Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మాస్కో : స్విట్జర్లాండ్ సూపర్ ప్రదర్శన కొనసాగుతోంది. బ్రెజిల్‌కు విజయాన్ని ఇవ్వకుండా అడ్డుకున్న స్విట్జర్లాండ్ ఫిఫా ప్రపంచకప్‌లో దిగ్గజ జట్టుకు షాకిచ్చింది. ఇప్పుడు ప్రత్యర్థికి ఆరంభంలోనే గోల్ కోల్పోయినా.. తర్వాత పుంజుకుని విజయం సాధించింది. తాజా ప్రపంచకప్‌లో తొలుత గోల్ కోల్పోయి, పుంజుకుని నెగ్గిన ఏకైక జట్టు స్విట్జర్లాండ్ కావటం విశేషం. ప్రథమార్థంలో 0-1తో వెనుకంజ వేసిన స్విస్.. సెకండ్ హాఫ్‌లో రెండు గోల్స్‌తో మెరుపు విజయం సాధించింది. 90వ నిమిషంలో చేసిన గోల్ స్విస్‌కు ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని కట్టబెట్టింది. ఆరంభ గోల్‌తో నాకౌట్ చేరినట్టే అనుకున్న సెర్బియాకు ఆఖర్లో షాక్ తగిలింది. ఇప్పుడు బ్రెజిల్‌తో పోరులో నెగ్గితేనే సెర్బియా నాకౌట్ ఆశలు సజీవంగా నిలిచేది. మరోవైపు 2-1తో గెలుపొందిన స్విట్జర్లాండ్ తన నాకౌట్ అవకాశాలను మెరుగుపర్చుకున్నది.
ఔరా.. ఏమా గోల్! : బ్రెజిల్‌ను నిలువరించిన విశ్వాసం స్విస్ వైపు, ఓ విజయంతో నాకౌట్ వెళ్లాలనే ఆరాటం సెర్బియా వైపు. దీంతో గ్రూప్-ఈలో మరో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఐతే 5వ నిమిషంలోనే సెర్బియాకు గోల్ అందించిన అలెగ్జాండర్ మిట్రోవిక్ ఆ జట్టును ముందంజలో నిలిపాడు. బంతి నియంత్రణలో స్విస్ ఆధిపత్యమే నడిచినా, గోల్ ప్రయత్నాల్లోనూ ఆ జట్టు చురుగ్గా కదిలినా.. స్విస్ గోల్ ఖాతా తెరువలేదు. కానీ ద్వితీయార్థంలో గ్రానిట్ కాకా స్విస్‌కు కండ్లుచెదిరే గోల్ కొట్టాడు. అప్పటికే ఓ గోల్ ప్రయత్నాన్ని అడ్డుకున్న సెర్బియా.. కాకా నుంచి ఈ ప్రమాదాన్ని ఊహించలేదు. కానీ సుమారు 30 అడుగుల దూరం నుంచి స్ట్రయిక్ కిక్ కొట్టిన కాకా గోల్ సాధించాడు. నిజానికి, సెర్బియా అతడి నుంచి పాస్ ఆశించగా.. అతడు అనూహ్యంగా గోల్ కొట్టేశాడు. ప్రపంచకప్‌లోనే హైలైట్ గోల్స్లలో ఇది ఒకటి. కాకా గోల్‌తో 1-1తో సమవుజ్జీల సమరంలో.. ఆఖరి క్షణాల్లో మరో అద్భుతం చోటుచేసుకున్నది. అప్పటికే ఒకట్రెండు అవకాశాలు క్రాస్ బార్‌కు పరిమితం కాగా.. మరింత కసితో కదిలిన షకిరి 90వ నిమిషంలో గోల్ సాధించాడు. దీంతో 2-1తో స్విట్జర్లాండ్ ఘన విజయం సాధించింది. సెర్బియా నాకౌట్ ఆశలను నిరీక్షణలో పెట్టేసింది.
సెర్బియా స్విట్జర్లాండ్
01 గోల్స్ 02
12 గోల్ ప్రయత్నాలు 20
03 కార్నర్లు 07
00 ఆఫ్సైడ్లు 03
42 బంతి నియంత్రణ 58
78 పాస్ కచ్చితత్వం 87
04 ఎల్లో కార్డులు 01
17 ఫౌల్స్ 12