Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చర్చనీయాంశంగా కోహ్లి, గంభీర్ 100 శాతం జరిమానా
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16 సీజన్లో ఆట కంటే ఆటేతర అంశాలు ప్రధాన శీర్షికలుగా నిలుస్తున్నాయి. అటువంటి ఘటనల్లో ముందు వరుసలో ఉండేది విరాట్ కోహ్లి, గౌతం గంభీర్ వివాదం. బెంగళూర్ చిన్నస్వామి స్టేడియంలో మొదలైన విరాట్ కోహ్లి, గౌతం గంభీర్ వైరం.. లక్నోలో మ్యాచ్ వరకు కొనసాగింది. లక్నోలో లక్నో సూపర్‌జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ మ్యాచ్‌కు ముందు సోషల్ మీడియాలో సైతం విరాట్-గంభీర్ ఫైట్‌పై ఆసక్తి కనిపించింది. వ్యాఖ్యాతలు, మాజీ క్రికెటర్లు సైతం లక్నో, బెంగళూర్ మ్యాచ్‌ను కోహ్లి, గంభీర్ పోరుగానే చూశారు. విరాట్ కోహ్లి-గౌతం గంభీర్ గొడవ అంచనాలను మించిపోయింది. ఓ వైపు ఐపీఎల్ మ్యాచుల సందర్భంగా అభిమానులు ఘర్షణకు దిగుతుండగా.. మరోవైపు మైదానంలోనే ఆటగాళ్లు బాహాబాహికి దిగటం ఆటకు బోలెడంత చెడ్డ పేరు.. ప్రాంఛైజీలకు మంచి కమర్షియల్ విలువలు తెచ్చిపెట్టాయి.
విరాట్ కోహ్లి, గౌతం గంభీర్ గొడవను తీవ్రంగా పరిగణించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) క్రమశిక్షణ నియామవళి కొరడా ఝులిపించింది. విరాట్ కోహ్లిపై 100 శాతం మ్యాచ్ ఫీజు జరిమానా, లక్నో మెంటార్ గౌతం గంభీర్ మ్యాచ్ ఫీజులో వంద శాతం కోత విధించారు. ఇక లక్నో ఛేదన సందర్భంగా కోహ్లిని కవ్వించిన ఆ జట్టు ఆటగాడు నవీన్ ఉల్ హాక్ మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పెట్టారు. ఐపీఎల్ క్రమశిక్షణ నియామవళి ఆర్టికల్ 2.21 ప్రకారం గౌతం గంభీర్, విరాట్ కోహ్లి లెవల్ 2 తప్పిదానికి పాల్పడ్డారు. దీని ప్రకారం విరాట్ కోహ్లికి రూ.1.07 కోట్లు, గౌతం గంభీర్‌కు రూ.25 లక్షలు, నవీన్ ఉల్ హాక్కు రూ.1.7 లక్షల జరిమానా పడింది. ఆటగాళ్లకు విధించిన జరిమానాలను ఎవరు కడతారనే చర్చ ప్రస్తుతం ఎక్కువగా నడుస్తోంది. ఈ జరిమానాలను ఆటగాళ్లు తమ వేతనాల నుంచి చెల్లిస్తారా? లేదంటే ప్రాంఛైజీల తమ ఖాతా నుంచి చెల్లిస్తాయా?!
ఐపీఎల్లో విరాట్ కోహ్లి వేతనం రూ.15 కోట్లు. మ్యాచ్ ఫీజును సీజన్లో ఆడిన మ్యాచ్‌ల ఆధారంగా నిర్ణయిస్తారు. సీజన్ ముగిసిన అనంతరం జరిమానా మొత్తంపై స్పష్టత వస్తుంది. ఎలాగైనా విరాట్ కోహ్లి కాస్త అటు ఇటుగా రూ. కోటి జరిమానా చెల్లించాల్సిందే. రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ ప్రాంఛైజీ ఈ జరిమానాను విరాట్ కోహ్లి తరఫున చెల్లించనుంది. లక్నో సూపర్‌జెయింట్స్ మెంటార్ గౌతం గంభీర్ మ్యాచ్ ఫీజును రూ.25 లక్షలుగా ఆ ప్రాంఛైజీ వర్గాలు అనధికారంగా తెలిపాయి. లక్నో, బెంగళూర్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటే మ్యాచ్ ఫీజు విలువ కాస్త తగ్గనుంది. లక్నో సూపర్‌జెయింట్స్ యాజమాన్యం సైతం గౌతం గంభీర్ తరఫున ఆ జరిమానా సొమ్ము కట్టనుంది.
సాధారణంగా ఐపీఎల్ సీజన్ ముగిసిన అనంతరం ప్రాంఛైజీలకు ఈ జరిమానాల మొత్తాన్ని బోర్డు పంపిస్తుంది. క్రమశిక్షణ ఉల్లంఘనలు, స్లో ఓవర్‌రేట్ జరిమానాలను కొన్ని ప్రాంఛైజీలు సొంతంగా చెల్లిస్తుండగా.. మరికొన్ని ప్రాంఛైజీలు ఆ మొత్తాన్ని ఆటగాళ్ల వేతనాల నుంచి చెల్లిస్తున్నాయి. మైదానంలో ఆటగాళ్ల ప్రవర్తన మెరుగయ్యేందుకు జరిమానాలను వారి వేతనాల నుంచి చెల్లించాలనే వాదన క్రికెట్ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.