Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భారత అగ్రశ్రేణి రెజ్లర్ల ఆందోళన ఎనిమిదో రోజుకు చేరుకుంది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంట్ సభ్యుడు, భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని జంతర్‌మంతర్ వద్ద దీక్షలో రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా డిమాండ్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌ను ప్రశ్నించటం మానేసి.. బిజెపి నాయకులు బాధిత రెజ్లర్లపైనే నిందలు వేసే పనిలో నిమగమయ్యారు.
- రెజ్లర్లు వినేశ్, సాక్షి, బజరంగ్ డిమాండ్
- జంతర్‌మంతర్ వద్ద ఎనిమిదో రోజు రెజ్లర్ల దీక్ష
నవతెలంగాణ-న్యూఢిల్లీ
విద్యుత్ సరఫరా నిలిపివేశారు, నీటి సరఫరా తీసివేశారు. సాధన చేసేందుకు అవసరమైన మ్యాట్లను తీసుకురాకుండా అడ్డుకున్నారు. బ్యారికేడ్లను అడ్డంగా నిలిపి ఉంచి.. మల్లయోధులను అసౌకర్యారానికి గురి చేశారు. అయినా.. మల్లయోధులు ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఓ మైనర్ సహా ఏడుగురు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధింపులకు గురిచేసిన భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపీ, భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను తక్షణమే అరెస్టు చేయాలని ఉద్యమం ఉదృతం చేశారు. న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజ్లింగ్ క్రీడాకారుల ఆందోళన ఆదివారం నాటికి ఎనిమిదో రోజుకు చేరింది. సుప్రీంకోర్టు ఆదేశంతో బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినా.. ఈ కేసులో ఢిల్లీ పోలీసుల నుంచి ఎటువంటి పురోగతి లేదు. దీంతో బిజెపి ఎంపీని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
బిజెపి నేతలూ మద్దతు ఇవ్వచ్చు!
భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకులు, అధికార పార్టీ అనుకూల మీడియా రెజ్లర్ల ఆవేదన పట్టించుకోకుండా.. రెజ్లర్లకు ఎవరు మద్దతు పలికినా ఓవరాల్‌గా ఉద్యమానికే రాజకీయ రంగు పులిమే పనిలో బిజీగా ఉన్నారు. జనవరిలో రెజ్లర్లు జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేశారు. కానీ ఏ రాజకీయ నేపథ్యం ఉన్నవారికి నిరసనలో భాగం కానివ్వలేదు. దిగ్గజ బాక్సర్ విజేందర్ సింగ్ మద్దతు ఇచ్చేందుకు వచ్చినా.. సున్నితంగా తిరస్కరించారు. తాజాగా, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర క్రీడాశాఖ సహా ఢిల్లీ పోలీసులు రెజ్లర్లను లైంగికంగా వేధించిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తుండటంతో మల్లయోధులు నిరసన దీక్షను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ సారి రైతుల నుంచి మహిళల వరకు ఎవరు మద్దతిచ్చినా సాదరంగా స్వాగతిస్తున్నారు. రాజకీయ నేతల మద్దతుతో రెజ్లర్ల ఉద్యమం రాజకీయ లక్ష్యాలతో కూడుకున్నది కాబోదని.. మా లక్ష్యం బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయటమేనని రెజ్లర్లు స్పష్టం చేశారు. 'మూడు నెలల క్రితం ఇదే జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేశాం. రాజకీయ నేతలను దీక్ష వద్దకు అనుమతించలేదు. కేవలం రెజ్లింగ్ సమాఖ్య సమస్యగానే పరిగణించి పోరాడాం. కానీ ప్రభుత్వం ఎటువంటి పరిష్కారం చూపలేదు. మూడు నెలలు ముగిసినా.. ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అందుకే మళ్లీ జంతర్‌మంతర్ వద్దకు రావాల్సి వచ్చింది. బాధిత రెజ్లర్లకు అండగా నిలిచేందుకు, మద్దతు ఇచ్చేందుకు రాజకీయ పార్టీల నాయకులు వస్తున్నారు. మాకు ఎటువంటి రాజకీయ ఉద్దేశాలు లేవు. బిజెపి నాయకులు కూడా వచ్చి మాకు మద్దతు తెలపవచ్చు. వాళ్లను కూడా మేము సాదరంగా స్వాగితిస్తాం. న్యాయ పోరాటం మద్దతు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతామని' వినేశ్ ఫోగట్ పేర్కొంది.
రాజకీయ నేతలే నడుపుతున్నారు
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించకుండా ఇన్నాండ్లు మౌనంగా ఉండిపోయిన బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్.. మల్లయోధులకు మద్దతుగా రాజకీయ నాయకులు రావటంతో రెజ్లర్ల ఉద్యమాన్ని నడిపిస్తున్నదే రాజకీయ నాయకులేనని బ్రిజ్‌భూషణ్ విమర్శలు గుప్పించారు. రెజ్లర్ల ఆందోళనను పక్కదోవ పట్టించేందుకు మీడియా ముందుకొచ్చి రాజకీయ నాయకుల మద్దతుపై ప్రశ్నించారు. 'ఈ పోరాటం ఇప్పుడు అథ్లెట్ల చేతుల్లో లేదు. రాజకీయ నాయకులు నడిపిస్తున్నారు. రెజ్లర్లు ఆందోళనకు దిగిన తొలి రోజు నుంచే నేను దీని వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని అనుమానించాను. అథ్లెట్ల ఆందోళనను కాంగ్రెస్ ఇతర రాజకీయ పార్టీలు వాడుకుంటున్నాయి. ఆందోళన చేస్తున్న రెజ్లర్లది రాజకీయ లక్ష్యమే కానీ నా రాజీనామా కాదు' అని బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ అన్నారు. రెజ్లింగ్ క్రీడాకారులు న్యాయం కోసం పోలీసులు, న్యాయస్థానాలను ఆశ్రయించాలి కానీ ఇలా జంతర్‌మంతర్‌లో కూర్చోవటం కాదు. ఈ విషయంలో న్యాయస్థానం ఏం తీర్పు ఇచ్చినా శిరసావహించేందుకు సిద్ధంగా ఉన్నానని బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ వ్యాఖ్యానించారు.
ఇక ఆదివారం జంతర్‌మంతర్ ఆందోళన చేస్తున్న రెజ్లింగ్ క్రీడాకారులకు రాజకీయ, ప్రజాసంఘాల నాయకుల మద్దతు వెల్లువెత్తింది. భీమ్ ఆర్మీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్, రాబర్ట్ వాద్రా సహా తదితరులు సంఘీభావం తెలిపారు. లైంగిక వేధింపుల అంశంలో ప్రధాన మంత్రి, కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ బాధిత రెజ్లర్ల పక్షాన కాకుండా, అధికార బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్ పక్షాన ఉన్నారని సంఘీభావం తెలుపుతూ నేతలు ఆరోపించారు.