Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నై, హైదరాబాద్ క్వాలిఫయర్ నేడు
- హాట్ ఫేవరేట్‌గా సన్‌రైజర్స్
- జోరుమీదున్న ధోనీసేన
రెండేండ్ల నిషేధం ముగించుకుని పునరాగమనం చేసిన చరిత్ర చెన్నైది. స్టార్ బ్యాట్స్‌మన్, సారథిని కోల్పోయిన బలహీనత సన్‌రైజర్స్‌ది. సీజన్ ఆరంభానికి ముందు ఈ రెండు జట్ల ప్రయాణం కష్టమే అనిపించింది. రీ ఎంట్రీలో సీనియర్స్‌తో పొట్టి క్రికెట్ కష్టమేనని సూపర్ కింగ్స్‌పై పెదవి విరిచారు. వార్నర్ లేని హైదరాబాద్ ముందుకెళ్లటం సులువు కాదని నిట్టూర్చారు. కానీ లీగ్ దశ ముగిసే సరికి హైదరాబాద్, చెన్నై అగ్రస్థానాల్లో నిలిచి అంచనాల్ని తలకిందులు చేశాయి. ఫైనల్స్‌కు చేరుకునేందుకు నేడు వాంఖడేలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. నేడు ఐపీఎల్ క్వాలిఫయర్-1 పోరు.
నవతెలంగాణ-ముంబయి
బౌలర్ల అండతోనే హైదరాబాద్ విజయాలనే నీడ నుంచి హైదరాబాద్ బయటకొచ్చేసింది. హైదరాబాద్ అంటే బ్యాటింగ్ విన్యాసాలూ గుర్తుకొచ్చేలా విలియమ్స న్ సేన మెప్పించింది. కొత్త ఫార్ములాతో దూసుకొచ్చిన సూపర్ కింగ్స్ అన్ని విభాగాల్లోనూ జోరుమీదున్నది. ప్రత్యర్థికి ఎక్కడా కాసింత బలహీనత కనిపించకుండా మహేంద్రజాలంతో ధోని చెన్నైని నడిపిస్తున్నాడు. ఐపీ ఎల్ 11 మజిలీ ఆఖరి అంకానికి చేరుకున్న తరుణంలో నేడు ఫైనల్స్ బెర్త్ కోసం చెన్నై, హైదరాబాద్‌లు ముఖాముఖి పోరుకు సిద్ధమయ్యాయి. లీగ్ దశలో చెన్నై చేతిలో రెండు ఓటములు చవిచూసినా, లీగ్ దశ ఆఖరి మ్యాచుల్లో పరాజయాలు రుచి చూసినా.. ఆ సమీకరణాలతో సంబంధం లేకుండా సన్‌రైజర్స్ హైదరాబాద్ నేటి క్వాలిఫయర్-1లో హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. అన్ని విభాగాల్లో జోరుమీదున్న చెన్నై సూపర్ కింగ్స్ సైతం హాట్ ఫేవరేట్‌కు తక్కువేమీ కాదు!. కెప్టెన్సీలో ధోనీతో పోటీపడుతున్న కేన్ విలియమ్సన్.. నేటి క్వాలిఫయర్‌లో హైదరాబాద్‌ను ఫైనల్స్‌కు చేరుస్తాడేమో చూడాలి.
బ్యాట్స్‌మనే ఆడాలి : స్వల్ప స్కోర్లను కాపాడుకోవటంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ది ప్రత్యేక శైలి. కానీ సీజన్ సాగుతున్న కొద్దీ హైదరాబాద్ బౌలర్లను ప్రత్యర్థులు డీకోడ్ చేసేశారు!. ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ రెండు మ్యాచుల్లోనూ సన్‌రైజర్స్ బౌలింగ్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కొన్నది. దీంతో కీలక క్వాలిఫయర్‌లో సన్‌రైజర్స్ గతంలో మాదిరి పూర్తిగా బౌలర్లపై ఆధాపడలేని పరిస్థితి. ఓపెనర్ శిఖర్ ధావన్, కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లు మంచి ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరి జోరుకు అలెక్స్ హేల్స్ తోడైతే సన్‌రైజర్స్ భారీ స్కోరుకు ఢోకా ఉండదు. ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ గొప్పగా ఆడుతున్నాడు. కానీ మిడిల్ ఆర్డర్‌లోనే హైదరాబాద్‌కు కాసిన్ని కష్టాలున్నాయి. మనీశ్ పాండే అంచనాలను అందుకోవటంలో దారుణంగా విఫలమవుతున్నాడు. కానీ క్వాలిఫయర్‌లో 11కోట్ల ఆటగాడి నుంచి హైదరాబాద్ మెరుగైన ప్రదర్శ నను ఆశిస్తోంది. యూసుఫ్‌పఠాన్, దీపక్ హుడా సాహా, శ్రీవాత్సవ్లలో తుది జట్టులోకి ఎవరొచ్చినా బాధ్యత నిర్వర్తిస్తే సరిపోతుంది. బంతితో భువనేశ్వర్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయాలి. సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మలకు తోడు అఫ్ఘాన్ స్పిన్ గన్ రషీద్ ఖాన్లు సమష్టిగా రాణించే సమయం ఆసన్నమైంది.
