Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెపాక్‌లో ముంబయి ఇండియన్స్ ఆధిపత్యానికి తెరపడింది. 2011 తర్వాత చెపాక్‌లో ముంబయి ఇండియన్స్‌పై చెన్నై సూపర్‌కింగ్స్ విజయం సాధించింది. జూనియర్ మలింగ మతీశ పతిరణ (3/15), దీపక్ చాహర్ (2/18) నిప్పులు చెరగటంతో సీజన్లో వరుసగా రెండోసారి ముంబయిపై సూపర్‌కింగ్స్ గెలుపొందింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంతో చెన్నై సూపర్‌కింగ్స్ (13) ప్లేఆఫ్స్ ముంగిట నిలిచింది!.
- ముంబయి ఇండియన్స్‌పై గెలుపు
- నిప్పులు చెరిగిన మతీశ పతిరణ
- ప్లే ఆఫ్స్‌కు చేరువైన చెన్నై
నవతెలంగాణ-చెన్నై
ఐపీఎల్ దిగ్గజాల సమరం ఏకపక్షంగా ముగిసింది. శనివారం చెపాక్‌లో జరిగిన మ్యాచ్‌లో ముంబయిపై చెన్నై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత ముంబయి ఇండియన్స్‌కు స్వల్ప స్కోరుకు కట్టడి చేసిన చెన్నై సూపర్‌కింగ్స్.. ఛేదనలో చెమట పట్టకుండా దుమ్మురేపింది. సూపర్‌కింగ్స్ పేస్ త్రయం జూనియర్ మలింగ మతీశ పతిరణ (3/15), దీపక్ చాహర్ (2/15), తుషార్ దేశ్పాండె (2/26) నిప్పులు చెరిగే ప్రదర్శనతో చెలరేగారు. స్పిన్ స్వర్గధామం చెపాక్ పిచ్‌పై పేసర్లు పంజా విసరగా తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 139 పరుగులే చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నేహల్ వదేర (64, 51 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) అర్థ సెంచరీతో ముంబయి ఇండియన్స్‌ను ఆదుకున్నాడు. ఓపెనర్లు డెవాన్ కాన్వే (44, 42 బంతుల్లో 4 ఫోర్లు), రుతురాజ్ గైక్వాడ్ (30, 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), శివం దూబె (26 నాటౌట్, 18 బంతుల్లో 3 సిక్స్‌లు) రాణించటంతో చెన్నై సూపర్‌కింగ్స్ 17.4 ఓవర్లలోనే లాంఛనం ముగించింది. మూడు వికెట్లతో మెరిసిన మతీశ పతిరణ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. 11 మ్యాచుల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ఇది ఆరో విజయం కాగా.. ఓ ఫలితం తేలని మ్యాచ్‌తో ఓవరాల్‌గా 13 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్‌కు అడుగు దూరంలో నిలిచింది!. ముంబయి ఇండియన్స్‌కు పది మ్యాచుల్లో ఐదో పరాజయం కావటం గమనార్హం.
పేసర్ల ప్రతాపం
టాస్ నెగ్గిన చెన్నై సూపర్‌కింగ్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. చెపాక్‌లో తిరుగులేని రికార్డున్న ముంబయి ఇండియన్స్‌కు ఆరంభం కలిసిరాలేదు. పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు చేజార్చుకుంది. దీపక్ చాహర్, తుషార్ దేశ్పాండె విజృంభించటంతో 14 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. కామెరూన్ గ్రీన్ (6), ఇషాన్ కిషన్ (7), రోహిత్ శర్మ (0)లు విఫలమయ్యారు. గ్రీన్ కథ తుషార్ ముగించగా.. దీపక్ చాహర్ ఒకే ఓవర్లో కిషన్, రోహిత్‌లను అవుట్ చేశాడు. నం.3 బ్యాటర్‌గా వచ్చిన రోహిత్ శర్మ మూడు బంతులు ఆడి డకౌట్‌గా నిష్క్రమించాడు. సూపర్‌కింగ్స్ పేసర్లు పంజా విసిరిన తరుణంలో నేహల్ వదేర (64) స్ఫూర్తిదాయక అర్థ సెంచరీతో కదం తొక్కాడు. రెండు కీలక 50 ప్లస్ భాగస్వామ్యాలు నమోదు చేసి ముంబయి ఇండియన్స్‌కు గౌరవ ప్రద స్కోరు అందించాడు. సూర్యకుమార్ యాదవ్ (26, 22 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి నాల్గో వికెట్‌కు 55 పరుగులు జోడించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (20, 21 బంతుల్లో 2 ఫోర్లు)తో కలిసి ఐదో వికెట్‌కు 54 పరుగులు జత చేశాడు. ఐదు ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన నేహల్.. ముంబయి ఇండియన్స్ స్వల్ప స్కోరుకు పరిమితం కాకుండా చూశాడు. టాప్‌ను చాహర్, తుషార్ చూసుకోగా.. టెయిల్ కథను మతీశ పతిరణ ముగించాడు. స్టబ్స్, అర్షద్ ఖాన్ (1) సహా నేహల్లను మతీశ అవుట్ చేశాడు.
