Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నైపై రాజస్థాన్ గెలుపు
- రాజస్థాన్ రాయల్స్‌కు అగ్రస్థానం
నవతెలంగాణ-జైపూర్
రాజస్థాన్ రాయల్స్ టాప్ లేపింది. చెన్నై సూపర్‌కింగ్స్‌పై సీజన్లో వరుసగా రెండో విజయం సాధించింది. వరుసగా రెండు ఓటముల అనంతరం చెన్నై సూపర్‌కింగ్స్‌పై 32 పరుగుల తేడాతో మెరుపు విజయం నమోదు చేసిన రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. 203 పరుగుల భారీ ఛేదనలో చెన్నై సూపర్‌కింగ్స్ ఏ దశలోనూ రేసులో నిలువలేదు. డెవాన్ కాన్వే (8), అజింక్య రహానె (15), అంబటి రాయుడు (0) నిరాశపరిచారు. రుతురాజ్ గైక్వాడ్ (47, 29 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్), శివం దూబె (52, 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) పోరాటం సరిపోలేదు. మోయిన్ అలీ (23, 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), రవీంద్ర జడేజా (23, 15 బంతుల్లో 3 ఫోర్లు) ఓటమి అంతరాన్ని కుదించారు. 20 ఓవర్లలో 6 వికెట్లకు చెన్నై సూపర్‌కింగ్స్ 170 పరుగులే చేసింది. రాయల్స్ స్పిన్నర్లు ఆడం జంపా (3/22), అశ్విన్ (2/35) మాయజాలం చేశారు.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 202 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (77, 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఐపీఎల్ కెరీర్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ నమోదు చేశాడు. 26 బంతుల్లోనే అర్థ సెంచరీ బాదిన జైస్వాల్ రాయల్స్ భారీ స్కోరుకు గట్టి పునాది వేశాడు. ధ్రువ్ జురెల్ (34), దేవదత్ పడిక్కల్ (27 నాటౌట్) చివర్లో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడటంతో రాయల్స్ 200 ప్లస్ స్కోరు సాధించింది. జోశ్ బట్లర్ (27) మెరిసినా.. సంజు శాంసన్ (17), షిమ్రోన్ హెట్మయర్ (8) నిరాశపరిచారు. చెన్నై స్పిన్నర్లు తీక్షణ (1/24), జడేజా (1/32) రాణించారు.