Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్‌పై కోల్‌కత విజయం
నవతెలంగాణ-హైదరాబాద్ :
లక్ష్యం 172 పరుగులు. కెప్టెన్ ఎడెన్ మార్క్రామ్ (41, 40 బంతుల్లో 4 ఫోర్లు), హెన్రిచ్ క్లాసెన్ (36, 20 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్స్‌లు) భాగస్వామ్యంతో విజయం ముంగిట నిలిచిన స్థితి. 30 బంతుల్లో 38 పరుగులు చేయాల్సిన సమయంలోనూ విజయం తథ్యమే అనిపించింది. కానీ చేతుల్లోకి వచ్చిన మ్యాచ్‌ను సొంతం చేసుకుంటే అది సన్‌రైజర్స్ జట్టు ఎలా అవుతుంది?!. అందుకే అలవోకగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 172 పరుగుల ఛేదనలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 166 పరుగులే చేసింది. యువ బ్యాటర్ అబ్దుల్ సమద్ (21, 18 బంతుల్లో 3 ఫోర్లు), రాహుల్ త్రిపాఠి (20, 9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించినా..
ఫలితం లేకపోయింది. చివరి ఓవర్లో 9 పరుగులు అవసరం కాగా, వరుణ్ చక్రవర్తి ఓ వికెట్ పడగొట్టి 3 పరుగులే ఇచ్చాడు. తొమ్మిది మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఇది ఆరో పరాజయం. అంతకుముందు, తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్ 35/3తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుంది. మిడిల్ ఆర్డర్ మెరుపులతో కోల్‌కత నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు171 పరుగులు చేయగల్గింది. రింకూ సింగ్ (46, 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ నితీశ్ రానా (42, 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లు)లకు తోడు అండ్రీ రసెల్ (24, 15 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు.