Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రెండన్ మెక్‌కలమ్‌పై ఈసీబీ స్పష్టత
లండన్ : ఓ ఆన్లైన్ బెట్టింగ్ కంపెనీకి ప్రచారకర్తగా ఒప్పందం కుదుర్చుకున్న ఇంగ్లాండ్ టెస్టు జట్టు చీప్ కోచ్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్‌పై ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఎటువంటి చర్యలు తీసుకోవటం లేదు. '22బెట్' ఆన్లైన్ బెట్టింగ్ కంపెనీ యూట్యూబ్ సహా ఇతర సోషల్ మీడియా ప్రకటనల్లో బ్రెండన్ మెక్‌కలమ్ ప్రచారకర్తగా కనిపించాడు. దీనిపై న్యూజిలాండ్‌కు చెందిన ఓ సంస్థ ఈసీబీకి ఫిర్యాదు చేసింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బంది నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని గత వారం ఈసీబీ వెల్లడించింది. బెట్టింగ్ కంపెనీతో మెక్‌కలమ్ ఒప్పందంపై ఈసీబీ ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఆన్లైన్ బెట్టింగ్ కంపెనీలతో ప్రచారకర్తగా ఒప్పందం చేసుకోకుండా.. ఎటువంటి నిబంధనలు లేవని ఈసీబీ అధికారులు నిర్దారించారు. ' బ్రెండన్ మెక్‌కలమ్ విషయంలో గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని ఈసీబీ కోణంలో మాత్రమే పరిగణించి విచారించాం.
ఈ అంశంలో బ్రెండన్ మెక్‌కలమ్‌పై బోర్డు నుంచి ఎటువంటి చర్యలు ఉండవని' ఈసీబీ అధికార ప్రతినిధి తెలిపారు. ఇదిలా ఉండగా, వివాదాస్పదంగా మారిన ఆన్లైన్ బెట్టింగ్ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేసుకునేందుకు మెక్‌కలమ్ సిద్ధమవుతున్నారు. ఈ విషయంలో మెక్‌కలమ్ త్వరలోనే ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది.