Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇటు క్రికెటర్లు, అటు అభిమానుల బాహాబాహి
- జెంటిల్మెన్ గేమ్‌లో పెట్రేగుతున్న పోకిరితనం
హులిగనిజం (పోకిరితనం) మన క్రీడలకు పెద్దకు పరిచయం లేని పేరు. యూరోపియన్ ఫుట్‌బాల్ లీగ్‌ల్లో రెండు దేశాల అభిమానులు, లేదా రెండు క్లబ్‌ల అభిమానులు మైదానాల్లో కొట్టుకోవటం చూసి..ఇదేమీ తీరని ముక్కున వేలేసుకున్నాం. ఇప్పుడు ఆ విష సంస్కృతి భారత్‌లో, ఐపీఎల్ ద్వారా క్రికెట్లోకి అడుగుపెట్టింది. తాజా ఐపీఎల్ సీజన్లో ఓ వైపు క్రికెటర్లు హద్దులుమీరి ప్రవర్తిస్తుండగా.. మరోవైపు అభిమానులు ఏకంగా పరస్పర భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. కాసుల వేటలో బీసీసీఐ మొదలెట్టిన ఐపీఎల్.. ఇప్పుడు క్రీడాభిమానుల మధ్య చిచ్చు రగిల్చింది!.
అభిమానుల కోట్లాట
జెంటిల్మెన్ ఆటకు నిదర్శనం క్రికెట్. మైదానం లోపల, వెలుపల క్రీడాస్ఫూర్తికి క్రికెట్ నిలువుటద్దం. క్రికెట్ ఆడే దేశాల నడుమ ద్వైపాక్షిక సంబంధాల కారణాల రీత్యా కొన్ని దేశాలు ఆడుతున్నప్పుడు కృత్తిమంగానే కనిపించే హూలిగనిజం.. ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రూపంలో నేరుగా క్రికెట్ ఆటలోకే ప్రవేశించింది. ఇరు ప్రాంఛైజీల అభిమానులు మైదానంలో బాహాబాహికి దిగటమే హూలిగ నిజం. ప్రాంఛైజీలు, జట్లపై దురభిమానంతో మైదానంలోనే పరస్పర దాడులు చేసుకోవటం యూరోపియన్ సాకర్ లీగ్‌లో సర్వ సాధారణం. అక్కడి దురభిమానులు గొడవ చేయాలనే ప్రణాళికతోనే మైదానాల్లోకి అడుగుపెడతారనే విమర్శలు సైతం ఉన్నాయి. అయితే, ఇవేవీ ఇప్పటివరకు భారత్‌లోగానీ, క్రికెట్లో గానీ చోటుచేసుకోలేదు. కానీ ఇప్పుడు ఐపీఎల్ రాకతో హూలిగనిజం సైతం భారత క్రీడా రంగంలోకి అడుగుపెట్టింది. వాణిజ్య విలువలతో కూడిన ప్రాంఛైజీ స్పోర్ట్స్ కోరుకునేది ఇటువంటి ఘర్షణే. ఆట పక్కదారి పట్టి.. ప్రాంఛైజీల ఆధిపత్య పోరు తెరపైకి రావటంతో మార్కెట్లో బ్రాండింగ్ ప్రమోషన్‌కు ఉపకరిస్తుంది!.
ఐపీఎల్లో అభిమానులు బాహా బాహికి దిగిన రెండు సంఘటనల్లో ఒకటి హైదరాబాద్‌లో చోటుచేసుకోవటం గమనార్హం. ముంబయి ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో ఇరు జట్ల దురభిమానులు ఘర్షణకు దిగారు. కార్పోరేట్ బాక్సుల్లో ఉన్నవారు మద్యం సేవించి దాడులకు సిద్ధపడ్డారు. ఇక తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లో సైతం ఇదే సన్నివేశం పునరావృతం అయ్యింది. అక్కడా, మద్యం మత్తులో ఇరు జట్ల దురభిమానులు కొట్లాటకు దిగారు. దురభిమానుల గొడవ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
క్రికెటర్లు సైతం అదే బాట
ఓ వైపు అభిమానుల నడుమ పరస్పర దాడులు జరుతుండగానే.. మరోవైపు ఇరు జట్ల క్రికెటర్లు సైతం మైదానంలోనే బాహాబాహికి దిగుతున్నారు. లక్నో సూపర్‌జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్‌లో లక్నో మెంటార్ గౌతం గంభీర్, బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లి కొట్టుకునే వరకు వెళ్లారు. గతంలో బెంగళూర్ సొంతగడ్డ చిన్న స్వామిలో విజయం అనంతరం గంభీర్ అభిమానులను ఉద్దేశించి సంజ్ఞలు చేశాడు. లక్నోలో మ్యాచ్ సందర్భంగా వైరం కాదు ప్రేమ పంచాలంటూ విరాట్ కోహ్లి సంజ్ఞలు చేశాడు. ఇక్కడితో మొదలైన గంభీర్, కోహ్లి వైరం.. మ్యాచ్ ముగిసినా ఆగలేదు. మ్యాచ్ మధ్యలో లక్నో ఆటగాడు నవీన్ ఉల్ హాక్, కోహ్లి మధ్య స్లెడ్జింగ్ చోటుచేసుకుంది. మ్యాచ్ అనంతరం కోహ్లితో లక్నో క్రికెటర్ కైల్ మేయర్స్ క్రీడా స్ఫూర్తితో మాట్లాడుతూ ఉండగా.. గౌతం గంభీర్ వచ్చి అతడిని కోహ్లికి దూరంగా తీసుకెళ్లాడు. దీని పట్ల కోహ్లి ఇదేంటని ప్రశ్నించగా.. గౌతం గంభీర్ దుందుడుకుగా వ్యవహరించాడు. కెఎల్ రాహుల్ వచ్చి జోక్యం చేసుకున్నప్పటికీ గంభీర్ ఆవేశంగానే కనిపించాడు. నవీన్ ఉల్ హాక్ సైతం మ్యాచ్ అనంతరం కోహ్లితో మాట్లాడేం దుకు కెప్టెన్ రాహుల్ కోరినా నిరాకరించాడు. విరాట్ కోహ్లి, గౌతం గంభీర్ గొడవ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
బీసీసీఐ ఏం చేస్తోంది!?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అనునిత్యం ఆదాయ మార్గాలపైనే మనసు పెడుతుంది. యావత్ దేశ ప్రజలు అభిమానించే ఆటకు జాతీయ స్పోర్ట్స్ ఫెడరేషన్‌గా కొనసాగుతున్న బీసీసీఐ ఇప్పటివరకు ఏ సమస్యపైనా, సామాజిక అంశంపైనా స్పందించిన చరిత్ర లేదు. క్రికెట్లో జాతి వివక్షకు వ్యతిరేకంగా ప్రపంచ క్రికెటర్లు, ఐసీసీ సైతం ముందుకొచ్చినా బీసీసీఐలో చలనం కనిపించలేదు. తాజాగా ఐపీఎల్లో హూలిగనిజంపైనా బీసీసీఐ చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. హూలిగనిజం ఓ విషసర్పం. ప్రత్యర్థి జట్టు, ప్రత్యర్థి జట్టు అభిమానుల పట్ల ద్వేష భావం, వైరం పెంచేందుకు ఇది దోహదం చేస్తుంది. అటువంటి తీవ్రమైన సమస్యను ఆరంభంలోనే తొక్కిపెట్టాల్సిన అవసరం ఉంది. ఐపీఎల్లో ప్రాంఛైజీల సొంత బ్రాండింగ్‌కు హూలిగనిజం నిదర్శనంగా కనిపిస్తుండగా.. బీసీసీఐ ఈ విషయంలో జోక్యం చేసుకుంటుందా? లేదా? అనేది ఆసక్తికరం.
ఐపీఎల్లో చోటుచేసుకుంటున్న ఆన్ ఫీల్డ్ దురుసు ప్రవర్తనలపై బీసీసీఐ-ఐపీఎల్ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఐపీఎల్ మ్యాచుల్లో గొడవల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారటం బాధాకరం. ఆటకు ఇది ఏమాత్రం మంచి సంప్రదాయం కాదు. ఆటను దెబ్బతీసే పరిస్థితులపై బోర్డు కఠినంగా ఉండాలి'
- రత్నాకర్ శెట్టి, మాజీ జనరల్ మేనేజర్, బీసీసీఐ
'విరాట్ కోహ్లి, గౌతం గంభీర్ మధ్య చోటుచేసుకున్న గొడవ ఆటకు మంచిది కాదు. విరాట్ కోహ్లి క్రికెట్లో ఓ దిగ్గజం. ఇటువంటి గొడవల్లో నిలవాల్సింది కాదు. 2008 ఐపీఎల్లో శ్రీశాంత్‌పై చేయి చేసుకున్నందుకు ఇప్పటికి సిగ్గుపడుతున్నాను'
- హర్భజన్ సింగ్, మాజీ క్రికెటర్
భారీ జరిమానా
లక్నో, బెంగళూర్ మ్యాచ్‌లో ఘర్షణకు దిగిన ఆటగాళ్లపై మ్యాచ్ రిఫరీ భారీ జరిమానా విధించాడు. విరాట్ కోహ్లి, గౌతం గంభీర్‌కు మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించగా.. నవీన్ ఉల్ హాక్కు మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టారు. దీంతో కోహ్లి రూ.1.07 కోట్లు, గంభీర్ రూ.25 లక్షలు, నవీన్ ఉల్ హాక్ రూ.1.79 లక్షలు జరిమానా రూపంలో కోల్పోయారు. ఐపీఎల్ క్రమశిక్షణ నియామవళి ఆర్టికల్ 2.21 ప్రకారం లెవల్ 2 తప్పిదానికి పాల్పడినట్టు కోహ్లి, గంభీర్, నవీన్ ఉల్ హాక్‌లు మ్యాచ్ రిఫరీ ముందు అంగీకరించారు.