Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్‌లో ఆతిథ్య జట్టుొ3-1తో ఈజిప్ట్‌పై మెరుపు విజయం
ఆతిథ్య జట్టు హోదాలో ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత!. ప్రపంచ కప్ సమరానికి ముందు ఆరు మాసాల పాటు గెలుపు రుచి ఎరుగదు. కానీ ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో రష్యా గెలుస్తుందని 'చెవిటి పిల్లి' జోస్యం చెప్పినా.. పెద్దగా ఎవ్వరికీ నమ్మకం కుదరలేదు. కానీ సొంత అభిమానుల నడుమ రష్యన్ల దూకుడుకు అడ్డుకట్ట వేయటం ప్రత్యర్థులకు సాధ్యం పడటం లేదు. ఆరంభంలోనే సౌదీ అరేబియాను 5-0తో చిత్తు చేసిన రష్యా.. తాజాగా ఈజిప్ట్‌ను 3-1తో మట్టికరిపించింది. వరుస విజయాలతో గ్రూప్-ఏలో ముందంజలో నిలిచిన రష్యా ప్రీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్ బెర్త్ ఖాయం చేసుకున్న తొలి జట్టు రష్యా.
నవతెలంగాణ-మాస్కో
ఫిఫా ప్రపంచకప్‌లో ఆతిథ్య రష్యా మరో అడుగు ముందుకేసింది. మెగా టోర్నీలో వరుసగా రెండో భారీ విజయం సాధించిన రష్యా ప్రీ క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. తొలి మ్యాచ్‌లో సౌదీ అరేబియాపై దూకుడు ప్రదర్శించినట్టుగానే ఈజిప్ట్పైనా రష్యన్లు దండెత్తారు. ప్రస్తుత ఫుట్‌బాల్ ప్రపంచం హీరో మహ్మద్ సలా ఈజిప్ట్ తరఫున బరిలోకి దిగినా.. రష్యా దూకుడును, విజయాన్ని ఆపలేకపోయాడు. ఈజిప్ట్ తొలుత సెల్ఫ్ గోల్‌తో రష్యాకు ఆధిక్యం అందివ్వగా.. ద్వితీయార్థంలో ఎటాకింగ్ చేసిన రష్యా రెండు గోల్స్ కొట్టింది. ఆఖర్లో పెనాల్టీతో గోల్ కొట్టిన మహ్మద్ సలా.. 1990 తర్వాత ఈజిప్ట్‌కు ప్రపంచకప్‌లో తొలి గోల్ అందించటమే కాదు తనూ ఫిఫా వరల్డ్‌కప్‌లో గోల్స్ ఖాతా తెరిచాడు. రెండు భారీ విజయాలు సాధించిన రష్యా.. గ్రూప్ దశలో ఆఖరి మ్యాచ్‌లో ఉరుగ్వేతో తలపడనున్నది. రెండు మ్యాచుల్లో 8 గోల్స్ కొట్టిన రష్యా ప్రత్యర్థికి ఒక్క గోల్ మాత్రమే కోల్పోయింది.
సలా మ్యాజిక్ లేదు : సుమారు 26 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈజిప్ట్ ఫిఫా ప్రపంచకప్‌లో కాలుమోపింది. అందుకు కారణం సాకర్ సంచలనం మహ్మద్ సలా. చాంపియన్స్ లీగ్ ఫైనల్లో భుజం గాయం కారణంగా తొలి మ్యాచ్‌లో సలా ఆడలేదు. కానీ రష్యాతో మ్యాచ్‌కు సూపర్ స్టార్ సలా సేవలు ఈజిప్ట్‌కు ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్‌లో ఫలితం భిన్నంగా ఉండటమే కాదు ఆట ఆసక్తికరంగానూ సాగుతుందని అభిమానులు ఆశించారు. నమ్మశక్యం కానీ రీతిలో గోల్స్ కొట్టగల సలా.. రష్యాతోనూ ఆ మ్యాజిక్ పునరావృతం చేసేందుకు ప్రయత్నించాడు. ఆట ఆరంభంలోనే గోల్ పోస్ట్ ముందు ఓ రివర్స్ కిక్‌తో మెరిసిన సలా.. కొద్దిలో మిస్సయ్యాడు. మరోమారు బంతి గోల్ పోస్ట్ బార్ పైనుంచి వెళ్లిపోయింది. ఈజిప్ట్ ఆటగాళ్లే బంతిని ఎక్కువ సమయం నియంత్రణలో ఉంచుకున్నా.. దూకుడు మాత్రం రష్యాదే. 47వ నిమిషంలో రొమన్ జొబన్ కిక్.. గోల్ పోస్ట్‌కు కాస్త దూరంగానే వెళ్తోంది, కానీ అక్కడే మొహరించిన ఈజిప్ట్ కెప్టెన్ అహ్మద్ ఫతి కాలుతో అడ్డగించాడు. దీంతో బంతి గమనం మార్చుకుని గోల్‌పోస్ట్‌లోకి వెళ్లింది. దీంతో సెల్ఫ్‌గోల్‌తో ఈజిప్టే ప్రత్యర్థికి ఆధిక్యాన్ని కట్టబెట్టింది. కానీ నాలుగు నిమిషాల వ్యవధిలో రెండు మెరుపు గోల్స్ కొట్టిన రష్యా మ్యాచ్‌ను స్వాధీన పర్చుకున్నది. డెనిస్ చెరిసెవ్ 59వ నిమిషంలో గోల్ కొట్టగా, అర్టెం జ్కూబా 62వ నిమిషంలో గోల్ కొట్టాడు. వీరిద్దరూ గోల్ పోస్ట్ ముందే నాటకీయ ఫక్కీలో గోల్స్ కొట్టడం విశేషం. 73వ నిమిషంలో మహ్మద్ సలాకు పెనాల్టీ లభించగా.. ఈజిప్ట్‌కు ఊరట గోల్ దక్కింది. ఇంజూరీ సమయంలోనూ ఈజిస్ట్ మ్యాజిక్ కనిపించలేదు. ఈజిప్ట్ 13 సార్లు గోల్ ప్రయత్నాలు చేసినా.. అందులో ఒక్కటే గోల్పోస్ట్పైకి వచ్చింది, కాగా దానినీ రష్యా గోల్ కీపర్ సమర్థవంతంగా అడ్డుకున్నాడు. తొలి రెండు మ్యాచుల్లోనూ ఓడిన ఈజిప్ట్.. తర్వాతి మ్యాచ్‌లో సౌదీ అరేబియాతో భారీ తేడాతో నెగ్గితే కానీ తర్వాతి రౌండ్‌కు చేరుకునే అవకాశాలు లేవు. లేదంటే ఫిఫా ప్రపంచకప్ సంబురం ఈజిప్ట్‌కు గ్రూప్ దశలోనే ముగిసే ప్రమాదం లేకపోలేదు.
ఆటలో ఎవరెలా..
రష్యా ఈజిప్ట్
03 గోల్స్ 01
11 గోల్ ప్రయత్నాలు 13
07 కార్నర్లు 04
47% బంతి నియంత్రణ 53%
76% పాస్ కచ్చితత్వం 81%
01 ఎల్లో కార్డులు 01