Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తృటిలో సింధు చేజారిన ప్రతిష్టాత్మక టైటిల్
- సింగిల్స్ టైటిల్ యమగూచి సొంతం
- ఫైనల్లో 1-2తో పోరాడిన ఓడిన తెలుగు తేజం
- ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్
2016 రియో ఒలింపిక్స్ ఫైనల్స్. కరొలినా మారిన్‌తో మూడు సెట్ల పాటు హోరాహోరీ పోరు. అయినా, 21-19, 12-21, 15-21తో సింధు చేజారిన ఒలింపిక్ స్వర్ణం.
2017 ప్రపంచ బ్యాడ్మింటన్ ఫైనల్స్. ప్రత్యర్థి జపాన్ అమ్మాయి నొజొమి ఒకుహర. సుదీర్ఘ ర్యాలీల పాటు సాగిన ఈ మ్యాచ్ బ్యాడ్మింటన్ చరిత్రలోనే ఓ మైలురాయి. ఇక్కడా సింధు దుమ్మురేపింది. కానీ, తుది ఫలితం 21-19, 20-22, 18-21తో మళ్లీ నిరాశే ఎదురైంది.
తాజాగా, ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్. గ్రూప్ దశలోనే జపాన్ అమ్మాయి యమగూచిపై తిరుగులేని విజయం సింధు సొంతం. ఇక టైటిల్ పోరులోనూ తొలి గేమ్‌లో గెలుపు. రెండో సెట్లో ఆధిక్యం. నిర్ణయాత్మక మూడో గేమ్‌లోనూ తిరుగులేని ప్రదర్శన. అయినా, ప్రతిష్టాత్మక ఫైనల్లో సింధుకు మరోమారు నిరాశే ఎదురైంది. 21-15, 12-21, 19-21తో సింధు రన్నరప్‌తో సరిపెట్టుకున్నది.
వరల్డ్ క్లాస్ ఆటతో సింధు విశేషంగా రాణిస్తోన్నా.. ప్రతిష్టాత్మక ఫైనల్స్‌లో సింధుకు ఫలితం దక్కకపోవటం ఇది మూడోసారి. సైనా, జ్వాల-ద్విజుల తర్వాత భారత్ తరఫున ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన మూడో క్రీడాకారిణి సింధు.
నవతెలంగాణ-దుబాయ్
తొలి సెట్లో 21-12తో తిరుగులేని విజయం. కచ్చితమైన స్మాష్‌లు, తెలివైన నెట్ డ్రాపింగ్, సుదీర్ఘ ర్యాలీలలో చాకచక్యంతో సింధు దూసుకెళ్తోంది. అందని ద్రాక్షలా ఉన్న ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్ ఇక సింధు వశపర్చుకోవటం లాంఛనమే అనిపించింది. అందుకు తగినట్టుగానే ఆఖరు వరకూ సింధు గొప్పగా ఆడింది. కానీ నెట్ గేమ్‌లో ఓ చిన్న తప్పిదం, సర్వీస్‌లో చేసిన ఓ పొరపాటు ప్రపంచ సూపర్ సిరీస్ టైటిల్‌ను సింధుకు కాకుండా చేశాయి. టైటిల్ కోసం జపాన్ అమ్మాయి అకానె యమగూచితో 94 నిమిషాల పాటు పోరాడిన సింధు 21-15, 12-21, 19-21తో ఫైనల్లో పరాజయం పాలైంది. గ్రూప్ దశలో సింధు చేతిలో చిత్తుగా ఓడినా, ఫైనల్లో ఎక్కడా తగ్గకుండా పోరాడిన యమగూచి మహిళల సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకున్నది.
