Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాంగ్‌కాంగ్‌పై అలవోక విజయం
- ఉస్మాన్ ఖాన్, షాదాబ్, హసన్ అలీ విజృంభణ
- ఆసియా కప్‌లో పాకిస్తాన్ బోణీ
దుబాయ్ (యు.ఎ.ఈ) : ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఘనమైన బోణీ కొట్టింది. పసికూన హాంగ్‌కాంగ్‌పై తిరుగులేని విజయంతో ఆసియా కప్‌ను మొదలెట్టింది. తొలుత సీమర్లు నిప్పులు చెరగటంతో హాంగ్‌కాంగ్‌ను స్వల్ప స్కోరుకే కుప్పకూల్చిన పాకిస్థాన్, స్వల్ప లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఉస్మాన్ ఖాన్ (3/19), హసన్ అలీ (2/19), షాదాబ్ ఖాన్ (2/31)లు హాంగ్‌కాంగ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను తుత్తునీయలు చేశారు. పాక్ సీమర్ల ప్రతాపానికి 100లోపే ఆలౌటయ్యేలా కనిపించిన హాంగ్‌కాంగ్..అతి కష్టం మీద 116 పరుగులు చేయగల్గింది. అజీజ్ ఖాన్ (27), కించిత్ షా (26), అన్షుమన్ రాత్ (19), నిజకత్ ఖాన్ (13)లు హాంగ్‌కాంగ్ తరఫున రెండెంకల స్కోరు చేయగలిగారు. ఛేదనలో యువ ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్ (50 నాటౌట్, 69 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) అజేయ అర్ధ సెంచరీతో చెలరేగటంతో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 117 పరుగుల లక్ష్యాన్ని 23.3 ఓవర్లలోనే ఛేదించింది. నేడు జరిగే మరో మ్యాచ్‌లో శ్రీలంకతో అఫ్ఘనిస్థాన్ తలపడనున్నది. సాయంత్రం 5 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం కానున్నది.
సీమర్ల జోరు : తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన హాంగ్‌కాంగ్‌కు బలమైన పాక్ బౌలింగ్ బృందం చుక్కలు చూపించింది. ఆరంభం నుంచీ వికెట్ల జాతర సాగించింది. ఐదో ఓవర్ నుంచి మొదలైన హాంగ్‌కాంగ్ వికెట్ల పతనం నిరంతర ప్రక్రియలా కొనసాగింది. ఉస్మాన్ ఖాన్ మూడు వికెట్లతో విరుచుకుపడగా, హసన్ అలీ, షాదాబ్ ఖాన్లు చెరో రెండు వికెట్లతో హాంగ్‌కాంగ్ భరతం పట్టారు. మిడిల్ ఆర్డర్లో అజీజ్ ఖాన్ (27), కించిత్ షా (26)లు ఫర్వాలేదనిపించారు. 116 పరుగులకు 37.1 ఓవర్లలోనే హాంగ్‌కాంగ్ ఆలౌట్ అయ్యింది.
ఆడుతూ పాడుతూ : స్వల్ప లక్ష్యాన్ని పాకిస్థాన్ ఆడుతూ పాడుతూ ఛేదించింది. విపరీతమైన ఉష్ణ పరిస్థితుల్లో క్రీజులో నిలువటం బ్యాట్స్‌మన్‌కు కష్టతరంగా మారింది. ఐనా, పాక్ ఓపెనర్లు పరిస్థితులకు అనుగుణంగా నెమ్మ దిగానే ఆడారు. ఓపెనర్ ఫకర్ జమాన్ (24, 27 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హాక్‌తో కలిసి బాబర్ ఆజాం (33, 36 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) ముందుకు నడిపాడు. బాబర్ అవుటైనా షోయబ్ మాలిక్ (9)తో కలిసిత ఇమాన్ ఉల్ హాక్ లాంఛనం ముగించాడు.