Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలిమినేటర్‌లో ఓడిన రాజస్థాన్
- సంజూ శాంసన్ పోరాటం వృథా
- రాణించిన రస్సెల్, కార్తీక్
ఛేదనలో శుభారంభం. 100 పరుగులు దాటినా ఒక్కటే వికెట్. ఇంకేముంది రాయల్స్ విజయం నల్లేరు మీద నడకే అనిపించింది. కానీ చేతిలో వికెట్లు ఉన్నా.. భారీ షాట్ల ఆడలేని రాజస్థాన్ రాయల్స్ భారీ మూల్యమే చెల్లించుకున్నది. కోల్‌కత నైట్‌రైడర్స్‌తో ఎలిమినేటర్‌లో ఓటమిపాలై.. ఐపీఎల్ 11 నుంచి నిష్క్రమించింది. బౌలర్ల మెరుపులతో రాయల్స్‌ను నిలువరించిన నైట్‌రైడర్స్.. శుక్రవారం క్వాలిఫయర్-2లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఫైనల్స్ బెర్త్ కోసం పోటీపడనున్నది.
నవతెలంగాణ-కోల్‌కత
నిన్న చెన్నై, హైదరాబాద్ తొలి క్వాలిఫయర్. సన్‌రైజర్స్ ఫైనల్స్‌కు చేరటం ఖాయమనిపించింది. కానీ డుప్లెసిస్ పోరాటం చెన్నైని తుది సమరానికి తీసుకెళ్లింది. నేడు రాజస్థాన్, కోల్‌కత ఎలిమినేటర్ పోరు. ఛేదనలో రాజస్థాన్ లక్ష్యం చేరుకున్నట్టే అనిపించింది. కానీ హిట్టింగ్ చేయలేని రాయల్స్‌ను కోల్‌కత 25 పరుగుల తేడాతో ఓడించింది. ఫైనల్స్ బెర్త్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో అమీతుమీకి సిద్ధమైంది. ఆసక్తిరేపిన ఎలిమినేటర్‌లో రాయల్స్ మరోమారు నిరాశపరిచింది. 170 పరుగుల ఛేదనలో నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 144 పరుగులు మాత్రమే చేయగల్గింది. ఛేదనలో యువ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ (50, 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ అజింక్య రహానె (46, 41 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) పోరాటం వృథా అయ్యింది. కోల్‌కత బౌలర్లు కట్టుదిట్టమైన బంతులతో పరుగుల పొదుపు పాటించి.. క్వాలిఫయర్-2కు అర్హత సాధించారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత నైట్‌రైడర్స్ 169 పరుగులు చేసింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్ (52, 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్థ సెంచరీకి తోడు ఆల్‌రౌండర్ అండ్రూ రస్సెల్ (49 నాటౌట్, 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్ కోల్‌కతకు భారీ స్కోరు అందించింది.
ఛేదనలో చతికిల : ఛేదనలో రాజస్థాన్ ఇన్నింగ్స్ గొప్పగా మొదలై, అద్భుతంగా సాగి, చెత్తగా ముగిసింది. ఓపెనర్లు అజింక్య రహానె (46), రాహుల్ త్రిపాఠి (20) దూకుడుగా ఆడటంతో తొలి వికెట్‌కు రాయల్స్ 47 పరుగులు జోడించింది. త్రిపాఠి అవుటైనా.. ఫామ్‌లో ఉన్న యువ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ (50) తోడుగా రహానె ఇన్నింగ్స్ నడిపించాడు. ఐతే వికెట్లు నిలుపుకున్నా.. వేగంగా పరుగులు చేయటంలో రాయల్స్ వెనకంజ వేసింది. రహానె 41 బంతుల్లో 46 పరుగులే చేశాడు. 37 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించిన సంజూ శాంసన్.. దూకుడుతో రాయల్స్‌ను గెలిపిస్తాడనే ఆశలు ఇన్నింగ్స్ 17వ ఓవర్లో ఆవిరయ్యాయి. ఫీఫ్టీ సాధించిన వెంటనే సంజూ వికెట్ కోల్పోయాడు. తర్వాత వచ్చిన హెన్రిచ్ క్లాసెన్ (18, 18 బంతుల్లో 1 ఫోర్) తీవ్రంగా నిరాశపరిచాడు. ఆఖరి 18 బంతుల్లో 43 పరుగులు అవసరం కాగా.. ఆ సమయంలోనూ రాయల్స్ బౌండరీలు సాధించలేకపోయింది. స్టువర్ట్ బిన్ని (0), గౌతం (9) నిరాశపరిచారు. ఓ దశలో విజయం ఖాయమనిపించినా... దూకుడు లేమి రాయల్స్‌ను దెబ్బకొట్టింది. కోల్‌కత స్పిన్నర్ పియూష్ చావ్లా (2/24) రాణించాడు.
