Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బంగ్లాదేశ్‌తో భారత్ ఆఖరు పొట్టిపోరు నేడు
- జోరుమీదున్న యువభారత్.. ఒత్తిడిలో బంగ్లాదేశ్
ఆరంభ మ్యాచ్‌లో తడబడినా అనంతరం భారత్ గొప్పగా పుంజుకున్నది. సీనియర్లు జట్టులో లేకపోయినా టీమ్ ఇండియా ఇలాగే చెలరేగుతుంది అనేలా శ్రీలంకలో అదరగొడుతున్నది యువ భారత్. రోహిత్ శర్మ బ్యాట్స్‌మన్‌గా విఫలమవుతున్నా సారథ్య బాధ్యతలు నెరవేర్చడంలో మంచి మార్కులు కొట్టేశాడు. ముక్కోణపు టీ20 సిరీస్‌లో భాగంగా నేడు బంగ్లాతో ఆఖరు పొట్టిపోరు చేయనున్నది రోహిత్ సేన. విజయంతో ఘనంగా ఫైనల్లో కాలుమోపాలన్న సంకల్పంతో ఉన్నది.
నవతెలంగాణ-కొలంబో
ముక్కోణపు టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా దాదాపుగా ఫైనల్ చేరినట్టే. మూడింట రెండు మ్యాచులు నెగ్గి పాయింట్ల పట్టికలో నాల్గు పాయింట్లతో అగ్రస్థానాన ఉన్నది భారత్. ఇక రన్‌రేట్ పరంగానూ మనోళ్లకు ఫైనల్ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే ఈ లెక్కలన్నీ పక్కన పెట్టి నేడు బంగ్లాదేశ్‌పై మరోసారి వీరవిహారం చేయాలని చూస్తోన్నది టీమ్ ఇండియా. వరుసగా మూడో గెలుపుతో ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకోవటం దృష్టి పెట్టింది. అయితే బంగ్లాదేశ్ పరిస్థితి వేరు. గత కొద్ది అంతర్జాతీయ టీ20ల్లో పేలవంగా ఆడినా తాజా సిరీస్‌లో లంకను ఓడించి ఆశ్చర్యపరిచింది. నేడు భారత్‌ను సైతం అదే తరహాలో ఓడించాలనే ఆలోచనలో ఉన్నది. భారత్ చేతిలో బంగ్లాదేశ్ ఓడిపోతే ఆ జట్టుకు ఫైనల్ అవకాశాలు క్లిష్టమవుతాయి.
రోహిత్ ఈసారైనా : భారత బ్యాటింగ్ లైనప్‌లో తీవ్ర సమస్యగా కనిపిస్తోన్నది సారథి వైఫల్యం. కెప్టెన్‌గా మెరుగవుతున్న టీమ్ ఇండియా సేనాని రోహిత్ శర్మ బ్యాట్స్‌మన్‌గా మాత్రం అంచనాలను అందుకోవటం లేదు. కనీసం నేటి మ్యాచులో అయినా రోహిత్ ఫామ్‌లోకి రావాలని జట్టు కోరుతోంది. తొలి రెండు మ్యాచుల్లో చెలరేగిన ఓపెనర్ శిఖర్ ధావన్ శ్రీలంకతో జరిగిన రెండో మ్యాచ్‌లో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం అవటం కాస్త కలవరచే అంశమే అయినా అతడి ఫామ్‌పై చింత అక్కర్లేదు. వన్‌డౌన్‌లో రిషబ్ పంత్ స్థానంలో నేడు సైతం లోకేశ్ రాహుల్‌కే తుది జట్టులో చోటు దక్కే అవకాశ మున్నది. లంకతో పోరులో హిట్ వికెట్ అయిన చెత్త రికార్డు సాధించిన రాహుల్ నేటి పోరులో సత్తా చాటితే మిడిలార్డర్ మీద ఒత్తిడి తగ్గించిన వాడౌతాడు. రైనా బాగానే ఆడుతోన్నా చెత్త బంతులకే వికెట్ పారేసుకోవటం మానుకోవాలి. పొట్టి ఫార్మాట్లో