Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలిసారి ప్రపంచకప్ ఫైనల్లో అడుగు
- పెరిసిచ్, మంజుకిచ్ చారిత్రక గోల్స్
- 2-1తో సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై గెలుపు
- ముగిసిన మూడు సింహాల వేట
ఫిఫా ప్రపంచకప్‌లో సంచలనాల మోత కొనసాగుతోంది. గ్రూప్ దశ నుంచే సంచలనాలకు శ్రీకారం చుట్టిన క్రోయేషియా సెమీఫైనల్లోనూ అద్భుతాన్ని ఆవిష్కరించింది. అర్థ శతాబ్దం తర్వాత మరోమారు ప్రపంచకప్ ముద్దాడాలని ఉవ్విళ్లూరిన ఇంగ్లాండ్‌కు ఆ జట్టు చెక్ పెట్టింది. అదనపు సమయానికి దారితీసిన రెండో సెమీఫైనల్లో వీరోచిత విన్యాసంతో ఇంగ్లీష్ జట్టును మట్టికరిపించింది. 2-1తో చారిత్రక విజయం సాధించి, తొలిసారి ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఫిఫా ప్రపంచకప్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఆరంభం నుంచీ ఏమాత్రం అంచనాల్లేని జట్టు. సెమీస్‌లోనూ అదే సీన్. స్టార్స్‌తో కూడిన ఇంగ్లాండ్‌ను ఎదుర్కొవటం అంత సులువు కాదన్నారు. అందుకు తగినట్టుగానే ఆరంభంలోనే ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆట మరో 20 నిమిషాల్లో ముగుస్తుందనగా కానీ క్రోయేషియా తొలి గోల్ కొట్టలేదు. కానీ సమవుజ్జీగా నిలిచిన తర్వాత ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచిన క్రోయేషియా.. అదనపు సమయంలో గెలుపు గోల్ కొట్టేసింది. ప్రపంచ పటంలో అతి చిన్న దేశం ప్రపంచకప్ గెల్చుకునే అరుదైన అద్భుతం ముంగిట క్రోయేషియా నిలిచింది. సంచలనాల క్రోయేషియా ఆదివారం జరిగే ఫైనల్లో ఫ్రాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనున్నది.
మాస్కో (లుజ్నికి స్టేడియం)
గ్రూప్ దశలో అర్జెంటీనా, నాకౌట్లో వరుసగా షూటౌట్లు, సెమీస్‌లో ఏకంగా మాజీ చాంపియన్‌కు దిమ్మదిరిగే షాక్. ఇదీ ప్రపంచకప్‌లో ఏ మాత్రం అంచనాల్లేని క్రోయేషియా సంచలన ప్రస్థానం. చారిత్రక ఫైనల్స్ పోరు ఊరిస్తున్న వేళ సెమీఫైనల్లో జీవన్మరణ సమస్యగా పోరాడిన క్రోయేషియా ఆటగాళ్లు.. ఆ జట్టును తొలిసారి ప్రపంచకప్ ఫైనల్లోకి తీసుకెళ్లారు. 68వ నిమిషంలో పెరిసిచ్ గోల్ కొట్టగా, (అదనపు సమయం రెండో అర్థ భాగం) 109వ నిమిషంలో మంజుకిచ్ క్రోయేషియా చరిత్ర సృష్టించేలా చేశాడు. హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ సైతం మెరుగ్గానే ఆడినా.. గోల్ పోస్ట్‌లోకి రెండుసార్లు బంతిని పంపించిన క్రోయేషియానే విజయం వరించింది. ఆట ఆరంభమైన ఐదో నిమిషంలోనే బాక్స్ బయట క్రోయేషియా ఫౌల్ అయ్యింది. దీంతో ఇంగ్లాండ్‌కు ఫ్రీ కిక్ లభించింది. ఇంగ్లాండ్ మిడ్‌ఫీల్డర్ ట్రిప్పర్ ఫ్రీ కిక్‌ను అలవోకగా గోల్‌పోస్ట్‌లోకి నెట్టేశాడు. దీంతో 5వ నిమిషంలోనే ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యం సాధించి, ముందస్తు సంబురాలు చేసుకున్నది. కానీ ఆట ఆఖర్లో గోల్ కొట్టిన క్రోయేషియా ఫైనల్స్ సంబురాల్లో మునిగితేలింది.
