Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలెగ్జాండర్ మెరుపు గోల్
- కోస్టారికాపై 1-0తో గెలుపు
నవతెలంగాణ-మాస్కో
ఆధిక్యం అటో ఇటో తెలియక, అయోమయంగా సాగుతున్న మ్యాచ్‌లో అలెగ్జాండర్ కలరోవ్ కండ్లుచెదిరే ఫ్రీ కిక్‌తో సెర్బియాను విజేతగా నిలిపాడు. గ్రూప్-ఈలో జరిగిన తొలి మ్యాచ్‌లో బోణీ కొట్టిన సెర్బియా పాయింట్ల పట్టికలో ముందంజ వేసింది. ద్వితీయార్థంలో లభించిన ఫ్రీ కిక్‌ను నేర్పుగా గోల్‌గా మలిచాడు సెర్బియా సారథి. దీంతో 1-0 ఆధిక్యం సాధించిన సెర్బియా.. బలమైన డిఫెన్స్‌తో ప్రత్యర్థికి గోల్ కోల్పోకుండా విజయం సొంతం చేసుకున్నది. ప్రథమార్థంలో కోస్టారికా మెరుగైన ప్రదర్శన చేసింది. ఓ దశలో ఆరంభంలోనే కార్నర్ నుంచి సెర్బియాకు షాకిచ్చేలా కనిపించింది. కానీ అలెగ్జాండర్ సెర్బియాను కాపాడాడు!. డిఫెన్స్‌లో, ఎటాకింగ్‌లో, బంతి నియంత్రణలో సెర్బియాతో కోస్టారికా సమవుజ్జీగా నిలిచింది. రెండు జట్లూ పది గోల్ ప్రయత్నాలు చేయగా, రెండు జట్లూ మూడుసార్లు గోల్ పోస్ట్‌పైకి దూసుకొచ్చారు. ఇక రెండు జట్లకూ రెండేసి ఎల్లో కార్డులు సైతం లభించాయి. కోస్టారికాకు 18 ఫ్రీ కిక్‌లు లభించగా.. సెర్బియాకు 19 ఫ్రీ కిక్ అవకాశాలు వచ్చాయి. వాటిలో ఓ ఫ్రీ కిక్‌ను సద్వినియోగం చేసుకున్న సెర్బియా గ్రూప్‌లో తొలి విజయం నమోదు చేసింది. 90 నిమిషాల ఆట తర్వాత ఇంజూరీ సమయంలో కోస్టారికా గోల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసింది. వేగంగా అవకాశాలు సృష్టించుకున్నది. కానీ సెర్బియా డిఫెన్స్‌ను ఆ జట్టు ఛేదించలేదు. మ్యాచ్‌లో ఎక్కువ ఒత్తిడికి గురైన కోస్టారియా.. ఫలితంగా గోల్ ఖాతా తెరవలేకపోయింది. సెర్బియాకు గోల్‌తో విజయాన్ని అందించిన అలెగ్జాండర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.