Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐపీఎల్11 ఫైనల్లో హైదరాబాద్
- క్వాలిఫయర్2లో కోల్‌కతపై గెలుపు
- రాణించిన రషీద్ ఖాన్, షకిబ్
- ఛేదనలో క్రిస్ లిన్ పోరాటం వృథా
అత్యుత్తమ జట్లే ఐపీఎల్ 11 ఫైనల్లో అడుగుపెట్టాయి. స్ఫూర్తిదాయక బ్యాటింగ్, కండ్లుచెదిరే బౌలింగ్ మెరుపులతో పరిపూర్ణ విజయాలు సాధించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ టైటిల్ పోరుకు చేరుకున్నది. ఈడెన్ క్వాలిఫయర్2 పోరులో లోకల్ జట్టు కోల్‌కత నైట్‌రైడర్స్‌ను చిత్తు చేసిన సన్‌రైజర్స్ రెండోసారి ఐపీఎల్ ఫైనల్లోకి ప్రవేశించింది. క్వాలిఫయర్1లో చెన్నై చేతిలో కంగుతిన్న ఆరెంజ్ ఆర్మీ.. అంతిమ పోరాటంలో ప్రతీకారంతో పాటు టైటిల్ సాధించేందుకు రంగం సిద్ధం చేసింది!.
ఐపీఎల్ నాకౌట్ సమరంలో మరో అనూహ్యం. బ్యాట్‌తో తడబడిన సన్‌రైజర్స్.. రషీద్ ఖాన్ విజృంభిస్తే గానీ మెరుగైన స్కోరు చేయలేదు. ఇక బంతితోనూ కోల్‌కతను ఆరంభంలో నిలువరించలేదు. కానీ కార్తీక్సేనను నెమ్మదిగా స్పిన్ ఉచ్చులో పడేసిన సన్‌రైజర్స్ ఉత్కంఠ మ్యాచ్‌లో గెలుపొందింది. రషీద్ ఖాన్, షకిబ్ అల్ హసన్‌లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టారు. చెన్నై, హైదరాబాద్ మధ్య ఐపీఎల్ టైటిల్ పోరు ఈ ఆదివారమే.
నవతెలంగాణ-కోల్‌కత
ఐపీఎల్11 ఫైనల్లో హైదరాబాద్. బౌలర్ల మెరుపులతో గ్రూప్ దశలో అగ్రస్థానంలో నిలిచిన ఆరెంజ్ ఆర్మీ.. అదే బౌలర్ల అండతో టైటిల్ పోరుకు చేరుకున్నది. క్వాలిఫయర్-2లో కోల్‌కతపై 13 పరుగుల తేడాతో గెలుపొందిన హైదరాబాద్.. ఆదివారం చెన్నైతో అంతిమ పోరుకు రంగం సిద్ధం చేసుకున్నది. రషీద్ ఖాన్ (2/19), బ్రాత్‌వైట్ (2/16), షకిబ్ (1/16)రాణించటంతో కోల్‌కతను 161 పరుగులకే పరిమితం చేసింది. కోల్‌కత ఓపెనర్ క్రిస్ లిన్ (48, 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్ (30) పోరాటం వృథా అయ్యింది. అంతకు ముందు తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఓపెనర్లు శిఖర్ ధావన్ (34), వృద్దిమాన్ సాహా (35) శుభారంభానికి తోడు రషీద్ ఖాన్ (34 నాటౌట్, 10 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసంతో 174 పరుగులు చేసింది. కోల్‌కత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (2/29) రాణించాడు. బ్యాట్‌తో, బంతితో మెరుపు ప్రదర్శన చేసిన రషీద్ ఖాన్ హైదరాబాద్‌ను ఫైనల్ చేర్చటంలో కీలక భూమిక వహించాడు.
స్పిన్ ఉచ్చులో బిగించి.. : 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతకు ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని అందించారు. క్రిస్ లిన్ (48, 31 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), సునీల్ నరైన్ (26, 13 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా పరుగులు రాబట్టి బౌలర్లపై ఒత్తిడి పెంచారు. 87/1తో కోల్‌కత లక్ష్యం దిశగా దూసుకెళ్తోన్న తరుణంలో.. సన్‌రైజర్స్ స్పిన్‌తో దెబ్బకొట్టింది. వరుసగా నితీశ్ (22), ఉతప్ప(2) సహా కార్తీక్ (8), లిన్ (48)లు డగౌట్‌కు చేరుకున్నారు. కోల్‌కత ఛేదనలో ఒక్కసారిగా తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. విధ్వంసకర ఆల్‌రౌండర్ అండ్రూ రస్సెల్ (3) ఇన్నింగ్స్‌కూ రషీద్ ఖాన్ ముగింపు పలికాడు. దీంతో 118/6తో కోల్‌కత ఓటమి లాంఛనమే అయ్యింది. ఆఖర్లో యువ ఆటగాడు శుభ్‌మన్ గిల్ (30, 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్)) పోరాటం ఓటమి అంతరం తగ్గేందుకు తోడ్పడింది. ఆఖరి ఓవర్లో 19 పరుగులు చేయాల్సి ఉండగా.. బ్రాత్‌వైట్ రెండు వికెట్లు కూల్చి కోల్‌కత ఆశలపై నీళ్లు చల్లాడు.
