Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జట్టు సమాచారం కోరిన వ్యక్తిపై పేసర్ ఫిర్యాదు
- చర్యలు తీసుకున్న ఏసీయూ, ఏపీ పోలీసులు
న్యూఢిల్లీ : భారత జట్టు అంతర్గత సమాచారం అందించాలంటూ ఓ వ్యక్తి నుంచి వాట్సాప్ సందేశం అందుకున్న భారత పేసర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్.. ఆ విషయాన్ని ఎటువంటి ఆలస్యం చేయకుండా బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేశాడు. 2022 ఐసీసీ టీ20 ప్రపంచకప్ అనంతరం భారత జట్టు నేరుగా న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లింది. అక్కడ కివీస్‌తో టీ20 సిరీస్ ఆడింది. ఈ సందర్భంగా నేపియర్ మ్యాచ్‌కు ముందు, భారత జట్టు అంతర్గత సమాచారం అందించి, బెట్టింగ్‌లో కోల్పోయిన డబ్బు తిరిగి సంపాదించేందుకు సహాయం చేయాలంటూ మహ్మద్ సిరాజ్‌కు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి వాట్సాప్ చేశాడు. ఆ వ్యక్తి వాట్సాప్ చాట్‌ను స్కీన్ షాట్లు తీసిన మహ్మద్ సిరాజ్ నేరుగా ఏసీయూకు పంపించాడు. ఏసీయూ అధికారులు సంబంధిత సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులతో పంచుకోగా.. సంబంధిత వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
'భారత జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉండగా ఈ ఘటన చోటుచేసుకుంది. టీ20 ప్రపంచకప్ అనంతరం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్ దీనిపై ఫిర్యాదు చేశాడు. ఇది జరిగి ఆరు నెలలు గడుస్తోంది. ఫిక్సింగ్ సంబంధిత అంశాలపై ఏసీయూ అధికారులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తారు. అనుమానాస్పదంగా ఉండటంతో సిరాజ్ ఆ విషయాన్ని ఏసీయూ తెలిపాడు. పర్యటనల సందర్భంగా ఇటువంటి విషయాలపై ముందే తెలియజేస్తాం. బెట్టింగ్‌లో డబ్బులు కోల్పోయిన వ్యక్తి సిరాజ్‌ను జట్టు సమాచారం కోసం సంద్రించినట్టు దర్యాప్తులో తేలింది. అతడికి బుకీలతో ఎటువంటి సంబంధాలు లేవని పోలీసులు నిర్ధారించారు' అని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం అధికారి ఒకరు తెలిపారు. ఐపీఎల్ 2023 సందర్భంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ జట్టు సమాచారం కోసం మహ్మద్ సిరాజ్‌ను ఓ వ్యక్తి సంప్రదించినట్టు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురించగా.. వాటిని ఏసీయూ అధికారి కొట్టిపారేశారు.