బంతి బంతికీ సమీకరణాలు మారుతుంటాయి. అలాగని దాటిగా ఆడే ప్రయత్నంలో వికెట్ పారేసుకోవటం జట్టుకు మేలు చేయదు. ప్రపంచకప్ వరకల్లా భారత వన్డే జట్టులో స్థానం సంపాదిచాలనే ఆలోచనలో ఉన్న రైనా.. ఫీల్డింగ్‌లో ఉన్నట్టుగానే బ్యాటింగ్‌లోనూ చురుగ్గా ఉండాలి. మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్‌లు ఆకట్టుకుంటున్నారు. టాప్ ఆర్డర్ విఫలమైతే నేడు మరోసారి వారి నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించొచ్చు. ప్రత్యామ్నాయ ఆల్‌రౌండర్‌గా జట్టులో స్థానం కోరుతోన్న విజరు శంకర్, వాషింగ్టన్ సుందర్‌లు అవసర మైతే బ్యాటుతోనూ రాణించడానికి సిద్ధంగా ఉండాలి. బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ నిలకడగా రాణిస్తున్నాడు. బంతులు కట్టడి చేయగల్గితే అతను అద్భుతాలు సృష్టించగలడు. వాషింగ్టన్ సుందర్ అవసరమైన వేళ నిరూపించుకుంటున్నాడు. తాజా సిరీస్‌లో చాహాల్ వికెట్ల వేటలో వేగం తగ్గినా అతను భారత్ బౌలింగ్ అమ్ముల పొదిలో బలమైన అస్త్రం. పార్ట్‌టైమ్ బౌలర్‌గా రైనా సైతం రాణిస్తుండటం టీమ్ఇండియాకు కలిసొచ్చే అంశం.
అవకాశం కోసం : అంతర్జాతీయ క్రికెట్లో ఇపుడిపుడే మెరుగవుతోన్న బంగ్లాదేశ్ తాజా పొట్టి సిరీస్‌లో ఫైనల్ చేరితే చాలనే భావంతో ఉన్నది. సీనియర్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ లేని వేళ మహ్మదుల్లా జట్టును బాగానే నడిపిస్తోన్నా.. నాణ్యమైన ఆటను ఆడలేకపోతున్నారు. ప్రత్యేకించి బౌలింగ్‌లో ఆ జట్టు బలహీనత కొట్టొచ్చినట్టు తెలుస్తోంది. ముస్తాఫిజుర్ రహమాన్, రూబెల్ హోస్సేన్, తాస్కిన్ అహ్మద్‌లు బంగ్లా బౌలింగ్ భారం మోస్తున్నారు. మహ్మదుల్లా బంతితో మెరిస్తే బాగుంటుంది. బ్యాట్స్ మెన్ల్లో లిటన్ దాస్, సౌమ్య సర్కార్ చక్కటి ఫామ్‌తో కొనసాగుతున్నారు. భారత బౌలర్లు వీరిద్దరిని స్వల్ప స్కోరుకే కట్టడి చేయగల్గితే బంగ్లాదేశ్ ఓవరాల్ స్కోరు గరిష్టంగా తగ్గుతుంది. ముష్ఫికర్ రహీమ్, షబ్బీర్ రహమాన్లు బ్యాటింగ్ లైనప్‌లో బంగ్లాకు కీలకం.
తుది జట్లు (అంచనా)
భారత్ : రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కెఎల్ రాహుల్ , సురేశ్ రైనా, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్, విజరు శంకర్, జైదేవ్ ఉనద్కత్, యుజ్వెంద్ర చాహల్, శార్దూల్ ఠాకూర్.
బంగ్లాదేశ్ : తమీమ్ ఇక్బాల్, లిటన్ దాస్, సౌమ్య సర్కార్, ముష్ఫికర్ రహీమ్, మహ్మదుల్లా, షబ్బీర్ రహమాన్, మెహదీ హసన్, తాస్కిన్ అహ్మద్, రూబెల్ హుసేన్, ముస్తాఫిజుర్ రహమాన్, నురుల్ హసన్.