Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కీడాశాఖ, భారత ఒలింపిక్ సంఘందారెటు?
- ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య చర్యలు తీసుకునేనా?
- 12వ రోజు ఉద్రిక్తతల నడుమ రెజ్లర్ల ఆందోళన
లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ (బిజెపి) ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో అగ్రశ్రేణి రెజ్లింగ్ క్రీడాకారుల ఆందోళన 12వ రోజుకు చేరుకుంది. అర్థరాత్రి వేళ మల్లయోధులపై పోలీసు జులుంతో జంతర్‌మంతర్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై చట్టపర చర్యల కోసం రెజ్లర్ల పోరాటంలో పరిష్కార మార్గాలు ఏం ఉన్నాయి? ఈ విషయంలో కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సహా ప్రపంచ రెజ్లింగ్ బాడీ ఏం చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయో చూద్దాం.
నవతెలంగాణ క్రీడావిభాగం
మల్లయోధుల ఉడుంపట్టు
ఈ విషయంలో రెజ్లింగ్ క్రీడాకారులు చాలా స్పష్టతతో ఉన్నారు. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌ను అరెస్టు చేసే వరకు జంతర్‌మంతర్ నుంచి కదిలేది లేదని మల్లయోధులు ప్రకటించారు. జనవరిలో నిరసన సందర్భంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ హామీ, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుతో రెజ్లర్లు ఆందోళన విరమించారు. మూడు నెలలు ముగిసినా క్రీడాశాఖ మంత్రి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పర్యవేక్షణ కమిటీ నివేదిక బయట పెట్టలేదు. దీనికి తోడు లైంగిక వేధింపుల ఆరోపణలను కప్పిపుచ్చే ప్రయత్నం జరుగుతోంది. దీంతో క్రీడాశాఖ మంత్రి ఇప్పటికే రెజ్లర్ల నమ్మకాన్ని కోల్పోయాడు. ఢిల్లీ పోలీసులు కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉందని చెబుతున్నారు. అధికార పార్టీ నాయకుడి కేసు కావటంతో సహజంగానే 'చట్టం తన పని చేసేందుకు ఆదేశాల కోసం ఎదురుచూస్తుంది'!.
మరోవైపు బజరంగ్ పూనియా, వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్‌లు జంతర్‌మంతర్ వద్ద కూర్చున్నారు. రానున్న 2023 ఆసియా క్రీడల్లో ఈ ముగ్గురు రెజ్లర్లు పసిడి ఫేవరేట్లు. సెప్టెంబర్-అక్టోబర్‌లో జరిగే మెగా ఈవెంట్లో మెడల్ కంటే బాధిత మహిళా రెజ్లర్లకు న్యాయం చేకూర్చటమే ప్రస్తుతం స్టార్ మల్లయోధుల ప్రథమ కర్తవ్యంగా కనిపిస్తుంది. బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేస్తే గానీ బజరంగ్, వినేశ్, సాక్షిలు ఆసియా క్రీడలు, ప్రపంచ చాంపియన్‌షిప్స్ కోసం సన్నద్ధత మొదలుపెట్టే పరిస్థితి లేదు.
క్రీడాశాఖ కింకర్తవ్యం
కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ రెజ్లర్ల ఆందోళన అంశంలో చేతులు దులుపుకుంది. పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేసినా, ఆ కమిటీ నివేదికను బహిర్గతం చేయలేదు. రెజ్లర్లను శాంతపరిచేందుకు క్రీడాశాఖ మంత్రి ప్రయత్నాలు సరిపోవట్లేదు. దీంతో ఈ అంశాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కోర్టులోకి పంపించింది. నేరుగా రెజ్లింగ్ సమాఖ్యలో జోక్యం చేసుకుంటే అంతర్జాతీయ సమాఖ్య నుంచి ప్రతిఘటన ఉంటుందనే సాకుతో ఐఓఏకు అప్పజెప్పింది. అయితే, పర్యవేక్షణ కమిటీ నివేదిక అంశాలను క్రీడాశాఖ బయట పెట్టాలి. ఐఓఏకు రాసిన లేఖలో పేర్కొన్న ముఖ్యమైన అంశాలను చూస్తే.. రెజ్లర్లు లేవనెత్తిన సమస్యలపై నివేదికలో ఎటువంటి ప్రస్తావన లేదు. లైంగిక వేధింపుల ఆరోపణలను స్వయంగా క్రీడాశాఖ కప్పిపుచ్చే ప్రయత్నం చేసిందనే రెజ్లర్ల ఆరోపణతో మంత్రి అనురాగ్ ఠాకూర్ ఇరుకున పడ్డారు. పర్యవేక్షణ కమిటీ నివేదికను పారదర్శకంగా బహిర్గతం చేయాలి. బ్రిజ్‌భూషణ్‌ను కాపాడే ప్రయత్నం మానుకుని ఇప్పటికే వాస్తవాలతో రెజ్లర్లకు న్యాయం జరిగేలా చూడాలి.
ఇక ఐఓఏ చేతుల్లోనే..!
భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ఇప్పుడు రెజ్లింగ్ సమాఖ్య బాధ్యతలను తీసుకుంది. అడ్హాక్ కమిటీ ఏర్పాటు దిశగా సగం పని పూర్తి చేసింది. మాజీ ఒలింపియన్ సుమ, వుషు సమాఖ్య అధ్యక్షుడు భూపేందర్ సింగ్ భజ్వాలను కమిటీ సభ్యులుగా నియమించింది. అడ్హాక్ కమిటీ ప్రధాన బాధ్యత 45 రోజుల్లో ఎన్నికల నిర్వహణ. అందుకోసం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి కోసం ఐఓఏ అన్వేషిస్తోంది. 12 ఏండ్లు రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా కొనసాగిన బ్రిజ్‌భూషణ్ మరోసారి పదవి చేపట్టేందుకు అనర్హుడు. కానీ అతడి తనయుడు అధ్యక్ష పగ్గాలు అందుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. దశాబ్దకాలంగా రెజ్లింగ్ సమాఖ్యపై తిరుగులేని పట్టు సాధించిన బ్రిజ్‌భూషణ్ ఆఫీస్ బేరర్లను సైతం కోరుకున్న వ్యక్తులనే ఎన్నుకునేలా ప్రణాళికలు ఇప్పటికే రచించాడు. ఈ విషయంలో ఐఓఏ ఏమైనా జోక్యం చేసుకుంటుందేమో చూడాలి. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించటం సైతం ఐఓఏ ముందున్న కీలక కర్తవ్యం. ఇక రానున్న పలు టోర్నమెంట్లకు భారత జట్ల ఎంపిక సహా జాతీయ శిబిరాల నిర్వహణ ఐఓఏ ముందున్న సవాళ్లు. ఇక రెజ్లింగ్ సమాఖ్యలో జరుగుతున్న తతంగంపై ఐఓఏ సైతం ఓ విచారణ కమిటీ నియమించింది. విచారణను త్వరగా పూర్తి చేసి ఆ నివేదికను ఐఓఏ ప్రజల ముందుంచాలి.
పోలీసులు-న్యాయం
రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిసినట్టు సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పిటిషనులో కోరారు, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇంకా ఏమైనా ఫిర్యాదులు, సమస్యలు ఉంటే స్థానిక మేజిస్ట్రేట్, హైకోర్టును ఆశ్రయించాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ సూచించారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేస్తే గానీ బ్రిజ్‌భూషణ్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని.. అందుకే ఈ కేసు విచారణను స్వయంగా సుప్రీంకోర్టు లేదా విశ్రాంత న్యాయమూర్తి పర్యవేక్షణలో జరగాలని రెజ్లర్ల తరఫున న్యాయవాది కోరారు. కానీ ధర్మాసనం అందుకు అంగీకారం తెలపలేదు. భారతీయ జనతా పార్టీ ఎంపీపై కేసు కావటంతో ఢిల్లీ పోలీసులు విచారణ ప్రక్రియను నేరుగా చేయలేరు!. ప్రాథమిక విచారణలో బ్రిజ్‌భూషణ్‌పై ఆరోపణలకు బలం చేకూరితే.. ఆ తర్వాత చార్జిషీట్ దాఖలు, న్యాయస్థానంలో వాదనలు, శిక్ష ఇలా.. పలు దశలు ఉన్నాయి. కానీ ఇవేవీ వేగవంతంగా జరిగే పరిస్థితులు కనిపించటం లేదు. దర్యాప్తు సైతం పారదర్శకంగా జరుగు తుందనే విశ్వాసం ఎవరికీ లేదు.
యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్
భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక ఆరోపణలు, ఢిల్లీ పోలీసుల ఎఫ్ఐఆర్ నమోదు సహా జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళనపై ప్రపంచ రెజ్లింగ్ బాడీ.. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (యుడబ్ల్యూడబ్ల్యూ)కి వాస్తవ పరిస్థితులపై ఎటువంటి అవగాహన లేదు. బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక ఆరోపణలు కుట్రపూరితమని భారత రెజ్లింగ్ సమాఖ్య అధికారికంగా యుడబ్ల్యూ డబ్ల్యూకు ఈమెయిల్ పంపించింది. భారత రెజ్లింగ్‌లో జరుగుతున్న పరిణామాలు, రెజ్లింగ్ సమాఖ్య పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నవారి వివ రాలపై వాస్తవాలు వెల్లడించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ హెచ్చ రించింది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పర్యవేక్షకుడిని నియమించేందుకు సైతం యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సిద్ధంగా ఉంది. అడ్హాక్ కమిటీ చైర్మెన్‌ను నియమిస్తే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ నుంచి పర్యవేక్షకుడి కోసం ఐఓఏ కోరవచ్చు.
ఇటీవల భారత క్రీడా రంగంలో చేదు సంఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్‌భూషణ్‌పై చట్టపర చర్యలతో రెజ్లింగ్ సమాఖ్యలో నెలకొన్ని ప్రతిష్ఠంభనకు తెర పడనుంది. బ్రిజ్‌భూషణ్‌పై చర్యలు తీసుకు నేందుకు, రెజ్లింగ్ సమాఖ్యలో వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రధాన మంత్రి, కేంద్ర ప్రభుత్వం, క్రీడామంత్రిత్వ శాఖ నుంచి ఒక్క ఆదేశం సరిపోతుంది. రెజ్లర్ల ఆందోళన మరింత జఠిలం కాకముందే ప్రధాని నరెంద్ర మోడి ముందుకొస్తారా? లేదంటే జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళన అరణ్య రోదనగానే మిగిలిపోతుందా? ఇదో మిలియన్ డాలర్ల ప్రశ్న.