తాలా తోడుగా.. జోరుగా చెన్నై : తంబీల అభిమాన తాలా (తలైవార్, నాయకుడు) ఎం.ఎస్ ధోని ఈ సీజన్లో క్రికెట్ విమర్శకులు ముక్కున వేలేసుకునేలా చేశాడు. భారీ షాట్లు, అలవోక సిక్సర్లు, మునుపటి స్టయిల్లో ముగింపు వెరసి.. చెన్నై విజయంలో ఈసారి సింహాభాగం వాటా ధోనీదే!. ఇప్పటికీ టోర్నీలో అత్యధిక సిక్సర్లు మహి బాదినవే. నేటి మ్యాచ్‌లోనూ ఇందుకు భిన్నమైన వాతావరణం ఉండబోదు. కెప్టెన్ ధోనితో పాటు తెలుగు తేజం అంబటి రాయుడు, సురేశ్ రైనా, షేన్ వాట్సన్, డుప్లెసిస్, డ్వేన్ బ్రావో భీకర ఫామ్‌లో ఉన్నారు. లోతుగా బ్యాటింగ్ చేయగల నైపుణ్యం చెన్నైని ప్రత్యేకంగా నిలుపుతున్నది. బంతితోనూ చెన్నై ధీటుగానే కనిపిస్తోంది. సఫారీ పేసర్ లుంగి ఎంగిడి, షార్దుల్ ఠాకూర్ సహా దీపక్ చాహర్‌లు వికెట్ల వేటలో ముందుంటున్నారు. ఏ ఒక్క ఆటగాడి ప్రదర్శనపై ఆధారపడని చెన్నై.. జట్టులో ఎవ్వరూ చెలరేగినా విజయానికి చేరువైనట్టే భావించాలి!. ః
పిచ్ స్వభావం : ఐపీఎల్ సహజంగా బ్యాటింగ్ పిచ్‌లనే అందిస్తారు. కానీ వాంఖడే పిచ్‌లు కాస్త టర్న్‌కు అనుకూలిస్తున్నాయి. ఇక్కడ సీజన్ ఆరంభ మ్యాచ్‌లో చెన్నై అద్భుతాలు చేసింది. మళ్లీ ఇదే మైదానంలో మరో అద్భుతంతో ఫైనల్స్‌కు వేళ్లేందుకు చూస్తోంది. పిచ్ స్వభావం ఎలాగున్నా.. విపరీతమైన ఒత్తిడి ఉంటే క్వాలిఫయర్‌లో మరీ భారీ స్కోర్లు నమోదు కాకపోవచ్చు!. 180 పరుగులు చేసినా.. గెలిచేందుకు అవకాశమున్నట్టే!
తుది జట్లు (అంచనా) : సన్‌రైజర్స్ హైదరాబాద్ : శిఖర్ ధావన్, అలెక్స్ హేల్స్, కేన్ విలియమ్సన్, మనీశ్ పాండే, షకిబ్ అల్ హసన్, యూసుఫ్ పఠాన్/దీపక్ హుడా, వృద్దిమాన్ సాహా , భువనేశ్వర్ కుమార్, సిద్దార్థ్ కౌల్, సందీప్ శర్మ, రషీద్ ఖాన్.
చెన్నై సూపర్ కింగ్స్ : అంబటి రాయుడు, షేన్ వాట్సన్, సురేశ్ రైనా, ఎం.ఎస్ ధోని, రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, లుంగి ఎంగిడి, దీపక్ చాహర్, హర్బజన్ సింగ్, షార్దుల్ ఠాకూర్, శ్యామ్ బిల్లింగ్స్.