ఆడుతూ పాడుతూ
ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్‌కింగ్స్ మధ్య పోరు మహా సమరమే!. ఐపీఎల్లో 9 ట్రోఫీలు దక్కించుకున్న ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా నరాలు తెగే ఉత్కంఠ ఖాయం. కానీ ఈ సీజన్ అందుకు భిన్నంగా సాగింది. వాంఖడె, చెపాక్‌లో సూపర్‌కింగ్స్ ఏకపక్ష విజయాలు నమోదు చేసింది. 139 పరుగుల ఛేదనలో సూపర్‌కింగ్స్‌కు ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని అందించారు. డెవాన్ కాన్వే (44) ఓ ఎండ్‌లో సావధానంగా ఆడగా.. మరో ఎండ్‌లో రుతురాజ్ గైక్వాడ్ (30) రెచ్చిపోయాడు. తొలి వికెట్‌కు 46 పరుగులు జోడించిన అనంతరం గైక్వాడ్ నిష్క్రమించినా.. అజింక్య రహానె (21) దూకుడు పట్టాలు వీడలేదు. శివం దూబె (26) సూపర్ ఫామ్ కొనసాగించాడు. మూడు సిక్సర్లతో చెన్నై గెలుపు లాంఛనం చేశాడు. ఆరంభంలో వికెట్లతో చెన్నైపై ఒత్తిడి పెంచే అవకాశాన్ని ముంబయి చేజార్చుకుంది. స్పిన్నర్ పియూశ్ చావ్లా (2/25) మాయ ముంబయికి ఊరట. ఛేదనలో చివర్లో ఎం.ఎస్ ధోని (2 నాటౌట్) అభిమానులను అలరించాడు. బ్యాటర్ల మెరుపులతో 17.4 ఓవర్లలోనే చెన్నై సూపర్‌కింగ్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
స్కోరు వివరాలు :
ముంబయి ఇండియన్స్ : కామెరూన్ గ్రీన్ (బి) తుషార్ 6, ఇషాన్ కిషన్ (సి) మహీశ్ (బి) చాహర్ 7, రోహిత్ శర్మ (సి) జడేజా (బి) చాహర్ 0, నేహల్ వదేర (బి) మతీశ 64, సూర్యకుమార్ యాదవ్ (బి) జడేజా 26, ట్రిస్టన్ స్ట్రబ్స్ (సి) జడేజా (బి) మతీశ 20, టిమ్ డెవిడ్ (సి) రుతురాజ్ (బి) తుషార్ 2, అర్షద్ ఖాన్ (సి) రుతురాజ్ (బి) మతీశ 1, జోఫ్రా ఆర్చర్ నాటౌట్ 3, పియూశ్ చావ్లా నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 8, మొత్తం : (20 ఓవర్లలో 8 వికెట్లకు) 139.
వికెట్ల పతనం : 1-13, 2-13, 3-14, 4-69, 5-123, 6-127, 7-134, 8-137.
బౌలింగ్ : దీపక్ చాహర్ 3-0-18-2, తుషార్ దేశ్పాండె 4-0-26-2, రవీంద్ర జడేజా 4-0-37-1, మోయిన్ అలీ 1-0-10-0, మహీశ్ తీక్షణ 4-0-28-0, మతీశ పతిరణ 4-0-15-3.
చెన్నై సూపర్‌కింగ్స్ : రుతురాజ్ గైక్వాడ్ (సి) ఇషాన్ (బి) పియూశ్ చావ్లా 30, డెవాన్ కాన్వే (ఎల్బీ) ఆకాశ్ 44, అజింక్య రహానె (ఎల్బీ) చావ్లా 21, అంబటి రాయుడు (సి) రాఘవ్ (బి) స్టబ్స్ 12, శివం దూబె నాటౌట్ 26, ఎం.ఎస్ ధోని నాటౌట్ 2, ఎక్స్‌ట్రాలు : 5, మొత్తం : (17.4 ఓవర్లలో 4 వికెట్లకు) 140.
వికెట్ల పతనం : 1-46, 2-81, 3-105, 4-130.
బౌలింగ్ : కామెరూన్ గ్రీన్ 1-0-10-0, జోఫ్రా ఆర్చర్ 4-0-24-0, అర్షద్ ఖాన్ 1.4-0-28-0, పియూశ్ చావ్లా 4-0-25-2, రాఘవ్ గోయల్ 4-0-33-0, ట్రిస్టన్ స్టబ్స్ 2-0-14-1, ఆకాశ్ 1-0-4-0.