక్క భారత ఆటగాడు ఆడేలా అనుమతి ఇవ్వాలని సైతం సౌదీ అరేబియా అధికారులు ప్రతిపాదించినా.. భారత క్రికెట్ పెద్దల నుంచి 'నో' సమాధానం వచ్చినట్టు సమాచారం.