రాణించిన కార్తీక్, రస్సెల్ : టాస్ నెగ్గిన రాజస్థాన్ రాయల్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నది. సొంతగడ్డపై జరుగుతున్న ప్లే ఆఫ్స్‌లో కోల్‌కతకు ఆశించిన ఆరంభం లభించలేదు. రాయల్స్ బౌలర్లు టాప్ ఆర్డర్‌ను సాగనంపటంతో కోల్‌కత జోరు తగ్గింది. సునీల్ నరైన్ (4), క్రిస్ లిన్ (18, 22 బంతుల్లో 2 ఫోర్లు) స్వేచ్ఛగా ఆడేందుకు ఇబ్బంది పడ్డారు.. రాబిన్ ఉతప్ప (3), నితీశ్ రానా (3)లు విఫలమయ్యారు. 51/4తో కోల్‌కత కష్టాల్లో పడింది. బలమైన రాజస్థాన్ బౌలింగ్‌కు ఎదురొడ్డి నైట్‌రైడర్స్ మెరుగైన స్కోరు సాధించటం గగగమనే అనిపించింది. కానీ కెప్టెన్ దినేశ్ కార్తీక్ (52, 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. కార్తీక్‌కు యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (28, 17 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) నుంచి చక్కటి సహకారం లభించింది. వీరిద్దరూ ఐదో వికెట్‌కు ఫిఫ్టీ ప్లస్ భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో కోల్‌కత ఇన్నింగ్స్ గాడిలో పడింది. లోయర్ ఆర్డర్లో అండ్రూ రస్సెల్ (49 నాటౌట్, 25 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. ఐదు సిక్సర్లు, మూడు ఫోర్లతోనే 42 పరుగులు పిండుకున్న రస్సెల్.. కోల్‌కతకు మంచి స్కోరు అందించాడు. రస్సెల్ మెరుపులతో కోల్‌కత 169 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో కృష్ణప్ప గౌతం (2/15), జోఫ్రా ఆర్చర్ (2/33), బెన్ లాంగ్లిన్ (2/35) రెండేసి వికెట్లు పడగొట్టారు.
కోల్‌కత ఇన్నింగ్స్ : సునీల్ నరైన్ (స్టంప్డ్) క్లాసెన్ (బి) గౌతం 4, క్రిస్ లిన్ (సి,బి) శ్రేయాష్ గోపాల్ 18, రాబిన్ ఉతప్ప (సి,బి) గౌతం 3, నితీశ్ రానా (సి) ఉనద్కత్ (బి) ఆర్చర్ 3, దినేశ్ కార్తీక్ (సి) రహానె (బి) లాంగ్లిన్ 52, శుభ్‌మన్ గిల్ (సి) క్లాసెన్ (బి) ఆర్చర్ 28, అండ్రూ రస్సెల్ 49, సీర్లెస్ (సి) ఆర్చర్ (బి) లాంగ్లిన్ 2, పియూష్ చావ్లా నాటౌట్ 0, ఎక్స్‌ట్రాలు : 10, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 169.
వికెట్ల పతనం : 1-4, 2-17, 3-24, 4-51, 5-106, 6-135, 7-164.
బౌలింగ్ : కృష్ణప్ప గౌతం 3-0-15-2, జోఫ్రా ఆర్చర్ 4-0-33-2, జైదేవ్ ఉనద్కత్ 2-0-33-0, ఇశ్ సోధి 4-0-15-0, శ్రేయాష్ గోపాల్ 4-0-34-1, బెన్ లాంగ్లిన్ 3-0-35-2.
రాజస్థాన్ ఇన్నింగ్స్ : అజింక్య రహానె (సి,బి) కుల్దీప్ యాదవ్ 46, రాహుల్ త్రిపాఠి (సి,బి) పియూష్ చావ్లా 20, సంజూ శాంసన్ (సి) సీర్లెస్ (బి) చావ్లా 50,, హెన్రిచ్ క్లాసెన్ నాటౌట్ 18, స్టువర్ట్ బిన్ని (సి) లిన్ (బి) ప్రసిద్ కృష్ణ 0, కృష్ణప్ప గౌతం నాటౌట్ 9, ఎక్స్‌ట్రాలు : 01, మొత్తం : (20 ఓవర్లలో 4 వికెట్లకు) 144.
వికెట్ల పతనం : 1-47, 2-109, 3-126, 4-130.
బౌలింగ్ : అండ్రూ రస్సెల్ 3-0-22-0, ప్రసిద్ కృష్ణ 4-0-28-1, పియూష్ చావ్లా 4-0-24-2, సునీల్ నరైన్ 4-0-39-0, కుల్దీప్ యాదవ్ 4-0-18-1, సీర్లెస్ 1-0-13-0.