Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లక్నో, చెన్నై మ్యాచ్ వర్షార్పణం
- ఆయుశ్ బదాని మెరుపు ఇన్నింగ్స్
- ఇరు జట్లకు చెరో పాయింట్
ఐపీఎల్లో భారీ స్కోర్లు, స్వల్ప స్కోర్ల థ్రిల్లర్ల నడుమ వరుణుడు ఓ మ్యాచ్‌ను ఖాతాలో వేసుకున్నాడు. సూపర్‌జెయింట్స్, సూపర్‌కింగ్స్ నడుమ లీగ్ పోరుకు వర్షం ఆటంకం కలిగింది. వర్షంతో ఆట ఆలస్యంగా ఆరంభం కాగా.. మ్యాచ్‌లో ఒక్క ఇన్నింగ్స్ కూడా పూర్తి కాలేదు. ఎడతెరపి లేకుండా వరుణుడు మైదానాన్ని ముంచెత్తాడు. లక్నో, చెన్నై మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది.
నవతెలంగాణ-లక్నో : గౌతం గంభీర్, విరాట్ కోహ్లి వాగ్వాదం అనంతరం.. ఎం.ఎస్ ధోని జట్టుతో లక్నో సూపర్‌జెయింట్స్ తలపడనుండటంతో అందరి ఆసక్తి ఈ మ్యాచ్‌పైనే కనిపించింది. గతంలో ఎం.ఎస్ ధోనిపై గౌతం గంభీర్ బహిరంగ విమర్శలు.. కోల్‌కత నైట్‌రైడర్స్ కెప్టెన్‌గా చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచుల్లో రెట్టించిన భావోద్వేగాలతో కనిపించిన గౌతం గంభీర్ తాజా మ్యాచ్‌లో లక్నో మెంటార్‌గా ధోనీసేనతో అదే భావోద్వేగంతో బరిలోకి దిగుతాడనే అంచనాలు కనిపించాయి. అయితే, లక్నో సూపర్‌జెయింట్స్, చెన్నై సూపర్‌కింగ్స్ పోరు వర్షార్పణం అయ్యింది. వరుణుడు రంగ ప్రవేశం చేయటంతో లక్నో, చెన్నై మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. దీంతో లక్నో సూపర్‌జెయింట్స్, చెన్నై సూపర్‌కింగ్స్ చెరో పాయింట్‌ను పంచుకున్నాయి. పది మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్‌కింగ్స్, లక్నో సూపర్‌జెయింట్స్ ఐదేసి విజయాలు సాధించాయి. నాలుగు ఓటములు, తాజా మ్యాచ్‌లో ఫలితం రాలేదు. 11 పాయింట్లతో లక్నో సూపర్‌జెయింట్స్ మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలువగా... 11 పాయింట్లతో చెన్నై సూపర్‌కింగ్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుంది.
బదాని బాదాడు : స్పిన్‌కు అనుకూలించే లక్నో పిచ్‌పై టాస్ నెగ్గిన చెన్నై సూపర్‌కింగ్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. లక్నో ఓపెనర్లు మనన్ వోహ్రా (10), కైల్ మేయర్స్ (14) తొలి మూడు ఓవర్ల పాటు వికెట్ కాపాడుకున్నారు. పవర్‌ప్లేలోనే బంతిని అందుకున్న మోయిన్ అలీ.. ఫామ్‌లో ఉన్న కైల్ మేయర్స్‌ను డగౌట్‌కు పంపించాడు. ఈ సీజన్లో వరుసగా రెండోసారి కైల్ మేయర్స్‌ను అలీ అవుట్ చేశాడు. మేయర్స్ నిష్క్రమణతో లక్నో సూపర్‌జెయింట్స్ బ్యాటర్లు చేతులెత్తేశారు. కరణ్ శర్మ (9), కృనాల్ పాండ్య (0), మార్కస్ స్టోయినిస్ (6)లు విఫలమయ్యారు. 44 పరుగులకే లక్నో సూపర్‌జెయింట్స్ ఐదు వికెట్లు కోల్పోయింది. స్వల్ప స్కోరుకే పరిమితమయ్యే ప్రమాదంలో పడింది. లక్నో పీకల్లోతు కష్టాల్లో కూరుకోగా ఆయుశ్ బదాని (59 నాటౌట్, 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), నికోలస్ పూరన్ (20, 31 బంతుల్లో) ఆరో వికెట్‌కు కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. పరుగుల వేటలో ఇతర బ్యాటర్లు తడబాటుకు గురైన వేళ ఆయుశ్ బదాని ధనాధన్ బాదేశాడు. నాలుగు సిక్సర్లు, రెండు బౌండరీలతో 30 బంతుల్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. బిగ్ హిట్టర్ నికోలస్ పూరన్ సైతం బౌండరీ కోసం తంటాలు పడినా.. బదాని అలవోకగా బాదాడు. బదాని బాదుడుతో మ్యాచ్ చెన్నై సూపర్‌కింగ్స్ చేజారినట్టు అనిపించింది. 19.2 ఓవర్లలో లక్నో సూపర్‌జెయింట్స్ 7 వికెట్లకు 125 పరుగులు చేసింది. ఆ సమయంలో వరుణుడు మరోసారి మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. అక్కడ్నుంచి వర్షం ఏమాత్రం తగ్గలేదు. దీంతో మ్యాచ్ మళ్లీ పున ప్రారంభం కాలేదు. వర్షం కారణంగా మ్యాచ్‌ను నిలిపివేస్తున్నట్టు ఫీల్డ్ అంపైర్లు ప్రకటించారు.
స్కోరు వివరాలు :
లక్నో సూపర్‌జెయింట్స్ : మనన్ వోహ్రా (బి) మహీశ్ తీక్షణ 10, కైల్ మేయర్స్ (సి)రుతురాజ్ గైక్వాడ్ (బి) మోయిన్ అలీ 14, కరణ్ శర్మ (సి,బి) మోయిన్ అలీ 9, కృనాల్ పాండ్య (సి) అజింక్య రహానె (బి) మహీశ్ తీక్షణ 0, మార్కస్ స్టోయినిస్ (బి) రవీంద్ర జడేజా 6, నికోలస్ పూరన్ (సి) మోయిన్ అలీ (బి) మథీశ పథీరణ 20, ఆయుశ్ బదాని నాటౌట్ 59, కృష్ణప్ప గౌతమ్ (సి) అజింక్య రహానె (బి) మథీశ పథీరణ 1, ఎక్స్‌ట్రాలు : 6, మొత్తం : (19.2 ఓవర్లలో 7 వికెట్లకు) 125.
వికెట్ల పతనం : 1-18, 2-27, 3-27, 4-34, 5-44, 6-103, 7-125.
బౌలింగ్ : దీపక్ చాహర్ 4-0-41-0, తుషార్ దేశ్‌పాండే 1-0-1-0, మోయిన్ అలీ 4-0-13-2, మహీశ్ తీక్షణ 4-0-37-2, రవీంద్ర జడేజా 3-0-11-1, మథీశ పథీరణ 3.2-0-22-2.