Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచే అండర్ 19 ప్రపంచ కప్
- ఆదివారం ఆస్ట్రేలియాతో భారత్ తొలి పోరు
మౌంట్ మాంగనుయి (న్యూజిలాండ్) : సీనియర్ జట్టులో భారత్ తరఫున ఆడాలనే ప్రతి కుర్ర క్రికెటర్ కల.. అండర్ 19 ప్రపంచ కప్. సెహ్వాగ్, హర్భజన్ వంటి దిగ్గజాలే కాదు.. తాజాగా క్రికెట్ ప్రపంచాన్ని ఏలుతున్న విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్ వంటి అసమాన ఆటగాళ్లు అండర్ 19 ప్రపంచ కప్ ఆడినవారే. అందుకే ఒకప్పుడు ఏమంత జనాదరణ లేని ఈ టోర్నీకి ప్రస్తుతం ప్రాధాన్యత పెరుగుతోంది. క్రీడాభిమానుల అంచనాలకు తగ్గట్లే భావి క్రికెట్ స్టార్లు.. బ్యాటు, బంతితో మెరుపులు విరజిమ్మేందుకు సిద్ధమయ్యారు. అండర్ 19 ప్రపంచ కప్ బరిలో హాట్ ఫేవరెట్‌గా భారత్ బరిలో దిగుతున్నది. కుర్ర కెప్టెన్ పృథ్వీ షా నేతృత్వంలోని యువ జట్టు.. రాహుల ద్రవిడ్ శిక్షణలో రాటుదేలి ఉన్నది. న్యూజిలాండ్ ఆతిథ్యం ఇస్తోన్న యువ ప్రపంచ కప్ సమరం నేడే ఆరంభం కానున్నది. భారత్ తొలి పోరులో ఆస్ట్రేలియాతో తలపడన్నుది. టోర్నీలో పాల్గొంటున్న మొత్తం 16 జట్లను నాల్గు గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో జట్టు తొలుత తమ గ్రూప్‌లోని ఇతర జట్లతో లీగ్ దశ మ్యాచులు ఆడుతుంది. గ్రూప్ లో జట్టు స్థానాన్ని బట్టి ఇతర గ్రూప్ జట్లతో క్వార్టర్స్ మ్యాచులుంటాయి. ఆపై సెమీస్, ఫైనల్ మ్యాచులు నిర్వహిస్తారు. ప్రస్తుతం జరుగబోతున్నది అండర్ 19 ప్రపంచ కప్ యొక్క 12వ ఎడిషన్. గతేడాది ఫైనల్లో వెనుదిరిగిన భారత్ ఈసారి కప్‌పై కన్నేసింది. ఓవరాల్‌గా భారత్, ఆస్ట్రేలియాలు గతంలో మూడుసార్లు ప్రపంచ కప్ విజేతలుగా నిలిచాయి. పాకిస్థాన్ రెండు సార్లు, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, వెస్టిండీస్ ఒక్కోసారి కప్ గెల్చుకున్నాయి.
వీళ్లు కీలకం: దేశవాళీ రంజీ ట్రోఫీలో అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ బాదిన యువ కెరటం పృథ్వీషా జట్టు సారథ్య బాధ్యతలు నిర్వర్తించటమే గాక బ్యాట్స్‌మన్‌గానూ కీలకం. పరుగుల సునామీ సృష్టించటం ఈ ముంబయి కుర్రాడికి వెన్నతో పెట్టిన విద్య. బ్యాట్ పడితే బౌండరీలే అన్న చందంగా ఆడే కుర్ర కెప్టెన్.. అండర్ 19 టోర్నీలో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. భారత్ బ్యాటింగ్ లైనప్‌లో మరో విలువైన ఆటగాడు శుభమన్ గిల్. హర్యానాకు చెందిన గిల్ గతంలో అండర్ 23లో భారత ఏ జట్టులో ఆడాడు. ఓపెనర్‌గా భారత్‌కు గిల్ భారీ ఇన్నింగ్స్ జట్టుకు ఉపకరిస్తుంది. దక్షిణాఫ్రికాతో ప్రాక్టీసు మ్యాచ్‌లో అదరగొట్టిన మరో బ్యాట్స్‌మెన్ హిమాన్షు రానా. వీరేంద్ర సెహ్వాగ్‌తో కలిసి ఆడిన అనుభవం రానా సొంతం. గతేడాది ఇంగ్లాండ్‌పై నాల్గు మ్యాచుల్లో ఓ సెంచరీ, అర్థ సెంచరీతో చెలరేగిన రానా ఓవరాల్‌గా నాల్గు మ్యాచుల్లో 211 పరుగులు చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఇక బౌలింగ్ విషయానికొస్తే పేసర్ కమలేష్ నాగర్కోటి భారత బౌలింగ్ బృందాన్ని ముందుండి నడిపించనున్నాడు. గతేడాది విజరు హజారే ట్రోఫీలో హ్యాట్రిక్ వికెట్లతో మెరిసిన కమలేష్ ఆరంభంలోనే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ పనిపట్టగల సమ ర్థుడు. పేస్, బౌన్స్ పుష్కలంగా ఉండే కివీ పిచ్‌లపై ఇతను టీమ్ ఇండియాకు బలం. మరో సీమర్ శివం మావి జట్టుకు అదనపు బలం కానున్నాడు. రాకెట్ వేగంతో బంతులు విసిరే శివం.. చాలెంజర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు కూల్చిన బౌలర్‌గా నిలిచాడు.
ఏ గ్రూప్‌లో ఏ జట్లు
గ్రూప్ ఎ : దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, వెస్టిండీస్, కెన్యా
గ్రూప్ బి : భారత్, ఆస్ట్రేలియా, పపువా న్యూగినియా, జింబాబ్వే
గ్రూప్ సి : బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, కెనడా, నమీబియా
గ్రూప్ డి : శ్రీలకం, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, ఐర్లాండ్
భారత జట్టు వివరాలు: పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్, ఆర్యన్ జుయాల్, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, హార్విక్ దేశారు, మన్జోత్ కల్రా, కమలేష్ నాగర్కోటి, పంకజ్ యాదవ్, రియాన్ పరాగ్, ఇషాన్ పొరెల్, హిమాన్షు రానా, అనుకూల్ రారు, శివం మావి, శివసింగ్