Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత స్లిప్ క్యాచింగ్‌పై రోడ్స్
ముంబయి : ప్రపంచ క్రికెట్లో బ్యాటింగ్ దిగ్గజం అంటే ఏకాభిప్రాయం కుదరకపోవచ్చు!. అత్యుత్తమ బౌలర్ అనే చర్చపైనా భిన్నాభిప్రాయాలు వస్తూనే ఉంటాయి. కానీ ప్రపంచ క్రికెట్ ముక్త కంఠంతో అంగీకరించే ఫీల్డింగ్ దిగ్గజం జాంటీ రోడ్స్. 1992 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ ఇంజమామ్ ఉల్ హాక్‌ను పక్షిలా ఎగురుతూ రనౌట్ చేసిన సన్నివేశాన్ని ఇప్పటికీ యూట్యూబ్‌లో వీక్షిస్తుంటారు. జాంటీ రోడ్స్ ఫీల్డింగ్ విన్యాసాలకు అంతటి క్రేజ్. బ్యాట్, బంతితోనే కాదు ఫీల్డింగ్‌తోనూ విజయాలు సాధించగలం అని నిరూపించిన ఆటగాడు జాంటీ రోడ్స్. భారత జట్టులోకి యువ రక్తం ప్రవేశించిన తర్వాత ఫిట్నెస్ ప్రమాణాలతో పాటు ఫీల్డింగ్‌లో, పరుగుల పొదపులోనూ విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. కానీ స్లిప్ క్యాచుల విషయంలో కోహ్లిసేన ఇప్పటికీ తడబడుతూనే ఉన్నది. విలువైన క్యాచులు నేలపాలు చేస్తూనే ఉన్నది. స్లిప్స్ విలువైన క్యాచులు నేలపాలు చేయటంతో ఇప్పటికే తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ చేతిలో దిమ్మదిరిగేలా భంగపడిన భారత్.. శనివారం మూడో టెస్టు ఆడనున్నది. ఈ నేపథ్యంలో కోహ్లిసేన స్లిప్ క్యాచింగ్‌పై జాంటీ రోడ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ' క్రికెట్ బంతితో క్యాచులు సాధన చేస్తున్నప్పుడు.. మ్యాచ్ పరిస్థితులపై ఆలోచించే సమయం ఉండదు. కానీ ఇదే ప్రధాన వ్యత్యాసం చూపిస్తోంది. ఇక్కడే ఆటగాళ్లు ' వదిలేయటం'పై ఆలోచించాలి. భారత పిచ్‌లపై సాధారణంగా స్లిప్, గల్లీ క్యాచులు మోకాలి నుంచి కిందకు వస్తాయి. వేళ్లను కిందకు దించుతూ క్యాచులు అందుకుంటాం. కానీ ఆస్ట్రేలియా, దక్షిణఫ్రికా, ఇంగ్లాండ్‌లో పేసర్లకు అదనపు బౌన్స్ లభిస్తుంది. దీంతో ఇక్కడ స్లిప్ క్యాచింగ్ పూర్తి భిన్నం. నేను ముంబయి ఇండియన్స్ (ఐపీఎల్ ప్రాంఛైజీ)తో ఫీల్డింగ్ కోచ్‌గా పని చేశాను. కొందరిని ఆరు వారాల్లో మార్చొచ్చు. నాలుగు వారాల్లోనే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఓ ఏడాది తర్వాత చూస్తే, ఆటగాళ్లు మళ్లీ అదే పాత పొరపాట్లను పునరావృతం చేస్తుంటారు. ఫీల్డింగ్‌లో ఇలాంటి విషయాలను మార్చాలని అనుకుంటే రాత్రికి రాత్రి ఏం చేయలేం' అని రోడ్స్ పేర్కొన్నాడు. మ్యాచ్ పరిస్థితులను ఊహించుకుని అందుకనుగుణంగా ప్రాక్టీస్ చేయాలని మా నాన్న సూచించారు. దక్షిణాఫ్రికా జట్టు విషయానికొస్తే క్యాచులను దిగువగా అందుకోవటం, టర్ఫ్ పిచ్‌లపై సాధన చేయటం చేసేవాళ్లం. సమస్య ఎక్కడుందంటే.. ఎప్పుడైతే తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోతామో, అప్పుడే క్రికెటర్లోని సహజత్వం బయటికొస్తుంది.. స్లిప్ క్యాచ్‌లు నేలపాలవుతాయి' అని రోడ్స్ అభిప్రాయపడ్డాడు.