రషీద్ ఖాన్ కొసమెరుపు : తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ చాలా నెమ్మదిగా ఆరంభమైనా.. ఓపెనర్లు శుభారంభం అందించారు. టెయిలెండర్ రషీద్ ఖాన్ (34 నాటౌట్, 10 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) విధ్వంసక ఇన్నింగ్స్ హైదరాబాద్ మెరుగైన స్కోరు చేసేలా చేసింది. ఓపెనర్లు శిఖర్ ధావన్ (34, 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్), వృద్దిమాన్ సాహా (35, 27 బంతుల్లో 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 56 పరుగులు జోడించారు. పవర్ ప్లేలో పరుగుల వేగం తగ్గినా.. భారీ స్కోరుకు ఆశలు కల్పించారు. కానీ చైనామన్ చిన్నోడు కుల్దీప్ యాదవ్ సన్జోరుకు కళ్లెం వేశాడు. ఒకే ఓవర్లో ధావన్, కేన్ విలియమ్సన్ (3)లను అవుట్ చేసి హైదరాబాద్‌ను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. మిడిల్ ఆర్డర్లో షకిబ్ అల్ హసన్ (28, 24 బంతుల్లో 4 ఫోర్లు), దీపక్ హుడా (19)లు రాణించారు. ఆఖర్లో అఫ్ఘాన్ గన్ రషీద్ ఖాన్ (34) సంచలన బ్యాటింగ్ విన్యాసంతో హైదరాబాద్‌కు 174 పరుగుల భారీ స్కోరు అందించాడు. నాలుగు సిక్సర్లు సహా 2 రెండు ఫోర్లు బాదిన రషీద్ 10 బంతుల్లోనే 34 పరుగులు పిండుకున్నాడు. ఆఖరి ఓవర్లో రషీద్ ఖాన్, భువనేశ్వర్ జోరుతో హైదరాబాద్ ఏకంగా 24 పరుగులు సాధించింది.
హైదరాబాద్ ఇన్నింగ్స్ : సాహా (స్టంప్డ్) కార్తీక్ (బి) చావ్లా 35, శిఖర్ ధావన్ (ఎల్బీ) కుల్దీప్ 34, కేన్ విలియమ్సన్ (సి) కార్తీక్ (బి) కుల్దీప్ 3, షకిబ్ రనౌట్ (కుల్దీప్) 28, దీపక్ హుడా (సి) చావ్లా (బి) నరైన్ 19, యూసుఫ్ (సి) చావ్లా (బి) మవి 3, బ్రాత్‌వైట్ రనౌట్ (రానా/కార్తీక్) 8, రషీద్ ఖాన్ నాటౌట్ 34, భువనేశ్వర్ కుమార్ నాటౌట్ 5, ఎక్స్‌ట్రాలు : 05, మొత్తం : (20 ఓవర్లలో 7 వికెట్లకు) 174.
బౌలింగ్ : శివం మవి 4-0-33-1, ప్రసిద్ కృష్ణ 4-0-56-0, రస్సెల్ 1-0-9-0, నరైన్ 4-0-24-1, చావ్లా 3-0-22-1, కుల్దీప్ 4-0-29-2.
కోల్‌కత ఇన్నింగ్స్ : క్రిస్ లిన్ (ఎల్బీ) రషీద్ ఖాన్ 48, సునీల్ నరైన్ (సి) బ్రాత్‌వైట్ (బి) కౌల్ 26, నితీశ్ రానా రనౌట్(రషీద్/సాహా) 22, రాబిన్ ఉతప్ప (బి) రషీద్ ఖాన్ 2, దినేశ్ కార్తీక్ (బి) షకిబ్ 8, శుభ్‌మన్ గిల్ (సి) రషీద్ ఖాన్ (బి) బ్రాత్‌వైట్ 30, అండ్రూ రస్సెల్ (సి) ధావన్ (బి) రషీద్ ఖాన్ 3, పియూశ్ చావ్లా (బి) పియూశ్ చావ్లా 12, శివం మవి (సి) రషీద్ ఖాన్ (బి) బ్రాత్‌వైట్ 0, కుల్దీప్ యాదవ్ నాటౌట్ 1, ప్రసిద్ కృష్ణ నాటౌట్
బౌలింగ్ : భువనేశ్వర్ కుమార్ 4-0-38-0, ఖలీల్ అహ్మద్ 3-0-38-0, సిద్దార్థ్ కౌల్ 4-0-32-2, రషీద్ ఖాన్ 4-0-19-3, బ్రాత్‌వైట్ 2-0-16-2, షకిబ్ 3-0-16-1.