సింధు, యమగూచి నువ్వా నేనా.. : అజేయ రికార్డుతో ఫైనల్లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగిన సింధు.. అంచనాలకు తగినట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ఆత్మ విశ్వాసంతో కూడిన స్మాష్‌లు సంధించిన సింధు విశేషంగా ఆకట్టుకున్నది. ఇక తొలి గేమ్‌లో సింధు 5-8తో వెనుకంజలో నిలిచినా.. త్వరగానే పుంజుకున్నది. వరుస పాయింట్లతో విరామ సమ యానికి 11-8తో ముందంజ వేసింది. ద్వితీయా ర్థంలోనూ రెచ్చిపోయిన సింధు వడివడిగా పాయింట్లు సాధించింది. 14-13తో యమగూచి చేరువగా వచ్చినా.. వెంటనే 20-13తో దూసుకెళ్లింది. గేమ్ పాయింట్ వద్ద యమగూచి రెండు పాయింట్లతో సంతృప్తిపడినా.. సింధు 21-15తో తొలి గేమ్ గెల్చు కున్నది. రెండో గేమ్‌లో ఆరంభంలోనే సింధు విజృంభిం చింది. వరుసగా ఐదు పాయింట్లతో దూసుకెళ్లింది. సింధు ఓవర్కోర్టు సర్వీస్‌తో యయగూచి తొలి పాయింట్ సాధించింది. యమగూచి 1-5తో వెనుకంజ వేసినా.. వేగంగా పాయింట్లు కొట్టింది. 8-8తో స్కోరు సమం చేయటమే కాదు విరామ సమయానికి 11-9తో సింధును వెనక్కి నెట్టింది. సెకండ్ హాఫ్‌లో సింధు కాస్త తడబడింది. దీంతో యమగూచి వరుస పాయింట్లతో 21-12తో రెండో గేమ్ నెగ్గింది. టైటిల్ కోసం నిర్ణయాత్మక మూడో గేమ్ ఆడేలా చేసింది.
అద్భుతంగా ఆడినా.. : ఇక నిర్ణయాత్మక గేమ్‌లో ఇద్దరూ హౌరాహౌరీ పోరాడారు. తొలి రెండు గేమ్‌లు 50 నిమిషాల్లో ముగియగా, ఆఖరి గేమ్ 44 నిమిషాల పాటు సాగింది. ఈ గేమ్‌లోనూ సింధు 4-0తో ధాటిగా మొదలెట్టింది. కానీ యమగూచి 5-5తో రేసులోకి దూసుకొచ్చింది. ఇక్కడ్నుంచి ఒక్కో పాయింట్ కోసం సింధు, యమగూచి సుదీర్ఘ ర్యాలీల్లో పోటీ పడ్డారు. ఉత్కంఠ సమరంలో 11-8తో సింధు విరామ సమయానికి ఆధిక్యం సాధించింది. కానీ ద్వితీయార్థంలో నిలబెట్టుకోలేదు. 11-10, 12-10, 13-11 నుంచి సింధు నెమ్మదించగా 13-13తో యమగూచి సమవుజ్జీగా నిలిచింది. ఈ సమయంలో జరిగిన క్లాసికల్ ర్యాలీలో పాయింట్ నెగ్గిన సింధు 14-13తో ఓ అడుగు ముందుకేసింది. ఈ ర్యాలీ ప్రపంచ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో ఒకుహరతో 72 షాట్ల ర్యాలీని గుర్తుకుతెచ్చింది. ఇక్కడ తను నెగ్గిన పాయింట్ కోసం తీవ్రంగా చెమటోడ్చిన సింధు.. ప్రత్యర్థికి మాత్రం తన చిన్న చిన్న పొరపాట్లతో పాయింట్లను కోల్పోయింది. ఆఖర్లో 19-19తో సమవుజ్జీలుగా నిలిచిన తరుణంలో.. మరోసారి నెట్ వద్ద, సర్వీస్‌లో తప్పిదానికి పాల్పడిన సింధు తగిన మూల్యం చెల్లించుకున్నది. కానీ ఆ మూల్యం ఖరీదు ప్రతిష్టాత్మక ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్ కావటం నిరాశకు గురిచేస్తోంది. సుదీర్ఘ ర్యాలీల మూడో గేమ్‌లో సింధు, యమగూచి ఇద్దరూ అలసిపోయారు. ఓ దశలో బలమైన స్మాష్‌లు ఆడలేని స్థితికి చేరుకున్నారిద్దరు. సింధు మరోసారి ఫైనల్లో ఓడినా, అద్భుత ఆటతో విశేషంగా ఆకట్టుకున్నది.
ఫైనల్లో ఎవరెలా..
సింధు యమగూచి
08 వరుస పాయింట్లు 05
03 గేమ్ పాయింట్లు 02
52 నెగ్గిన పాయింట్లు 57
109 మొత్తం పాయింట్లు 109
సమయం : 94 నిమిషాలు,
ఫలితం : 21-15, 12-21, 19-21