Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అజింక్య రహానె ఓ మంచి సంప్రదాయ శైలి బ్యాటర్. ఐపీఎల్లో అతడు క్రీజులోకి రాగానే అభిమానులూ బౌండరీలనే ఎక్కువ ఆశిస్తారు. ఫీల్డర్ల నడుమ బంతిని బౌండరీ లైన్ దాటించటంలో రహానె దిట్ట. కానీ టీ20 క్రికెట్లో ఫోర్ల కంటే సిక్సర్లకే ఎక్కువ ప్రాధాన్యత. బౌండరీలు బాదిన బ్యాటర్ కంటే సిక్సర్లు సంధించిన క్రికెటర్‌కే ఎక్కువ ఆకర్షణ. 2009 నుంచి ఐపీఎల్లో ఆడుతున్న రహానె.. అభిమానులు అతడిని మరిచిపోతున్న తరుణంలో 2.0 అవతారం ఎత్తాడు. చెన్నై సూపర్‌కింగ్స్ తరఫున సిక్సర్ల మోతతో అభిమానులను అలరిస్తున్నాడు. మిస్టర్ డిపెండబుల్ రహానె.. మిస్టర్ ఎటాకర్ ఎలా అయ్యాడు?!
''ఎల్లప్పుడూ నా మైండ్‌సెట్‌ను ఎక్కువగా విశ్వసిస్తాను. ఆలోచన ధోరణి సరిగా ఉన్నప్పుడు ఏదైనా చేయగలం. సీజన్‌కు ముందు మైండ్‌సెట్ క్లియర్‌గా ఉంచాను. సన్నద్థత ప్రక్రియను ఆస్వాదించాను. ప్రస్తుతం నాకు ఎటువంటి ఆలోచనలు లేవు. నా ఆటను గొప్పగా ఎంజారు చేస్తున్నాను. నాలోని అత్యుత్తమ ప్రదర్శన ఇంకా బయటి రాలేదు.'' - అజింక్య రహానె
- ఐపీఎల్లో16 అజింక్య విశ్వరూపం
- 2.0 అవతార్‌లో చెలరేగుతున్న రహానె
నవతెలంగాణ క్రీడావిభాగం
అప్పుడూ.. ఇప్పుడూ ధోనీ!
క్రీజులో ఓ బ్యాటర్ చెలరేగుతుంటే మరో బ్యాటర్ అతడికి సహకారం అందిస్తుంటారు. అలా ఓ ఎండ్‌లో నిలబడి యాంకర్ ఇన్నింగ్స్ ఆడే బ్యాటర్లకే యాంకర్ ఇన్నింగ్స్‌లు ఆడగల సమర్థుడు అజింక్య రహానె. ఇది అజింక్య రహానెపై వ్యంగ్యాస్త్రమైనా.. అందులో కొంత నిజం లేకపోలేదు. వైట్‌బాల్ క్రికెట్లో రహానె పరిమితులపై అప్పటి భారత కెప్టెన్ ఎం.ఎస్ ధోని మాట్లాడాడు. ఫీల్డింగ్ పరిమితులు ముగిసిన అనంతరం, సర్కిల్ బయట ఐదుగురు ఫీల్డర్లు మొహరిస్తే రహానె బౌండరీలు సాధించలేడు. మిడిల్ ఆర్డర్లో అతడిని ప్రయోగించేందుకు ఈ కారణం అడ్డు వస్తుందని ధోని సెలవిచ్చాడు. ఆధునిక వన్డేలకు అనుగుణంగా పరుగుల వేటలో వేగం సాధించని రహానె క్రమంగా 50 ఓవర్ల ఫార్మాట్‌కు దూరమయ్యాడు. టీ20 ధనాధన్ ఫార్మాట్లో రహానెకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. గత సీజన్లో కోల్‌కత నైట్‌రైడర్స్ తరఫున నిరాశపరిచాడు.
అటు భారత టెస్టు జట్టులో చోటు కోల్పోయి, ఇటు ఐపీఎల్లో అవకాశాలు దక్కక అజింక్య రహానె కెరీర్ చరమాంకానికి వచ్చిందనే అభిప్రాయం ఏర్పడింది. ఈ దశలో అజింక్య రహానె ఎవరూ ఊహించని రీతిలో పుంజుకు న్నాడు. రహానె విధ్వంసక రూపంలోనూ ధోని పాత్ర ఉంది. చెన్నై సూపర్‌కింగ్స్ ప్రీ సీజన్ క్యాంప్‌లో రహానెతో కలిసి ధోనీ సుదీర్ఘంగా సాధన చేశాడు. పరుగుల వేటలో రహానెపై ఒత్తిడి పెంచకుండా, అతడు స్వేచ్ఛగా ఆడేందుకు అవకాశం కల్పించాడు. డ్రెస్సింగ్‌రూమ్‌లో తనపై ఎటువంటి ఒత్తిడి లేకపోవటంతో క్రీజులోకి వచ్చిన రహానె బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు.
