Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోల్‌కతపై గుజరాత్ గెలుపు
నవతెలంగాణ-కోల్‌కత : డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ టాప్ లేపింది. సీజన్లో ఆరో విజయం నమోదు చేసిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానం కైవసం చేసుకుంది. ఈడెన్‌గార్డెన్స్‌లో శనివారం కోల్‌కత నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల ఛేదనలో విజరు శంకర్ (51 నాటౌట్, 24 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు), డెవిడ్ మిల్లర్ (32 నాటౌట్, 18 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధనాధన్ దంచుడుకు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (49, 35 బంతుల్లో 8 ఫోర్లు) రాణించారు. ఛేదనలో బ్యాటర్లు కదం తొక్కటంతో మరో 13 బంతులు మిగిలి ఉండగానే 17.5 ఓవర్లలోనే గుజరాత్ టైటాన్స్ లాంఛనం ముగించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో జోశ్ లిటిల్ (2/25), మహ్మద్ షమి (3/33), నూర్ అహ్మద్ (2/25) రాణించగా.. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (0/54) చెత్త గణాంకాలు మూటగట్టుకున్నాడు.
ఓపెనర్ నూర్ అహ్మద్ (81, 39 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌తో కదం తొక్కినా.. కోల్‌కత బ్యాటర్లు అతడికి సహకరించలేదు. జగదీశన్ (19), శార్దుల్ (0), వెంకటేశ్ అయ్యర్ (11), నితీశ్ రానా (4) తేలిపోయారు. చివర్లో రింకూ సింగ్ (19) ఆశించిన వేగంతో ఆడలేకపోయాడు. రసెల్ (34) రాణించటంతో కోల్‌కత ఆ మాత్రం స్కోరు చేయగల్గింది. ఇక ఛేదనలో ఓపెనర్ వృద్దిమాన్ సాహా (10)ను కోల్పోయిన టైటాన్స్.. గిల్ (49), పాండ్య (26) భాగస్వామ్యంతో నిలదొక్కుకుంది. పవర్‌ప్లే అనంతరం కోల్‌కత కాస్త పట్టు సాధించినా.. విజరు శంకర్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 24 బంతుల్లోనే అర్థ సెంచరీ సాధించిన శంకర్.. టైటాన్స్‌కు సీజన్లో ఆరో విజయాన్ని అందించాడు.