Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హిట్‌మ్యాన్‌కు సునీల్ గవాస్కర్ సూచన
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యధిక టైటిళ్లు సాధించిన కెప్టెన్‌గా రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. తాజా ఐపీఎల్ సీజన్లో అత్యంత పేలవ ఫామ్‌తో నిరాశపరుస్తున్నాడు. ముంబయి ఇండియన్స్‌కు ఐదు ఐపీఎల్ టైటిళ్లు అందించిన నాయకుడు రోహిత్ శర్మ. ఐపీఎల్16లో రోహిత్ శర్మ ఏకంగా 8 ఇన్నింగ్స్‌ల్లో పవర్‌ప్లే ముగిసేలోపే వికెట్ కోల్పోయాడు. వరుస మ్యాచుల్లో సున్నా పరుగులకే నిష్క్రమించిన రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. సునీల్ నరైన్, దినేశ్ కార్తీక్‌లు 15 సార్లు డకౌట్ కాగా.. చెన్నై సూపర్‌కింగ్స్‌తో మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఆ చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. టీ20 ఫార్మాట్లో రోహిత్ శర్మ పేలవ ఫామ్‌తో క్రికెట్ దిగ్గజం లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ అతడికి ఓ సూచన చేశాడు. తాత్కాలికంగానైనా ఐపీఎల్ నుంచి విరామం తీసుకోవాలని సూచించాడు. 'రోహిత్ శర్మ కొంత కాలమైనా ఐపీఎల్ నుంచి విరామం తీసుకోవాలని సూచిస్తున్నాను. రానున్న ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌కు ఫిట్‌గా ఉండేందుకు విరామం ఉపయోగపడుతుంది. ఐపీఎల్ చివరి దశ మ్యాచులకు రోహిత్ శర్మ తిరిగి అందుబాటులోకి రావచ్చు. కానీ ప్రస్తుతానికి అతడు కాస్త ఊపిరి తీసుకునేందుకైనా విరామం తీసుకోవాలి' అని సునీల్ గవాస్కర్ అన్నాడు. వరల్డ్ నం.1 భారత్, వరల్డ్ నం.2 ఆస్ట్రేలియాలు ఐసీసీ 2023 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో పోటీపడనున్న సంగతి తెలిసిందే. జూన్ 7-11న లండన్‌లోని ది ఓవల్ మైదానంలో మహా టెస్టు సమరం జరుగనుంది. గాయాలతో రిషబ్ పంత్, జశ్‌ప్రీత్ బుమ్రా, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్ ఇప్పటికే జట్టుకు దూరమైన నేపథ్యంలో కీలక పోరుకు భారత క్రికెటర్ల ఫిట్‌నెస్‌పై ఆందోళన నెలకొంది.