దంచుడే దంచుడు
ఐపీఎల్2023లో ఐదు మ్యాచులు ఆడిన అజింక్య రహానె.. ఈ సీజన్లో టాప్-20 బ్యాటర్లతో పోల్చితే అత్యధిక స్ట్రయిక్‌రేట్ నమోదు చేశాడు. రెండు అర్థ సెంచరీలు సహా 18 ఫోర్లు, 11 సిక్సర్లతో రహానె 209 పరుగులు పిండుకున్నాడు. తాజాగా కోల్‌కత నైట్‌రైడర్స్‌పై 29 బంతుల్లోనే 71 పరుగులు బాదాడు. గత ఐపీఎల్ సీజన్లతో పోల్చితే ఈసారి రహానె తనకంటే మూడు రెట్లు శక్తివంతమైన ప్రదర్శన చేస్తున్నాడు. ఐపీఎల్ 2019లో రహానె ప్రతి 31.67 బంతులకు ఓ సిక్సర్ సాధించాడు. అతడే అతడి అత్యుత్తమం. కానీ ఈ సీజన్లో ప్రతి 9.54 బంతులకు బంతిని స్టాండ్స్‌లోకి పంపిస్తున్నాడు. ఇక ఓవరాల్‌గా బౌండరీలు బాదటంలో రహానె ముందంజలో నిలిచాడు. ఈ సీజన్లో 105 బంతులు ఎదుర్కొన్న రహానె ప్రతి 3.6 బంతులకు ఓ బౌండరీ చొప్పున 29 బౌండరీలు సాధించాడు. గ్లెన్ మాక్స్వెల్ (3.7), వెంకటేశ్ అయ్యర్ (4.1), రోహిత్ శర్మ (4.2) రహానె తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. పేస్ బౌలింగ్‌పై ఆడటం రహానెకు వెన్నతో పెట్టిన విద్య. కానీ ఈ సీజన్లో అది ఆకాశమే హద్దుగా మారింది. పేస్పై 18 బంతులు ఆడిన రహానె 254.16 స్ట్రయిక్‌రేట్‌తో పరుగులు సాధించాడు. అగ్రశ్రేణి పేసర్ మార్క్‌వుడ్‌పై దండయాత్ర చేసిన ఎం.ఎస్ ధోనికి సైతం ఈ స్థాయి గణాంకాలు లేవు.
ధనాధన్ రూపం ఎలా?
ఐపీఎల్లో అజింక్య రహానె మునుపెన్నడూ చూడని కోణాన్ని ఆవిష్కరించాడు. 2009 సీజనో స్ట్రయిక్‌రేట్ 117.07 కాగా.. 2019లో 137.89 స్ట్రయిక్‌రేట్ అతడి అత్యుత్తమం. ప్రస్తుత సీజన్లో రహానె స్ట్రయిక్‌రేట్ 199.04. టాప్-20 బ్యాటర్లలో మరో ఆటగాడికి ఈ స్థాయి స్ట్రయిక్‌రేట్ లేదు. వాంఖడెలో ముంబయి ఇండియన్స్‌పై 27 బంతుల్లో 61 పరుగులు చేసిన రహానె.. ఆ ప్రదర్శనతో సంతృప్తి పడలేదు. మరింత దూకుడుగా ఆడేందుకు సిద్ధమయ్యాడు. సంప్రదాయ బ్యాటర్ నుంచి ధనాధన్ హిట్టర్‌గా మారేందుకు రహానె పెద్దగా మార్పులేమీ చేసుకోలేదు. తన బ్యాటింగ్ శైలిని మార్చుకోలేదు. అవే షాట్లకు కాస్త టైమింగ్, పవర్‌ను జత చేశాడు. కవర్ డ్రైవ్, పుల్, హుక్, ఫ్లిక్ షాట్లను టైమింగ్‌తో ఆడుతున్నాడు. ముంబయిపై సంప్రదాయ షాట్లతోనే విరుచుకుపడిన రహానె.. కోల్‌కతపై విలక్షణ షాట్లను సైతం ఆడాడు. సీజన్‌కు ముందు సూపర్‌కింగ్స్ సన్నాహాక శిబిరంలో రహానె బ్యాటింగ్‌పై కఠోర సాధన చేశాడు. సిక్సర్లు బాదటంపై ప్రత్యేకంగా సాధన చేశాడు. ఐపీఎల్లో 153 ఇన్నింగ్స్‌ల్లో 17-20 ఓవర్ల నడుమ రహానె 32 సార్లు బ్యాటింగ్ చేశాడు. సహజంగా పవర్‌ప్లే ముగియగానే రహానె కథ ముగుస్తుంది!. కానీ ఈ సీజన్లో ఈ సమయంలోనే రహానె అరాచకం సృష్టించాడు. 9 బంతుల్లో ఏకంగా ఆరు సిక్సర్లు బాది 33 పరుగులు పిండుకున్నాడు. అభిమానులు, క్రికెట్ పండితులు ఆశ్చర్యపడే ఇన్నింగ్స్‌లు ఆడుతున్న అజింక్య రహానె.. 'ఇంకా నా అత్యుత్తమ ప్రదర్శన చేయలే' అనటం కొసమెరుపు.