ఇంగ్లాండ్ది ఆరంభం : క్రోయేషియా సంచలన యాత్ర, ఆ జట్టు మిడ్‌ఫీల్డ్ బలం ఎలాగున్నా.. రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. అందుకు తగినట్టుగానే ఇంగ్లాండ్ దూకుడుగా ఆడింది. క్రోయేషియా గోల్‌పోస్ట్ వైపు ధాటిగా దూసుకెళ్లింది. ఈ క్రమంలో క్రోయేషియా ఐదో నిమిషంలో ఇంగ్లాండ్‌కు ఓ అవకాశం కోల్పోయింది. మోద్రిచ్ ఫౌల్ కావటంతో ఇంగ్లాండ్‌కు ఫ్రీ కిక్ లభించింది. బాక్స్ బయట నుంచి ట్రిప్పర్ కండ్లుచెదిరే రీతిలో బంతిని స్పిన్ చేస్తూ గోల్ పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో ఇంగ్లాండ్ ఐదు నిమిషాల్లోపే 1-0 ఆధిక్యం సాధించింది. ఆధిక్య ఉత్సాహంలో ఇంగ్లాండ్ మరింత దూకుడుగా ఆడింది. 30వ నిమిషంలో ఆ జట్టు స్టార్ ఆటగాడు, కెప్టెన్ హ్యారీకేన్ ఆధిక్యాన్ని పెంచేలా కనిపించాడు. గోల్ పోస్ట్ ముందు బంతి దొరకబుచ్చుకున్న హ్యారీకేన్ గోల్ ప్రయత్నం చేశాడు. తొలి షాట్‌ను గోల్ కీపర్ అడ్డుకోగా.. మళ్లీ బంతి అందుకుని మరోమారు గురి ఎక్కు పెట్టాడు. కానీ రెండోసారీ హ్యారీకేన్ గురి కుదరలేదు. ఇంగ్లాండ్ ఆధిక్యం మరింత పెరుగ లేదు. ప్రథమార్థం ముగిసే సరికి ఇంగ్లాండ్ 1-0 ఆధిక్యం నిలుపుకున్నది. క్రోయేషియా నుంచి మెరుగైన ప్రయత్నాలు జరిగినా.. అవేవీ ఫలించలేదు.
ముగింపు క్రోయేషియాది : ఆట మరో 22 నిమిషాల్లో ముగుస్తుందనే వరకూ ఇంగ్లాండ్ ఆధిక్యంలోనే కొనసాగింది. కానీ వెనుకంజలో నిలిచినా, పుంజుకోవటం క్రోయేషియాకు ఈ ప్రపంచకప్‌లో కొత్త కాదు. అందుకే, ఆ జట్టు ఆటగాళ్లు ఒత్తిడి దరిచేరకుండా గోల్ ప్రయత్నాల్లో నిమగమయ్యారు. ఇంగ్లాండ్ గోల్‌కీపర్ కొన్ని ప్రయత్నాలను అద్భుతంగా నిలువరించినా.. క్రోయేషియా దూకుడు తగ్గించలేదు. 68వ నిమిషంలో ఆ జట్టుకు ఊరట లభించింది. హాఫ్ సర్కిల్ కార్నర్ నుంచి వచ్చిన పాస్‌ను గోల్ పోస్ట్ ముందు పరుగెడుతూ.. జంప్ చేసి కాలితో బంతి గమనాన్ని మార్చేశాడు పెరిసిచ్. ఇంగ్లాండ్ డిఫెండర్ హెడర్‌తో బంతిని అవతల వైపుకు మళ్లించే ప్రయత్నంలో ఉండగా.. గాల్లోకి ఎగిరి బంతిని అతడికి కంటే ముందుగా అందుకుని గోల్‌పోస్ట్‌లోకి నెట్టేశాడు. దీంతో స్కోరు 1-1తో సమ మైంది. సమవుజ్జీలుగా నిలిచిన తరుణంలో ఇంగ్లాండ్‌పై క్రోయేషియా క్రమం తప్పకుండా దాడులు చేసి ఒత్తిడి పెంచేసింది. ఆరు నిమిషాల ఇంజూరీ సమయంలో కార్నర్ కిక్‌ను ఇంగ్లాండ్ ఆటగాడు జాన్ స్టోన్స్ హెడర్‌తో గోల్ కొట్టినంత పని చేశాడు. కానీ గోల్‌కీపర్‌తో పాటు నిల్చోన్న క్రోయేషియా డిఫెండర్.. ఇంగ్లాండ్ రెండో గోల్‌ను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. 90 నిమిషాల ఆట ముగిసిన తర్వాత కూడా ఫలితం తేలకపోవటంతో 30 నిమిషాల అదనపు సమయానికి దారితీసింది. తొలి అర్థ భాగం (15 నిమిషాలు) మళ్లీ గోల్ నమోదు కాకుండానే ముగిసింది. కానీ రెండో అర్థ భాగం ఆరంభంలోనే క్రోయేషియా సత్తా చాటింది. తొలి గోల్ కొట్టిన పెరిసిచ్.. ఈసారి గోల్ కొట్టడానికి సహకారం అందించాడు. బాక్స్ బయట హెడర్‌తో బంతిని గోల్ పోస్ట్‌కు చేరువగా ఉన్న మంజుకిచ్కు పాస్ చేసిన పెరిసిచ్.. క్రోయేషియా చారిత్రక గోల్లో భాగమయ్యాడు. గోల్ పోస్ట్‌కు ఎడమ వైపు బంతిని అందుకున్న మంజుకిచ్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా బంతిని గోల్‌పోస్ట్‌లోకి పంపించాడు. దీంతో 109వ నిమిషంలో క్రోయేషియా 2-1 ఆధిక్యం సాధించింది. మరో పది నిమిషాలు ఆధిక్యం నిలుపుకోగల్గిన క్రోయేషియా తొలిసారి ప్రపంచకప్ ఫైనల్లోకి ప్రవేశించింది.
సెమీస్‌లో ఎవరెలా..
క్రోయేషియా ఇంగ్లాండ్
02 గోల్ 01
22 గోల్ప్రయత్నాలు 11
07 లక్ష్యంపై షాట్లు 06
01 ఆఫ్సైడ్లు 03
08 కార్నర్లు 04
54 బంతి నియంత్ర 46
79 పాస్ కచ్చితత్వ 79
23 ఫౌల్స్ 14
02 ఎల్లో కార్డులు 01